జల..కలేనా?

ABN , First Publish Date - 2020-10-29T09:17:35+05:30 IST

మట్టి మీద మమకారంతో వ్యవసాయం చేసుకుందామంటే నీటి వసతి లేక చాలామంది పేద రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

జల..కలేనా?

244 గ్రామాలకు దూరమైన వైఎ్‌సఆర్‌ జలకళ

 పెరిగిన భూగర్భ జలమట్టం

 పాత నివేదికతో పలు గ్రామాలకు అన్యాయం


(కడప - ఆంధ్రజ్యోతి): మట్టి మీద మమకారంతో వ్యవసాయం చేసుకుందామంటే నీటి వసతి లేక చాలామంది పేద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బోరు వేసి, కరెంటు వైరు తీసి మోటారు అమర్చుకునే ఆర్థిక స్థోమత లేని రైతులు వరుణదేవుడిని నమ్ముకుని కాలం గడుపుతున్నారు. వర్షాధార పంటలు వేసుకుంటున్నారు. అలాంటి రైతులను వైఎ్‌సఆర్‌ జలకళ పథకం తొలుత ఊరించింది. పథకం ప్రారంభమైన తరువాత లోగుట్టు తెలిసి నిరాశ చెందుతున్నారు. ఐదేళ్ల నాటి నివేదిక ఆధారంగా భూగర్భజలాలు తగ్గిపోయాయంటూ జిల్లాలో 244 గ్రామాల పేద రైతులకు ఈ పథకాన్ని దూరం చేశారు.


గత ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ పనుల కారణంగా కొన్ని చోట్ల భూగర్భ జలమట్టం పెరిగింది. ప్రాజెక్టుల్లోకి నీరు రావడంతో భూగర్భజలాలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయి. అయితే ఐదేళ్లనాటి పాతనివేదిక ఆధారంగానే ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ పథకం అమలు చేయనున్నారు. జిల్లాలో 3,12,062 హెక్టార్ల సాగు భూమి ఉంది. బోర్ల కింద సాగులో 1,45,573 ఎకరాలుంది. 50వేల ఎకరాల దాకా బీడు భూములున్నాయి. మొత్తం రైతులు 4,77,319 మంది ఉన్నారు. సన్నకారు రైతులు 2.50లక్షలు, చిన్నకారు రైతులు 1.26 లక్షలు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ జలసిరి ద్వారా బోరు, సోలార్‌ మోటరు అమర్చారు.


244 గ్రామాలకు మొండిచేయి

ఐదేళ్లనాటి భూగర్భజలాల లెక్కల ఆధారంగా ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ పథకాన్ని అమలు చేస్తుండడంతో జిల్లాలోని 35 మండలాల్లోని 344 గ్రామాల రైతులు ఈ పథకానికి దూరం కానున్నారు. రిజర్వాయర్లు, నీటి వసతి పరిధిలోని గ్రామాలను కూడా పక్కనబెట్టారు. మండలాల వారీగా పరిశీలిస్తే... బికోడూరు మండలంలో 7, బద్వేలు 3, బ్రహ్మంగారిమఠం 7, చక్రాయపేట 2, చిన్నమండెం 5, చిట్వేలు 13, దువ్వూరు 9, గాలివీడు 3, గోపవరం 4, కలసపాడు 3, కమలాపురం 10, కోడూరు 9, లక్కిరెడ్డిపల్లె 4, లింగాల 18, ఓబులవారిపల్లె 10, పెనగలూరు 17, పెండ్లిమర్రి 6, పోరుమామిళ్ల 8, పులివెందుల 4, పుల్లంపేట 17, రాజంపేట 17, రామాపురం 3, రాయచోటి 8, సంబేపల్లె 4, సిద్దవటం 5, సింహాద్రిపురం 9, కాశినాయన 4, సుండుపల్లె 1, తొండూరు 4, వల్లూరు 2, వీరబల్లె 6, వీరపునాయునిపల్లె 5, వేంపల్లె 6, వేముల 8, ఒంటిమిట్ట మండలంలో 3 గ్రామాల్లో పథకం వర్తించదు. 


జిల్లాలో బద్వేలు, రాయచోటి కరువుపీడిత ప్రాంతాలు. అక్కడ వర్షంపైనే ఆధారపడి వ్యవసాయం ఉంటుంది. బద్వేలు నియోజకవర్గంలో బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు ఉన్నప్పటికీ చెరువుల ద్వారా సాగునీరందిస్తుండడంతో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందడంలేదు. కలసపాడు, కాశినాయన కొంతమేర, అట్లూరు, గోపవరంలోని కొన్ని ప్రాంతాలకు సాగునీటి వసతి లేదు. అదేవిధంగా రాయచోటి మండలం లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లె, గాలివీడు ఏటా కరువు కోరల్లో చిక్కుకుంటున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు ప్రాంతాల్లో కూడా సాగునీరు ప్రాజెక్టులు లేకపోవడంతో వ్యవసాయ బోర్లు, వర్షాధారంపై ఆధారపడి సాగుచేస్తుంటారు. ఇక్కడ కొందరు స్థోమత ఉన్న రైతులు బోర్లు వేసుకుంటున్నారు. అయితే పేద రైతులు అప్పు చేసి బోర్లు వేద్దామనుకున్నా నీరు పడుతుందో, లేదోననే భయంతో ఒకవేళ పడకపోతే అప్పులపాలవుతామేమోనని బోర్లు వేసేందుకు ఆసక్తి చూపడంలేదు. అయితే ఇప్పుడు భూగర్భ జలశాఖ ఇచ్చే పాత నివేదిక ఆఽధారంగా పథకం అమలు చేస్తుండడంతో రైతులు నష్టపోనున్నారు.


ప్రస్తుతం భూగర్భ జలమట్టం ఇలా..

నాలుగేళ్ల కిందటతో పోల్చితే ఇప్పుడు భూగర్భ జలమట్టం పెరిగింది. కొన్ని మండలాలు పరిశీలిస్తే.. అట్లూరు మండలం 2019లో 36.55 మీటర్లు నీటి మట్టం ఉండగా ఇప్పుడు 24.45 మీటర్లు లోతులో ఉన్నాయి. 12.12 మీటర్లు పెరిగింది. బద్వేలులో 37 మీటర్లు ఉండగా ఇప్పుడు 26.06 మీటర్లకు చేరింది. అంటే 10.93 మీటర్ల నీటి మట్టం పెరిగింది. కలసపాడులో గత ఏడాది 35.11 మీటర్లు ఉండగా 21.87 మీటర్లకు పెరిగింది. 13.25 మీటర్లు పెరిగింది. ఇలా చాలామటుకు మండలాల్లో నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించేసి నిబంధనలు మాత్రం యథాతధంగా అమలు చేయడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2020-10-29T09:17:35+05:30 IST