కొరియాలో ఉల్లి సాగు ఉద్యోగాల కోసం కేరళ graduates పోటీ...

ABN , First Publish Date - 2021-10-31T22:04:57+05:30 IST

దక్షిణ కొరియాలో ఉల్లిపాయల సాగు ఉద్యోగాల కోసం

కొరియాలో ఉల్లి సాగు ఉద్యోగాల కోసం కేరళ graduates పోటీ...

కొచ్చి : దక్షిణ కొరియాలో ఉల్లిపాయల సాగు ఉద్యోగాల కోసం కేరళ యువత పరుగులు పెడుతున్నారు. కేరళ ప్రభుత్వ సంస్థ ఓవర్సీస్ డెవలప్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ కన్సల్టెంట్ (ఓడీఈపీసీ) ఈ ఉద్యోగాల కోసం ఓ సెమినార్‌ నిర్వహించింది. దీనికి దరఖాస్తు చేసినవారిలో ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, టెకీలు కూడా ఉన్నారు. గత అనుభవం లేనివారు సైతం దరఖాస్తు చేస్తుండటం గమనార్హం.


ఓవర్సీస్ డెవలప్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ కన్సల్టెంట్ నిర్వహించిన సెమినార్లో దక్షిణ కొరియా వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, పని పరిస్థితులు, జీవన పరిస్థితులు వంటివాటిని వివరించారు. మొదటి సెషన్‌లో 300 మంది, రెండో సెషన్‌లో 500 మంది ఉద్యోగార్థులు పాల్గొన్నారు. ఇటువంటి సెమినార్‌ను బుధవారం తిరువనంతపురంలో కూడా నిర్వహించారు. దీనికి దాదాపు 600 మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. 


ఓడీఈపీసీ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ మాట్లాడుతూ, దక్షిణ కొరియా ప్రభుత్వ సహాయంతో నడిచే ఉల్లిపాయల సాగు ప్రాజెక్టు కోసం నియామక ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. 100 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ ప్రక్రియ జరుగుతోందన్నారు. భవిష్యత్తులో మరో 1,000 మందిని నియమించుకునే అవకాశం ఉందని చెప్పారు. తమకు దాదాపు 4,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తుదారుల ట్రాఫిక్ వల్ల తమ వెబ్‌సైట్ క్రాష్ అయిందని తెలిపారు. ఈ ఉద్యోగానికి విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత అని, అయితే ఎంటెక్, ఎంబీఏ పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేశారన్నారు. 


దక్షిణ కొరియాలోని సినన్, మువన్ దీవుల్లో ఉల్లిపాయల సాగు జరుగుతుంది. ఒక్కొక్క ఉద్యోగికి నెలకు సుమారు రూ.1,12,500 చెల్లిస్తామని దక్షిణ కొరియా సంస్థ హామీ ఇచ్చిందన్నారు. ఉద్యోగులు నెలలో 28 రోజులు, రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయవలసి ఉంటుందన్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కొక్కసారి భారీగా పెరుగుతాయని, ఒక్కొక్కసారి అతి తక్కువకు అంటే మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిపోతాయని చెప్పారు. కేరళ, దక్షిణ కొరియా ఆహారం వేర్వేరని చెప్పారు. అక్కడ ప్రధానంగా పోర్క్ తింటారన్నారు. ఉద్యోగులకు వసతి సదుపాయాన్ని యజమానులు కల్పించబోరని చెప్పారు. 


ఇదిలావుండగా, దక్షిణ కొరియాకు వెళ్ళిన తర్వాత తమ అర్హతలకు తగిన ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చునని ఉన్నత విద్యావంతులు భావిస్తున్నారు. అందుకే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నామని చెప్తున్నారు. 


Updated Date - 2021-10-31T22:04:57+05:30 IST