ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధానికి అత్యవసర చట్టం

ABN , First Publish Date - 2022-06-11T12:58:56+05:30 IST

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ క్రీడ నిషేధం కోసం అత్యవసర చట్టాన్ని రూపొందించే నిమిత్తం మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ

ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధానికి అత్యవసర చట్టం

- జస్టిస్‌ చంద్రూ నేతృత్వంలో కమిటీ

- సీఎం స్టాలిన్‌ ఉత్తర్వులు


చెన్నై, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ క్రీడ నిషేధం కోసం అత్యవసర చట్టాన్ని రూపొందించే నిమిత్తం మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసలైన యువతీ యువకులు, గృహిణులు, విద్యార్థులు లక్షలాది రూపాయలను నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించేందుకు తగు చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఆ మేరకు ఆన్‌లైన్‌ జూదాలన్నింటినీ నిషేధించే విషయమై చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో, ఇతర శాఖల అధికారులతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం సమావేశమై సమగ్రంగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రమ్మీ నిషేధ చట్టాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని, ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణకు నోచుకోకుండా ఉన్న అప్పీలు పిటిషన్‌ తదితరాలపై ఈ సమావేశంలో నిశితంగా చర్చించారు.


గతేడాది ఫిబ్రవరి 25న అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిస్తూ ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆన్‌లైన్‌ క్రీడల నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది ఆగస్టు 3న హైకోర్టు ధర్మాసనం ఆ చట్టం చెల్లదంటూ తేల్చి చెప్పింది. సరైన కారణాలు, ఆధారాలు లేకుండా రూపొందించిన ఆ చట్టం చెల్లదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ గత నవంబర్‌ 13న సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై ఎలాంటి విచారణ లేకుండా పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ రమ్మీవంటి జూదాలను, డబ్బులు చెల్లించి ఆడే గేమ్స్‌ను నిషేధించే దిశగా ప్రత్యేక చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ మేరకు అత్యవసర చట్టాన్ని రూపొందించేందుకు వీలుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కె.చంద్రూ నాయకత్వంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ కమిటీలో ఐఐటీ సాంకేతిక నిపుణుడు డాక్టర్‌ శంకరరామన్‌, ఆత్మహత్యలను నిరోధించే దిశగా సేవలందించే స్నేహ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ లక్ష్మీ విజయకుమార్‌, పోలీసుశాఖ అదనపు డైరెక్టర్‌ వినిత్‌ దేవ్‌ వాఖండే సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆన్‌లైన్‌ రమ్మీ వల్ల జరిగే ఆర్థిక పరమైన నష్టాలు, ఆత్మహత్యలు ఇతర ముప్పులను, ఆ క్రీడల వల్ల కలిగే నష్టాలను, ఆ క్రీడలవైపు ప్రేరేపించే ప్రకటనలు ప్రజలపై చూపుతున్న ప్రభవాలను నిశితంగా పరిశీలించి రెండు వారాల్లోపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Updated Date - 2022-06-11T12:58:56+05:30 IST