అలనాటి సినిమాలే చూస్తా

ABN , First Publish Date - 2020-05-31T10:31:30+05:30 IST

మనం ఇదివరకు ఈ కరోనా వైరస్‌ గురించి అసలు వినలేదు, కనలేదు కదా.! ప్రపంచంలో

అలనాటి సినిమాలే చూస్తా

ప్రఖ్యాత నటుడు కైకాల సత్యనారాయణ


వెండితెర నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ. సినిమాల్లో ఆయన పోషించిన ప్రతి పాత్రా విలక్షణమైందే. అవి ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచేవే. లాక్‌డౌన్‌ వేళ 85 ఏళ్ల సత్యనారాయణను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన దైనందిన జీవితంలో వచ్చిన మార్పులు, జీవనశైలి, ఆహార అలవాట్ల గురించి వివరించారు.


హైదరాబాద్‌ సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): మనం ఇదివరకు ఈ కరోనా వైరస్‌ గురించి అసలు వినలేదు, కనలేదు కదా.! ప్రపంచంలో బాగా పాపం పెరగడంతో, కొంతైనా భూమికి బరువు తగ్గించాలని వైరస్‌ ప్రబలిందా అని నేననుకుంటున్నా. ఇవాళ ఒక దేశమని, ఒక ప్రాంతమని కాదు, అన్ని దేశాలనూ ఒణికిస్తోంది. లక్షలమంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, వైర్‌సను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చాలా బాధ్యతగా పనిచేస్తున్నాయి. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెండు నెలలుగా మంచి కృషి జరిగింది. ఇప్పటికే చాలామందికి దైనందిన జీవితంలో మాస్కు పెట్టుకోవడం ఒక భాగమై ఉంటుంద ని అనుకుంటున్నా.


ఇదొక సంతోషకరమైన విషయం. మన క్షేమం గురించి శానిటరీ వర్కర్స్‌, డాక్టర్లు, నర్సులు, పోలీసులు ఎంత కష్టపడుతున్నారంటే... అది మాటల్లో చెప్పలేను. వాళ్ల సేవకు హ్యాట్సాఫ్‌. అందుకనే నామటుకు నేను లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేసే వరకు, ఇల్లు దాటి బయటకు వెళ్లకూడదని దృఢంగా నిశ్చయించుకున్నా. మార్చి 22 నుంచి ఇవాళ్టి వరకూ కాలు బయటపెట్టలేదు. లాక్‌డౌన్‌లో నా ఫ్రెండ్స్‌, బంధువులనూ ఇంటికి రావద్దని చెప్పాను. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేవరకు పసిపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమంతా రోజువారీ జీవితంలో హైజీన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది వరకటికన్నా, ఇప్పుడు నేను ఎక్కువ సార్లు రోజూ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటున్నా కూడా. ముఖ్యంగా అరవై ఏళ్లు దాటిన వాళ్లు కచ్చితంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అందుకోసం మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. 


మితాహారమే ఆరోగ్య హితం

రోజూ తెల్లవారుజామున ఐదింటికి మెలకువొస్తుంది. అప్పుడు ఒక పదిహేను నిమిషాలు కాళ్లు, చేతులు ఆడిస్తూ, వామప్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తాను. నాకు షుగరు, బీపీ వంటి ఆరోగ్య సమస్యలేమీ లేవు. ‘సరే, ఏదో ఒకటి ఉండాలి కదా’ అని భగవంతుడు అనుకున్నాడేమో, ఆరు నెలల కింద బాత్రూంలో పడ్డాను. అప్పటి నుంచి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. డాక్టరు గురవారెడ్డి ట్రీట్‌మెంట్‌తో ఇప్పుడు కాస్త నయమైంది. ఇక నా రోజువారీ ఆహార అలవాట్లు.. ఉదయం ఆరింటికి గ్రీన్‌ టీలో తేనె కలుపుకొని తీసుకుంటా. కొన్ని రొటీన్‌ పనులు ముగించాక, ఏడింటికి ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటాను. తర్వాత లైట్‌గా టిఫిన్‌ చేస్తా. అందులో మూడు ఇడ్లీ లేదా రెండు దోసెలు..ఇలా ఇంట్లో ఏ వెరైటీ చేస్తే అది తింటా.


వెంటనే ఒక గ్లాసు రాగిజావ తాగుతా. తర్వాత డాక్టరు ఇచ్చిన, కొన్ని విటమిన్‌ మాత్రలు వేసుకుంటా. పదకొండు గంటలకు ఏదో ఒక ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకుంటా. మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక కప్పు అన్నం తింటా. అదీ దంపుడు బియ్యమే వాడతాం. అవి కూడా ఏలూరు దగ్గర దోసపాడు నుంచి తెప్పిస్తాం. ‘తక్కువ తిన్నోళ్లు ఎక్కువ కాలం బతుకుతార’ని పెద్దలంటారు. మన కడుపు ఎంత తేలిగ్గా ఉంటే, గుండె అంత మెరుగ్గా పనిచేస్తుంది. అందుకే ఆహారం చాలా తక్కువ మోతాదులో తీసుకుంటా. ఇక మధ్యాహ్నం రెండు గంటలు నిద్రపోతా. సాయంత్రం ఐదింటికి దాల్చినచెక్క, లవంగాలు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో చేసిన హెర్బల్‌ టీ తీసుకుంటా. రాత్రి భోజనంలో చిరుధాన్యాలతో తయారుచేసిన రెండు దోసెలు కానీ ఒక కప్పు అన్నం కానీ తింటాను. తర్వాత పదింటికి నిద్రపోతే, ఇక మధ్యలో మెలకువ అంటూ రాదు. బుధ, ఆదివారాలు మాత్రమే నాన్‌వెజిటేరియన్‌ తింటా. మితాహారమే ఆరోగ్య హితం. ఇదే నా పాలసీ. 


