Abn logo
Mar 26 2020 @ 01:11AM

తీర్థయాత్రలకు వెళ్లి.. చిక్కుకున్న ఏపీవాసులు

తిరిగి వచ్చేదెలా..

స్వస్థలాలకు ఎప్పుడు వస్తామో తెలియక ఆందోళన

ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూపులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): తీర్థయాత్రలకు వెళ్లిన గుంటూరు జిల్లావాసులు లాక్‌డౌన్‌తో కాశీ, గయ, హరిద్వార్‌ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. గుంటూరు, పేటేరు, రెంటచింతల, మేడికొండూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు తీర్థయాత్రలకు వెళ్లారు. లాక్‌డౌన్‌తో రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో తాము తిరిగి స్వస్థలాలకు తిరిగి వచ్చేదెలాగో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు. ఉండటానికి అక్కడి సత్రాల్లో అవకాశం కల్పించినప్పటికీ మనోవేదనతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పైగా వీరిలో షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు కూడా మందులు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారు. వీలైనంత త్వరగా తమను తమ స్వస్థలానికి చేర్చే ఏర్పాట్లు చేయాలని రాష్ట్రంకాని రాష్ట్రంలో చిక్కుకున్న వారు వేడుకుంటున్నారు.


గుంటూరులోని మేనకాగాంధీనగర్‌, నల్లచెరువు ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ నెల 15న కాశీకి వెళ్ళారు. తిరుగు ప్రయాణం కోసం ఈ నెల 23కి రిటర్న్‌ టిక్కెట్లు రిజర్వు చేసుకున్నారు. అయితే 22 నుంచే లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఎక్కడి రైళ్ళు అక్కడే నిలిచి తిరిగి స్వస్థలానికి ఎలా చేరుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వీరిలో ఏటీఎం కార్డులు వంటివి వినియోగించే వారు కూడా లేకపోవడంతో ఇక్కడి బంధువులు వారికి ఏ విధంగా సహాయం చేయాలో అర్థంకాక మదనపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ చర్యలు చేపట్టాలని అక్కడ చిక్కుకున్న శివపార్వతి 76609 32494, శోభ 96181 51517 తదితరులు కోరుకుంటున్నారు. 


మేడికొండూరు: మండలంలోని పేరేచర్లకు చెందిన 45మంది ముస్లింలు రాజస్థాన్‌ సమీపంలో అజ్మీర్‌లో చిక్కుకు పోయారు. ఈ నెల 14న పేరేచర్ల నుంచి వెళ్లిన వారు నాగ్‌పూర్‌, ఆగ్రాలోని దర్గాలను దర్శించుకుని చివరగా అజ్మీర్‌ వెళ్లారు. అక్కడ దర్గా దర్శనానంతరం బయలు దేరేందుకు సిద్ధమవుతుండగా కర్ఫ్యూతో దర్గా సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌ను రోజుకు రూ.8 వేల చొప్పున అద్దెకు తీసుకుని అక్కడే ఉన్నారు. అద్దె కట్టలేదన్న కారణంగా బుధవారం నుంచి గదులకు నీటిని నిలిపి వేశారని విలేకర్లకు తెలిపారు.

  

రేపల్లె: మండలంలోని పేటేరుకు చెందిన 25 మంది ఈ నెల 14న కాశీ యాత్రకు వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం 19న బీహార్‌లోని గయ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అక్కడ మొక్కుబడులు చెల్లించుకుని తిరిగి బయల్దేరే క్రమంలో లాక్‌డౌన్‌తో బస్సులు, రైళ్లు నిలిచిపోయాయి. తినటానికి తిండిలేక, వసతి గృహాల్లో ఉండే స్థోమతలేక, గయలోని తెలుగువారి విష్ణుపాదం ఆశ్రమంలోని వరండాలో తలదాచుకుంటున్నారు.  


రెంటచింతల: రెంటచింతల చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌ తల్లిదండ్రులతో పాటు మరో 10 మంది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ పుణ్యక్షేత్రంలో చిక్కుకుపోయారు. ఈ నెల 15న ఉత్తరభారదేశంలోని పలు పుణ్యక్షేత్రాలను తిలకించడానికి ఇక్కడ నుంచి వెళ్లారు. తమతో పాటు వందలాది మందికి టీటీడీ కల్యాణ మండపంలో ఆశ్రయం కల్పించారని చాలీచాలని వసతులు, ఆహార పదార్థాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు బుధవారం విలేకరికి ఫోన్లో తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement