తృతీయ కూటమికి కమల్‌ కసరత్తు

ABN , First Publish Date - 2021-03-01T15:48:43+05:30 IST

విశ్వనటుడు కమల్‌హాసన్‌ సారథ్యంలోని మనిదనేయ మక్కల్‌ కట్చి ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో తృతీయ కూటమిని ఏర్పాటు...

తృతీయ కూటమికి కమల్‌ కసరత్తు

పార్టీ నేతలతో మంతనాలు

చెన్నై/అడయార్ (ఆంధ్రజ్యోతి): విశ్వనటుడు కమల్‌హాసన్‌ సారథ్యంలోని మనిదనేయ మక్కల్‌ కట్చి ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో తృతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నారు. ఇదిలావుంటే, అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగిన హీరో శరత్‌కుమార్‌ సారథ్యంలోని అఖిల భారత సమత్తువ మక్కల్‌ కట్చి, డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన ఇండియా జననాయక కట్చి (ఐజేకే)లు ఎంఎన్‌ఎంలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ క్రమంలో కమల్‌ హాసన్‌తో ఆ పార్టీల నేతలు శరత్‌కుమార్‌, ఐజేకే ఉప ప్రధాన కార్యదర్శి రవిభారతిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తమ మనసులోని మాటను వెల్లడించారు. అయితే, పార్టీ నిర్వాహకులతో చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని వారికి కమల్‌హాసన్‌ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఎంఎన్‌ఎం నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులతో కమల్‌హాసన్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఇదే విషయంపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మహేంద్రన్‌ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్టీకి చెందిన కార్యవర్గ సభ్యులతో పాటు9 నిర్వాహకులు విధిగా పార్టీ ప్రధానన కార్యాలయంలో అందుబాటులో వుండాలని పేర్కొన్నారు. అలాగే, మరో మూడు రోజుల పాటు నగరంలోనే అందుబాటులో వుండేలా తమ ప్రయాణ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐజేకేతో పాటు శరత్‌కుమార్‌ పార్టీని తమతో కలుపుకుని వెళ్ళే విషయంపై పార్టీ కార్యవర్గ సభ్యులతో చర్చించిన తర్వాత కమల్‌హాసన్‌ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, పార్టీ చెంతకు ఎన్నిపార్టీలు వచ్చినా... ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం తానేనని కమల్‌హాసన్‌ స్పష్టం చేసిన విషయం తెల్సిందే. 

Updated Date - 2021-03-01T15:48:43+05:30 IST