విశాఖ విద్యార్థినికి రూ.24 లక్షల వార్షిక వేతనంతో.. అమెజాన్‌లో ఉద్యోగం

ABN , First Publish Date - 2020-10-21T17:02:05+05:30 IST

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది..

విశాఖ విద్యార్థినికి రూ.24 లక్షల వార్షిక వేతనంతో.. అమెజాన్‌లో ఉద్యోగం

‘అమెజాన్’ అమ్మాయి

ఇంజనీరింగ్‌ విద్యార్థినికి రూ.24 లక్షల వార్షిక వేతనం

కోడింగ్‌, డేటాకు సంబంధించిన అంశాలపైనే పరీక్ష, ఇంటర్వ్యూలు


(విశాఖపట్నం, అగనంపూడి-ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగ/ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఇటువంటి విపత్కర సమ యంలో కొత్తగా ఉద్యోగాల సాధన కష్టంగానే మారింది. ఈ తరుణంలో నగరానికి చెందిన కల్లూరి ప్రశాంతి అనే ఇంజనీరింగ్‌ విద్యార్థిని రూ.24 లక్షలు వార్షిక వేతనంతో ‘అమెజాన్‌’కు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె...తాను ఎలా లక్ష్యం చేరుకున్నదీ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి వెల్లడించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... 


కోడింగ్‌పై దృష్టిపెట్టా

నాన్న స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగి కావడంతో విద్యాభ్యాసం ఇక్కడే సాగింది. ఇంటర్మీడియట్‌ శ్రీచైతన్యలో చదువుకున్నా. ఇంజనీరింగ్‌ ‘విజ్ఞాన్‌’లో చేస్తున్నా. చిన్నప్పటి నుంచి ప్రొడక్ట్‌ బేస్డ్‌ కంపెనీలో ఉద్యోగం సాధించాలన్నది నా లక్ష్యం. అందుకు అనుగుణంగానే ఇంజనీరింగ్‌లో సీఎస్‌ఈ గ్రూపులో చేరా. కోడింగ్‌, డేటాకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించా. కోడింగ్‌ అంటే చాలా ఇష్టం. దానిపైనే ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేశాను. అందువల్లే మంచి పట్టు లభించింది. ట్రెండింగ్‌లో వున్న టెక్నాలజీని నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. 


మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

అమెజాన్‌ కంపెనీ మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. జూన్‌లో సాంకేతికపరమైన అంశాలపై ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించింది. అందులో ఎంపికైనట్టు సమాచారం వచ్చింది. అనంతరం జూన్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలో రెండు కోడింగ్‌తో కూడిన ప్రశ్నలు ఇచ్చి పరిష్కరించమన్నారు. జూలైలో జరిగిన మరో ఇంటర్వ్యూలో అడ్వాన్స్‌డ్‌ డేటా సక్సెస్‌ మీద కోడింగ్‌ ప్రశ్నలు అడిగారు. ఒక్కో ఇంటర్వ్యూ గంటపాటు వర్చువల్‌ విధానంలో జరిగింది. పూర్తిగా కోడింగ్‌ బేస్డ్‌ మీదే ఎంపిక ప్రక్రియ జరిగింది. నా విజయానికి తల్లిదండ్రులు సత్యనారాయణ, సత్య, సోదరుడు సాయికిరణ్‌ (పోర్టు ఉద్యోగి) ప్రోత్సాహంతోపాటు విజ్ఞాన్‌ అధ్యాపకుల సహకారం ఎంతో ఉంది.


Updated Date - 2020-10-21T17:02:05+05:30 IST