అంతకు ముందు...

ఇదివరకు సినీ ఇండస్ట్రీ నుంచి సీనియర్‌ నటులు గుమ్మడి గారు, గిరిబాబు, సారఽథి, డైరెక్టరు భాస్కర్‌రావు, నేనూ రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. ఇప్పుడు గుమ్మడి గారు లేరు. సారథి వాళ్ల ఊర్లో స్థిరపడ్డాడు. దాంతో మేము కలవడం తగ్గింది. నాకు సాఫ్ట్‌వేర్‌, మెడికల్‌ రంగాలకు చెందిన కొద్దిమంది ఫ్రెండ్స్‌ ఉన్నా రు. లాక్‌డౌన్‌కు ముందు ఫిల్మ్‌నగర్‌లోని నా గెస్ట్‌హౌస్‌లో మేమంతా రోజూ కలిసేవాళ్లం. అప్పుడు కాసేపు పేకాడుతూ, మందు తాగుతూ.... కాలక్షేపం చేసేవాళ్లం. ఎవరేమనుకున్నా, నేను తరచుగా కొద్దిగా ఆల్కహాల్‌ తీసుకుంటా. అదీ డాక్టరు సలహాతోనే.


హెల్త్‌ విషయంలో డాక్టరు సూచనల ప్రకారమే పాటిస్తా. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. గుండెకు మంచిది కాదని ఒక డాక్టరు చెప్పడంతో, అప్పటి నుంచి సిగరెట్‌ పూర్తిగా మానేశా. నేను సిగరెట్‌ మానేసి ఇప్పటికి నాలుగేళ్లు. నా ఆరోగ్యానికి పాజిటివ్‌ థింకింగ్‌ ఒక ప్రధాన కారణం. నాకెప్పుడైనా బాధ కలిగినా, అది రెండు నిమిషాలే. తర్వాత మర్చిపోతాను. బాధ పడటం వల్ల మంచి కలుగుతుందంటే, మరింత ఎక్కువ బాధపడతాం. అలా కానప్పుడు, మనమెందుకు బాధపడాలి. ‘మన జీవితంలో ఏదైతే జరగాలో, అది ఆ సమయం ప్రకారమే జరుగుతుంది. దాన్నెవరూ మార్చలేర’ని వెస్ట్రన్‌ ఆస్ట్రానమర్‌ షీరో ఒక సందర్భంలో ఉదాహరణతో సహా రాస్తాడు. నేను ఆ మాటలను పూర్తిగా విశ్వసిస్తా. అందుకే దిగులు, చింత వంటివేవీ నా దరికి రానివ్వను. నా జీవితంలో ఎదురైన కష్టాలే నన్ను పాజిటివ్‌ దృక్పథంవైపు నడిపించాయి. ఇప్పు డు ఓపిక లేక పుస్తకాలు పెద్దగా చదవడం లేదు. ఇదివరకు పుస్తక పఠనం కొంత అలవాటుండేది. అయితే, ఎక్కువగా వినడం ద్వారా విషయాలను సంగ్రహించడం మొదటినుంచి నాకు అలవాటు. 


లాక్‌డౌన్‌ లైఫ్‌..

ఉదయం 5.30 గంటల నుంచి 6.30 వరకు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వింటాను. అక్కడి నుంచి ఒక అరగంట టీవీలో న్యూస్‌, తర్వాత అన్నదాత ప్రోగ్రాం చూస్తా. పాత సినిమాలు తప్ప, కొత్త సినిమాలు అస్సలు చూడను. నా ఉద్దేశంలో ఇప్పటి సినిమాలు సినిమాలే కాదు. పూర్వం సినిమాల్లో ఒక కథ, నీతి ఉండేవి. ఇప్పుడంతా వాడు నరుకుడు, వీడు నరుకుడు.. అవి ఎంతసేపని చూస్తాం. ‘‘బాగానే ఉందన్నారు కానీ, ఇంటికి పట్టుకెళ్లడానికి ఏమీ లేదు’’ అని ప్రముఖ దర్శకుడు ఎల్వీ ప్రసాదు గారు తరచుగా అంటుండేవాళ్లు. ఇప్పడు వస్తున్న చాలా సినిమాలు అలానే ఉంటున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇప్పటి ట్రెండ్‌ నాకు నచ్చలేదు. అందుకే తాత, తండ్రి కేరక్టర్లు వస్తున్నా, నటించడం తగ్గించా. సినిమాలు తగ్గించుకోడానికి మోకాళ్ల నొప్పులు కూడా ఒక ప్రధాన కారణం. అందుకే నేను అలనాటి క్లాసికల్‌ మూవీ్‌సతో కాలక్షేపం చేస్తాను.


లాక్‌డౌన్‌లో నేను మళ్లీ చూసిన సినిమాలు...‘కృష్ణావతారం, మాయాబజార్‌, దానవీరశూరకర్ణ, వినాయక విజయం, కృష్ణార్జున యుద్ధం, దేవదాసు, ప్రేమనగర్‌, తోడికోడళ్లు, శ్రీరంగనీతులు, మామా అల్లుళ్ల సవాల్‌, రౌడీయిజం నశించాలి’. ఇప్పుడు యావరేజ్‌గా రోజుకు రెండు సినిమాలు చూస్తున్నా. అందులో రామారావు గారి పిక్చర్స్‌ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ సీడీ ప్లేయర్‌లో చూడటమే. అదే నాకు ప్రధాన కాలక్షేపం. ఎప్పుడైనా టీవీలో మంచి సినిమాలు వస్తే కూడా తప్పనిసరిగా చూస్తుంటా. 

Updated Date - 2020-05-31T10:31:30+05:30 IST