దుర్గ గుడిలో మరో వివాదం

ABN , First Publish Date - 2020-09-25T15:05:41+05:30 IST

కనకదుర్గమ్మ దేవస్థానం ఈవో ఎం.వి.సురేశ్‌బాబు మరో వివాదానికి..

దుర్గ గుడిలో మరో వివాదం

ఎన్‌ఎంఆర్‌పై ఈవో కక్షసాధింపు

క్వార్టర్స్‌లోని నివాసాన్ని ఖాళీ చేయాలని ఆదేశం

హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కనకదుర్గమ్మ దేవస్థానం ఈవో ఎం.వి.సురేశ్‌బాబు మరో వివాదానికి తెరతీశారు.  దేవస్థానంలో 20 సంవత్సరాలుగా తాత్కాలిక ఉద్యోగి (ఎన్‌ఎంఆర్‌)గా పని చేస్తూ.. గుణదలలోని దేవస్థానం క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న కె.శ్రీనివాసరావు కుటుంబాన్ని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలని ఆదేశిస్తూ ఈవో సురేశ్‌బాబు ఈనెల 11న నోటీసు జారీ చేశారు. ఈ నోటీసును చాలెంజ్‌ చేస్తూ ఆ ఉద్యోగి బుధవారం కోర్టును ఆశ్రయించారు. శ్రీనివాసరావు పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించడంతో ఈవోపై మరో కేసు నమోదైంది. 


దుర్గగుడి ఈవో వ్యవహార సరళి రోజు రోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. ఆయనపై కోర్టుకెళుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. కార్యనిర్వహణాధికారి సురేశ్‌బాబు నియామకం చెల్లదంటూ ఇటీవల జనసేన నాయకుడు పోతిన వెంకట మహేష్‌ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. దేవదాయశాఖలో పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన దుర్గాప్రసాద్‌ అనే విశ్రాంత ఉద్యోగి కూడా ఇదే అంశంపై కోర్టులో కేసు వేశారు. తాజాగా ఈవో సురేశ్‌బాబు, ఆయన క్యాంప్‌ క్లర్క్‌ (సీసీ) తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కక్ష సాధిస్తున్నారంటూ దుర్గగుడి ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగి శ్రీనివాసరావు బుధవారం కోర్టును ఆశ్రయించడం మరో వివాదానికి దారితీసింది. 


రెండు దశాబ్దాలుగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఎన్‌ఎంఆర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావుకు గుణదలలోని దేవస్థానానికి చెందిన క్వార్టర్స్‌లో బి-2/2 క్వార్టర్‌ను కేటాయించారు. ఆ క్వార్టర్స్‌లో శ్రీనివాసరావు కాకుండా వేరేవారు ఉంటున్నారని, కాబట్టి వెంటనే క్వార్టర్స్‌ను ఖాళీ చేయాలంటూ తొలిసారి గత జూన్‌ 25న దేవస్థానం ఈవో నోటీసు జారీ చేశారు. ఆ నోటీసును చాలెంజ్‌ చేస్తూ గతంలోనే తాను కోర్టును ఆశ్రయించానని, దీంతో తనపై కక్ష పెంచుకున్న ఈవో తాను నివాసం ఉంటున్న క్వార్టర్స్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈనెల 11న మళ్లీ నోటీసు ఇచ్చారని శ్రీనివాసరావు ఆరోపించారు. 


తాను, తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు, భర్త వదిలేసిన తన సోదరి, ఆమె ఇద్దరు పిల్లలు కూడా అదే క్వార్టర్స్‌లో ఉంటున్నామని తెలిపారు. తన సోదరిని, ఆమె ఇద్దరు పిల్లలను ఆదరించేవారెవరూ లేకపోవడంతో ఆమె తమతోపాటే క్వార్టర్స్‌లో ఉంటుందని, ఆమెను చూడాల్సిన బాధ్యత తనపై ఉందని శ్రీనివాసరావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అదే క్వార్టర్స్‌లో ఉంటూ పదవీ విరమణ పొందిన దేవస్థానం ఉద్యోగులు కొందరు దాదాపు ఐదేళ్లుగా క్వార్టర్స్‌లోనే ఉంటున్నా వారిని ఖాళీ చేయించకుండా.. తన కుటుంబంతోపాటు సోదరి, ఆమె ఇద్దరు పిల్లలు ఉంటున్నందుకే తమను ఖాళీ చేయమనడం అన్యాయమని శ్రీనివాసరావు వాపోతున్నారు. 20 సంవత్సరాలుగా తాను దేవస్థానంలో ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్నా.. తనకు నెలకు చెల్లించే జీతం కేవలం రూ.15,030 మాత్రమేనని తెలిపారు. 

Updated Date - 2020-09-25T15:05:41+05:30 IST