కష్టాల కడలిలో కౌలురైతులు

ABN , First Publish Date - 2021-05-10T04:40:42+05:30 IST

రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించే కౌలురైతులకు చివరికి కన్నీరే మిగులుతోంది.

కష్టాల కడలిలో కౌలురైతులు

- ఏటా పెరుగుతున్న కౌలు ధరలు

- రుణమాఫీ, రైతుబంధుకు దూరం

- అమలుకాని కౌలు చట్టం

- పట్టించుకోని ప్రభుత్వాలు

- నెల రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం

చింతలమానేపల్లి, మే 9: రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించే కౌలురైతులకు చివరికి కన్నీరే మిగులుతోంది. భూములు లేని ఈ పేదరైతులకు ప్రభుత్వాల నుంచి రిక్తహ స్తమే ఎదురవుతోంది. భూ యజమానులు సాగుచేయలేక వదిలేస్తే ఆ భూముల్లో తమ స్వేదంతో పంటలు పండిస్తున్న ఎంతోమంది కౌలు రైతులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. చీడపీడల కారణంగా పంటలు దెబ్బతిన్నా, చేతికొచ్చే సమ యంలో అకాల వర్షాలు, ఇతరత్రా ప్రకృతీ వైపరీత్యాలతో నష్టపో యినా ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యజమానికి కౌలు చెల్లించాల్సిందే. కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టాలున్నా వాటిని అమలు చేసే దిక్కులేదు. ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం అందడం లేదు. గతంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులుండేవి. వాటిసహాయంతో బ్యాంకుల్లో రుణం లభించేది. కానీ ఇటీవల కాలంలో కౌలురైతులకు గుర్తింపు కార్డుల ప్రక్రి యను నిలిపివేశారు. తద్వారా బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. దీంతో పెట్టుబడులకు అవసరమైన సొమ్ము వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. 

ప్రతీ ఏటా విపరీతంగా పెరుగుతున్న కౌలు ధరలు..

భూముల కౌలు రేట్లు ఏటా విపరీతంగా పెరుగుతుండటంతో రైతులపై అధికభారం పడుతుంది. ప్రస్తుతం నీటి వనరులు ఉన్నచోట ఎకరానికి 12వేల పైనే పలుకుతోంది. నీటివసతి తక్కువ ఉన్న చోట 10వేల నుంచి 12వేల వరకు భూమి యజమాని డిమాండ్‌పై ఆధారపడి ధర పలుకుతోంది. గత ఐదారు సంవత్సరాల క్రితం కౌలు రేట్లను పరిశీలిస్తే దాదాపు రెట్టింపైనట్లు రైతులు పేర్కొంటున్నారు. ఐదారు సంవత్సరాల నుంచి యేటా వెయ్యి రూపాయలపైనే పెరుగుతూ ప్రస్తుతం 12 వేలకు చేరింది. 

ప్రభుత్వ సాయం కరువు..

కౌలు రైతులకు ప్రభుత్వం పరంగా సాయం అందడం లేదు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సుమారు 4.5లక్షల ఎకరాల భూములు సాగవుతుండగా, ఇందులో 50వేల పైచిలుకు మంది కౌలు రైతులే ఉన్నారు. గతంలో గుర్తింపు కార్డులున్న కౌలు రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు. అయితే తెలంగాణలో 2017-18 నుంచి కౌలు రైతుకు గుర్తింపు కార్డులను రద్దు చేశారు. దీంతో బ్యాంకులు రుణాల మంజూరును నిలిపివేసింది. పంట పెట్టుబడి కోసం ప్రస్తుతం అందిస్తున్న రైతుబంధును కూడా ఇవ్వకపోవడంతో రైతన్నలు వడ్డీవ్యాపారులను ఆశ్రయించి నిలు వునా మునుగుతున్నారు.

సాగుకు పెట్టుబడులూ అధికమే..

పంటలు పండించేందుకు కౌలు రైతులు పెట్టుబడులు సైతం అధికమవుతున్నాయి. సరాసరి ఎకరా సాగు కోసం దున్నేందుకు ట్రాక్టర్‌ ఖర్చు ఆరు వేలు వెచ్చిస్తున్నట్టు రైతులు చెప్తుతున్నారు. అలాగే నాటు వేయడానికి 2వేలు, ఎరువుల కోసం 10వేలు, కలుపు తీయడం కోసం 5వేలు పంట సమయంలో కూలీలకు మరో 3వేలు ఖర్చు అవుతున్నాయి. ఈ లెక్కన ఎకరాకు సాగుకు సుమారుగా 20నుంచి 25వేలు అవుతున్నాయని తెలుస్తోంది. పెట్టుబడులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుండడంతో కౌలు రైతులు అధిక భారం మోయక తప్పడం లేదు. 

చట్టాలేవి.. 

కౌలు రైతులకు ప్రభుత్వపరంగా గుర్తింపునిచ్చి వారికి సాయం అందించేందుకు అప్పటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన ల్యాండ్‌ లైసెన్స్‌డ్‌ కల్టివేటర్స్‌ రూల్స్‌-2012 చట్టం ప్రస్తుతం అమలులో లేదు. 2016-17వరకు అమలైనా రెండేళ్ల నుంచి ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. రైతులకు గుర్తింపు కార్డులు అందించే వారు. గ్రామ పంచాయతీల్లో కౌలు రైతుల వివరాలు నమోదు చేసుకునేవారు. ప్రస్తుతం అవేమీ లేకపోగా గుర్తింపు కార్డులను కూడా ఇవ్వడం లేదు.  ప్రస్తుతం భూమి ఉన్న రైతులకు ఎకరాకు 5వేల చొప్పున రైతుబంధు సాయం అందిస్తున్నా అది పూర్తిగా భూయజమానులకే దక్కు తోంది. కౌలు రైతులకు ఎలాంటి సాయం అందడం లేదు. దీంతో తమను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాలని, రైతుబంధుని వర్తింపచేయలని కౌలు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పెట్టుబడులు అధిమవుతున్నాయి..

- మహేష్‌, కౌలురైతు,చింతలమానేపల్లి

ప్రతీ సంవత్సరం కౌలుకు తీసుకొని భూములను సాగు చేస్తున్నాను. ప్రతీ ఏటా పెట్టుబడి ఎక్కువవుతోంది. మాకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో కనీసం బ్యాంకులో కూడా ఋణాలు ఇవ్వడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారులపైనే  ఆధారపడి అప్పులు తీసుకొని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

అప్పు తెచ్చి సాగుచేస్తున్నాం..

- సతీష్‌, కౌలురైతు, కర్జెల్లి

ప్రతీ సంవత్సరం భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు కౌలురేట్లు బాగా పెరిగినయ్‌. దీంతో ఎంత భారమైనా కౌలుకు తీసుకోక తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సాయం అందడం లేదు. ప్రతీయేటా అప్పులు తెచ్చి సాగు చేసుడే. బ్యాంకులు అప్పులు ఇస్తే బాగుంటుంది. 

Updated Date - 2021-05-10T04:40:42+05:30 IST