అమిత్‌షాకు గట్టి కౌంటర్ ఇచ్చిన పినరయి విజయన్

ABN , First Publish Date - 2021-03-09T17:40:54+05:30 IST

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సొంత నియోజకవర్గమైన కన్నూరులో ..

అమిత్‌షాకు గట్టి కౌంటర్ ఇచ్చిన పినరయి విజయన్

న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సొంత నియోజకవర్గమైన కన్నూరులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తనను లక్ష్యంగా చేసుకుంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఆయన గట్టిగా తిప్పికొట్టారు. తిరువనంతపురం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉందని, గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా అమిత్‌షాదేనని అన్నారు.


'అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై నేను కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను. దౌత్య మార్గంలో గోల్డ్ స్మగ్లింగ్‌కు ప్రయత్నించిన వ్యక్తుల్లో సంఘ పరివార్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రమేయం లేదా? ఆ విషయం మీకు (అమిత్‌షా) తెలియదా?' అని పినరయి విజయన్ సూటిగా ప్రశ్నించారు. తిరువనంతపురం విమానాశ్రయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరువనంతపురం విమానశ్రయం గోల్డ్ స్మగ్లింగ్ హబ్‌గా ఎలా మారిపోయందని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పాల్సినది కేరళ ముఖ్యమంత్రి కాదని, అమిత్‌షానే సమాధానం చెప్పాలని అన్నారు.


ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో కలిసి ఎల్‌డీఎఫ్‌ను కూల్చగలమని బీజేపీ అనుకుంటే వాళ్లకు నిరాశే మిగులుతుందని పినరయి విజయన్ అన్నారు. విభజన తేవాలని బీజేపీ ఎప్పుడు అనుకున్నా తాము దేశ ఐక్యత కోసం నిలబడ్డామని పేర్కొన్నారు. మతతత్వానికి వ్యతిరేకంగా, సెక్యులరిజం కోసం కేరళ ఎప్పటికీ పోరాటం సాగిస్తూనే ఉంటుందని విజయన్ అన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసును దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా విచారణ జరపాలని సూచించారు. ఎవరినైనా బెదరించగలం అనుకుంటే మాత్రం కేరళలో ఆ ఆటలు చెల్లవని పినరయి విజయన్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-09T17:40:54+05:30 IST