మళ్లీ సుప్రీంకు ‘హిజాబ్‌’

ABN , First Publish Date - 2022-02-12T07:04:29+05:30 IST

హిజాబ్‌ వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. హిజాబ్‌, కాషాయ కండువాలు తదితర మత చిహ్నాలు ధరించి విద్యాలయాలకు రావద్దు అని గురువారం మౌఖికంగా సూచన చేసిన కర్ణాటక హైకోర్టు...

మళ్లీ సుప్రీంకు ‘హిజాబ్‌’

  • కర్ణాటక హైకోర్టు లిఖిత ఆదేశాలను అడ్డుకోవాలంటూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌
  • పిటిషనర్ల తీరుపై చీఫ్‌జస్టిస్‌ అభ్యంతరం
  • సరైన సమయంలో వినతులు పరిశీలిస్తాం
  • సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
  • మధ్యంతర ఏర్పాటుకు నిరాకరణ
  • తదుపరి విచారణ 14కు వాయిదా


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): హిజాబ్‌ వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. హిజాబ్‌, కాషాయ కండువాలు తదితర మత చిహ్నాలు ధరించి విద్యాలయాలకు రావద్దు అని గురువారం మౌఖికంగా సూచన చేసిన కర్ణాటక హైకోర్టు... తన లిఖితపూర్వక ఆదేశాల్లో మాత్రం స్పష్టమైన వైఖరిని తీసుకుంది. మత దుస్తులు ధరిస్తామని పట్టుపట్టవద్దు అని, తమపై ఒత్తిడి తీసుకురావద్దని సర్దిచెప్పేధోరణితో మాట్లాడిన చీఫ్‌ జస్టిస్‌ రీతురాయ్‌ అవస్థి, జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్షిత్‌, జస్టిస్‌ జేఎమ్‌ ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. రాతపూర్వక ఆదేశాల్లో మాత్రం వాటిని క్లాసురూమ్‌ల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమించబోమని తేల్చిచెప్పేసింది. తుది తీర్పు ఇచ్చేవరకు ఈ ఆదేశాలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. శుక్రవారం ఈ ఆదేశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ వెంటనే ఒక వర్గానికి చెందిన విద్యార్థులు హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. కర్ణాటక హైకోర్టు గురువారం నాటి మౌఖిక ఆదేశాలపై అదేరోజు వీరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ రూపంలో మరోసారి కోర్టును ఆశ్రయించారు.


ఈ పిటిషన్ల అర్హతపై జరిపిన విచారణ సందర్భంగా పిటిషనర్ల తీరును చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అభ్యంతరపెట్టారు. ‘‘ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కునూ కాపాడతాం. ఇంత తొందరగా మీ వినతులను పరిశీలించాల్సిన అవసరం కనిపించడం లేదు. సరైన సమయంలో వాటిని స్వీకరిస్తాం. అయితే.. ఇలాంటి అంశాలను విస్తృతస్థాయికి తీసుకెళ్లవద్దు. ఢిల్లీ దాకా దీనిని తీసుకురావాల్సిన అవసరం ఉందా?’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల తరఫున సీనియర్‌ న్యాయవాది దేవ్‌దత్‌ కామత్‌ వాదనలు వినిపించారు. మత ఆచారాలను పాటించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కల్పించిన ప్రాథమిక హక్కును కర్ణాటక హైకోర్టు నిర్ణయం కాలరాసిందని ఆయన వాదించారు. ఈ అంశంపై మధ్యంతర ఏర్పా టు ఏదైనా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14న తమ పిటిషన్లు బెంచ్‌ ముందుకు వచ్చేలా లిస్టింగ్‌ చేయాలని ఆయన కోరగా, చీఫ్‌ జస్టిస్‌ రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన బెంచ్‌ అందుకు తిరస్కరించింది. కర్ణాటక ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విచారణకు హాజరయ్యారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పూ ర్తి ప్రతి ఇంకా ప్రభుత్వం చేతికి అందలేదని ఆయన వివరించారు. దీనిపై బెంచ్‌ స్పందిస్తూ.. ‘అత్యవసర ప్రాతిపదికన హైకోర్టు ఈ అంశంపై విచారణ జరుపుతోంది.


కోర్టు ఆదేశాల్లో ఏముందనేది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఇంతలోనే తొందరపాటు ఎం దుకు? ఎదురుచూద్దాం’’ అని వ్యాఖ్యానించింది. కర్ణాటక పరిణామాలను విచారణ సందర్భంగా తాము కూడా గమనిస్తున్నామని చీఫ్‌ జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. అయితే..ఇలాంటి అంశాలను ఢిల్లీ వరకు తీసుకురావాల్సిన అవసరం ఉందా అనేది పిటిషనర్లు కూడా ఆలోచించాలని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. 


ఓట్ల కోసమే ‘హిజాబ్‌’: గిరిరాజ్‌ 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్‌’పై బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్‌ వెనుక ఓటు బ్యాంకు రాజకీయం ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థినుల జీవితాలతో కొందరు ఆడుకుంటున్నారని విమర్శించారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతికి ఇదే సరైన సమయమని వాఖ్యానించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ జరగాలని, పార్లమెంటు ఉభయసభల్లోనూ చర్చించాలన్నారు. 

కర్ణాటకలో అదే ఉద్రిక్తత!

హిజాబ్‌ వివాదంపై కర్ణాటకలో ఉద్రిక్తత కొనసాగుతోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు మంత్రులు, అధికారులతో సీఎం బసవరాజ్‌ బొమ్మై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాలేజీలను తెరవడంపై 14న నిర్ణయం తీసుకునే అవకాశముందని విద్యామంత్రి బీఈ నగేశ్‌ తెలిపారు. సోమవారం నుంచి హైస్కూళ్లు ప్రారంభమవుతాయన్నారు. వివాదం రేగిన ఉడుపిలో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. 

Updated Date - 2022-02-12T07:04:29+05:30 IST