Abn logo
Jun 12 2021 @ 00:23AM

మేలుకోకుంటే.. మునకే..!

చిన్నపాటి వర్షాలకే కడప జలమయం

 గత అనుభవాలు గుర్తుపెట్టుకోని వైనం

డ్రైనేజీలు.. కుంటల ఆక్రమణలు తొలగించాలి

లేదంటే వర్షం నీటితో ప్రమాదమే

కడప, జూన 11 (ఆంధ్రజ్యోతి): కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు.. కడప నగరంలో కొన్ని ప్రాంతాలు జలమయమవుతాయి. అదే ఏకధాటిగా కురిస్తే.. లోతట్టు ప్రాంతాల జనాలకు ముంపు భయం పట్టుకుంటుంది. గత నవంబరులో కురిసిన వర్షాలకు బుగ్గవంక పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల జనం వణికిపోయారు. వరద నీరు ఇళ్లను ముంచెత్తడంతో పాటు విలువైన వస్తువులు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయి. దీనంతటికీ ప్రధాన కారణం ఆక్రమణలు... ఆక్రమణలు.. ఆక్రమణలే. డ్రైనేజీ కాల్వలు, చెరువులు, కుంటలు ఆక్రమించేయడంతో వర్షం నీరు సాఫీగా వె ళ్లే దారిలేక ఇళ్లల్లోకి వచ్చేస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. కడప కార్పొరేషనలో 4.5 లక్షల జనాభా ఉంది. 50 డివిజన్లు ఉన్నాయి. నగరం విస్తరిస్తోంది. మాస్టర్‌ ప్లాన ఉన్నప్పటికీ అందుకనుగుణంగా ఇళ్ల నిర్మాణం, రహదారులు లేవు. భవనం కట్టేటప్పుడు జానెడు కలిసొచ్చినా సరే అని రోడ్లు, రహదారిని ఆక్రమించేస్తున్నారు. కొందరైతే చెరువులు, కుంటలు కూడా మింగేస్తున్నారు. దీంతో వర్షం నీరు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ప్రతి యేటా వర్షాకాలంలో జలమయం కావడం సాధారణంగా మారుతోంది.


ముందస్తుగా మేల్కోండి

ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే కడప నగరం పలుచోట్ల జలమయమైంది. ఆర్టీసీ బస్టాండు ఆర్‌ఎం కార్యాలయం, కోర్టు, మారుతీనగర్‌, మినీ బైపాస్‌, ఫక్కీరుపల్లె రోడ్డు, వైజంక్షన నుంచి బైపా్‌సరోడ్డు వరకు రహదారి అంతా జలమయంగా మారింది. గత ఏడాది కూడా ఇక్కడ ఇదే పరిస్థితి. అప్పట్లో అధికారులు ఆక్రమిత డ్రైనేజీలపై కొరడా ఝులిపించారు. ఆక్రమణలు తొలగింపు మొదలు పెట్టారు. వర్షం నీరు చుక్క నిలబడకుండా చేస్తామని ప్రకటనలు చేశారు. వర్షం తగ్గిపోయింది, ఆక్రమణల తొలగింపు అటకెక్కింది. ఇప్పుడు షరా మామూలుగానే మళ్లీ డ్రైనేజీలు ఆక్రమణలకు గురయ్యాయి. చిన్నపాటి వర్షానికే ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం, కోర్టు, బస్టాండు, వైజంక్షన ప్రాంతం జలమయంగా మారుతోంది. ఇక్కడ డ్రైనేజీలు ఆక్రమించేసి భవనాలు నిర్మించడమే ప్రధాన కారణం అంటున్నారు. నీరు పోయేందుకు వీలు లేకపోవడంతో రోడ్లపై నిలుస్తోంది.


మృత్యుంజయకుంట ఆక్రమణ

రైల్వేస్టేషన రోడ్డు నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ మీదుగా మృత్యుంజయకుంటకు గతంలో కాల్వ ఉండేది. వర్షం వస్తే ఈ కాల్వగుండా నీరంతా కుంటలోకి వెళ్లేది. అయితే అది మంచి వాణిజ్య ప్రాంతం కావడంతో జానెడు భూమి కూడా విలువైనదిగా మారింది. అధికార బలం, రాజకీయ అండదండలతో కాల్వ, డ్రైనేజీ స్థలాలు ఆక్రమించారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో నీరు వెళ్లేందుకు వీలు లేకుండాపోయింది. దివంగత వైఎస్‌ హయాంలో మృత్యుంజయకుంటలో బోటు షికారు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉండేది. ఆ కుంట ఇప్పుడు ఆక్రమణకు గురై కుచించుకుపోయింది. వర్షం నీరు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో మృత్యుంజయకుంట  ఓ మోస్తరు వర్షానికే జలమయమై స్థానికులు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.


ప్రణాళికలు ఏవీ

వర్షం వచ్చినప్పుడల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కరిస్తామంటూ హడావిడి చేస్తారు. వర్షం తగ్గిన తరువాత పట్టించుకోరనే విమర్శలున్నాయి. ఆర్టీసీ బస్టాండు, ఆర్‌ఎం కార్యాలయం, కోర్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలబడుతోంది. అక్కడ నుంచి నేరుగా కోటిరెడ్డిసర్కిల్‌ మీదుగా బుగ్గవంక వరకు డ్రైనేజీ నిర్మిస్తే వర్షాకాలంలో సమస్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. తర్వాత ఆ దిశగా ఎవరూ పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. కడప నగరంలో తరచూ చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యే లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి డ్రైనేజీ, కాల్వల ఆక్రమణలను తొలగిస్తే ముంపు భయం తప్పుతుంది. రాబోయేదంతా వర్షాకాలం. ముందస్తుగా మేల్కొంటే నీటి ముప్పును ఎదుర్కోవచ్చు. లేదంటే షరా మామూలుగానే మరోసారి కడప జలమయంగా మారే పరిస్థితి వస్తుంది.

ఇటీవల కురిసిన వర్షానికి జలమయమైన ఆర్టీసీ బస్టాండు రోడ్డు


Advertisement
Advertisement
Advertisement