గడువు ముంచుకొస్తున్నా కదలిక ఏదీ!

ABN , First Publish Date - 2021-06-14T06:42:13+05:30 IST

కాలువలకు నీటి విడుదల సమయం ముంచుకొస్తోంది. ఇరిగేషన్‌ అధికారుల్లో ఎక్కడా కదలిక లేదు. శిథిలావస్థకు చేరిన కళింగల్‌, షట్టర్లకు కనీస మరమ్మతులు లేకపోగా గండ్లు పూడ్చివేతను విస్మరించారు. ఫలితంగా సార్వాలో రైతులకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారనున్నది.

గడువు ముంచుకొస్తున్నా కదలిక ఏదీ!
గొల్లప్రోలు మండలం మల్లవరం ఆర్‌ఆర్‌బీ చెరువు నుంచి సాగునీరు వెళ్లే కళింగల్‌, షట్టర్లు శిథిలావస్థకు చేరడంతో నీటి మళ్లింపునకు తాత్కాలికంగా వేసిన ఇసుక బస్తాలు

  • శిథిలమైన కళింగల్‌, షట్టర్లకు మరమ్మతులు లేవు
  • గండ్లు పూడ్చివేతనూ విస్మరించారు
  • సార్వాలో సాగునీటి సరఫరా ప్రశ్నార్థకమే

గొల్లప్రోలు రూరల్‌, జూన్‌ 13: కాలువలకు నీటి విడుదల సమయం ముంచుకొస్తోంది. ఇరిగేషన్‌ అధికారుల్లో ఎక్కడా కదలిక లేదు. శిథిలావస్థకు చేరిన కళింగల్‌, షట్టర్లకు కనీస మరమ్మతులు లేకపోగా గండ్లు పూడ్చివేతను విస్మరించారు. ఫలితంగా సార్వాలో రైతులకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారనున్నది.

గొల్లప్రోలు మండలం మల్లవరంలోని ఆర్‌ఆర్‌బీ చెరువు ద్వారా ఏకే మల్లవరం, ఏపీ మల్లవరం, లక్ష్మీపురం, ఎ.విజయనగరం తదితర గ్రామాలతో పాటు తొండంగి మండలంలోని 23 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ చెరువుపై ఆధారపడే రెండు పంటలు సాగు చేస్తుంటారు. ఈ చెరువుకు ఉన్న ప్రధాన కళింగల్‌ పూర్తిగా శిథిలమవ్వడంతో షట్టర్లు దెబ్బతిన్నాయి. గత సార్వా, దాళ్వా సాగులో రైతులు సాగునీటి సరఫరా కోసం తాత్కాలికంగా ఇసుక బస్తాలతో అడ్డుకట్టలు వేసుకుని నీరు మళ్లించుకున్నారు. దాళ్వా సాగు అనంతరం క్లోజర్‌ పనులు చేపట్టే సమయంలో కళింగల్‌కు, షట్టర్లకు మరమ్మతులు నిర్వహిస్తారని రైతులు ఆశించారు. అయితే ఇప్పటిదాకా పనులు చేపట్టలేదు. అదే చెరువుకు గల తూములకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. వీటిని అప్పట్లో తాత్కాలికంగా ఇసుక బస్తాలతో పూడ్చి వదిలివేశారు. వీటిని శాశ్వత ప్రాతిపదికన పూడ్చలేదు. దీంతో చెరువుపై ఆధారపడి గోదావరి నీటితో పంటలు సాగుచేసుకుంటున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమ ఇబ్బందులను నేటికీ ఎవ్వరూ పట్టించుకోలేదని, అధికారులను ప్రశ్నిస్తుంటే సరిగా సమాధానం చెప్పడం లేదని రైతులు తెలిపారు. ఈ నెల 15న గోదావరి కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో చెరువు కళింగల్‌, షట్టర్లకు మరమ్మతులు, గండ్లు పూడ్చడం సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇరిగేషన్‌ అధికారులు స్పందించి తక్షణం మరమ్మతులు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-06-14T06:42:13+05:30 IST