ఆస్పత్రి లోపల తల్లి, బయట కూతురు.. సీఎంను కదిలించిన వీడియో..

ABN , First Publish Date - 2020-04-10T00:03:53+05:30 IST

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచదేశాలను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను బలిగొన్న.. ఈ అంతుచిక్కని వైరస్ సోకి లక్షలాది మంది

ఆస్పత్రి లోపల తల్లి, బయట కూతురు.. సీఎంను కదిలించిన వీడియో..

బెంగళూరు: కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచదేశాలను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను బలిగొన్న.. ఈ అంతుచిక్కని వైరస్ సోకి లక్షలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. అయితే వైద్యవృత్తిలో ఉన్న ఎందరో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రేయింబవళ్లు కష్టపడుతూ.. వీరికి వైద్యం అందిస్తున్నారు. తమ ఇళ్లకు కూడా వెళ్లకుండా, తమ కుటుంబసభ్యులను కలవకుండా వాళ్లు కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. అలా కరోనా వైరస్ కారణంగా దూరమైన ఓ తల్లీకూతుళ్లకు సంబంధించి ఓ చిన్న వీడియో కర్ణాటక సీఎం యెడియూరప్పను కదిలించింది. ఎంతలా అంటే ఆయన స్వయంగా ఆ నర్సుకి ఫోన్ ధైర్యం కూడా చెప్పేంతగా ఆ వీడియో ప్రభావం చూపింది. 


బెళగావి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేస్తున్న సుగంధ అనే నర్సులు గత 15 రోజులుగా తన కుటుంబానికి దూరంగా ఉంటూ ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందిస్తుంది. అయితే తల్లి కోసం ఏడుస్తున్న చిన్నారి కూతురిని తీసుకొని ఆమె భర్త ఆస్పత్రి వద్దకు వచ్చాడు. కానీ, దగ్గరకు వెళ్తే ఎక్కడ కరోనా సోకుతుందనే భయంతో తన కూతురికి ఆమె చాలా దూరంలో నిలుచుంది. తల్లి కోసం ఏడుస్తున్న కూతురిని చూసి సుగంధతో పాటు అక్కడ ఉన్నవారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత తన కూతురికి బై చెప్పి సుగంధ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోని టీవీలో చూసిన ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆ నర్సుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. 


‘‘మీ పిల్లలను కూడా చూడకుండా.. ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. నేను టీవీలో చూశాను. దయచేసి కాస్త ఓర్పుతో మాకు సహకరించండి. భవిష్యత్తులో మీకు ఎన్నో మంచి అవకాశాలు వస్తాయి. మీకు మంచి జరుగుతంది. ఆ దేవుడి దీవెనలు మీకు లభిస్తాము. మీ కష్టానికి తగిన ఫలితం రావాలి’’ అని సీఎం ఆమెతో ఫోన్‌లో చెప్పారు. 



Updated Date - 2020-04-10T00:03:53+05:30 IST