కొవిడ్ లాక్‌డౌన్: కేరళలో మద్యం షాపులు బంద్ చేయకపోవడం వెనుక అసలు కారణం తెలిస్తే..!

ABN , First Publish Date - 2020-03-25T04:28:20+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్ ప్రకటించిన...

కొవిడ్ లాక్‌డౌన్: కేరళలో మద్యం షాపులు బంద్ చేయకపోవడం వెనుక అసలు కారణం తెలిస్తే..!

తిరువనంతపురం: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్ ప్రకటించిన కేరళ ప్రభుత్వం మద్యం షాపులను మాత్రం మూసివేసేందుకు తటపటాయిస్తోంది. అదేమని అడిగితే ముఖ్యమంత్రి పినరయి విజయన్ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చెప్పిన మాటలు గుర్తుచేస్తూ సమర్థించుకున్నారు. మద్యం షాపులు సైతం ‘నిత్యావసర సేవల’ కిందికి వస్తాయంటూ పంజాబ్ సీఎం పేర్కొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేస్తే తీవ్ర ‘సామాజిక పరిణామాలు’ ఎదురయ్యే అవకాశం ఉందనీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఘటనలను భరించలేమని సీఎం విజయన్ తేల్చిచెప్పారు. అయితే లిక్కర్ షాపుల ముందు జనాలు గుమిగూడకుండా చర్యలు తీసుకుంటామనీ.. అమ్మకం వేళలపైనా ఆంక్షలు విధిస్తామని ఆయన చెబుతున్నారు. బార్ల వద్ద డైన్‌ఇన్ సర్వీసులు కూడా నిలిపివేస్తున్నామనీ.. యాజమాన్యాలు కేవలం కౌంటర్ల ద్వారా మాత్రమే మద్యం అమ్మాలని ఆయన ఆదేశించారు. కాగా కరోనా వైరస్ కారణంగా తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నా మద్యం అమ్మకాలను నిలిపివేసేందుకు కేరళ వెనుకంజ వేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.


అందులో ప్రధానమైనది.. కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ (బీఈవీసీవో) అనే ప్రభుత్వ రంగ సంస్థ మద్యం అమ్మకాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం. ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్), బీర్, వైన్లను మొత్తం 14 జిల్లాల్లో 330 ఔట్‌లెట్ల ద్వారా స్వయంగా బీఈవీసీవో విక్రయిస్తోంది. దీంతో పాటు 36 విదేశీ లిక్కర్ రిటైల్ ఔట్‌లెట్లు, మూడు బీర్ షాపులు కూడా నిర్వహిస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో 3500 కల్లు దుఖాణాలు కూడా ఉన్నాయి. ఇక రెండోది.. రాష్ట్రంలో ప్రతియేటా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతుండడం. ప్రత్యేకించి ఓనమ్, క్రిస్ట్‌మస్, న్యూఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని మందుబాబులు పోటీపడి మరీ మద్యం అమ్మకాలకు మరింత కిక్ ఇస్తున్నారు. దీంతో 2018-19లో కేరళలో కేవలం మద్యం అమ్మకాల ద్వారా రూ.14,504 కోట్లు వచ్చినట్టు బీఈవీసీవో నివేదించింది. అంతకు ముందు ఏడాది కంటే ఇది ఏకంగా రూ.1567 కోట్లు ఎక్కువ. దీనికి తోడు ఎక్సైజ్ సుంకం, లిక్కర్ సేల్స్ ట్యాక్స్ వగైరా కలిపి గతేడాది ప్రభుత్వానికి రూ.11 వేల కోట్లకు పైగా రాబడి వచ్చింది. 


ఇక  కేరళలో మద్యం అమ్మకాలను ఆపకపోవడానికి గల మూడో కారణం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిగా చెబుతున్నారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలుతో పాటు వెంట వెంటనే సంభవించిన వరదల కారణంగా రాష్ట్రం ఆర్ధికంగా చితికిపోయింది. దీనికి తోడు అనూహ్యంగా కోవిడ్-19 ఉత్పాతం ముంచుకు రావడంతో రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు, ప్రయివేటు సంస్థలు, వాణిజ్య వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపివేస్తే దొంగసారాయి వంటి ‘సామాజిక విపరిణామాలు’ తలెత్తుతాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గతంలో నకిలీమద్యం కారణంగా ఎర్నాకుళం జిల్లాలో 70 మంది చనిపోవడం కేరళ చరిత్రలో ఓ చీకటి ఘట్టం. అసలే ప్రస్తుతం కోవిడ్ కారణంగా తలపట్టుకుంటున్న ప్రభుత్వం మళ్లీ అలాంటి ఘటన జరిగితే పరిస్థితి ఏమిటని మల్లగుల్లాలు పడుతోంది. ‘‘లిక్కర్ షాపుల కారణంగా కరోనా మహమ్మారి విస్తరించే ప్రమాదం ఉన్నందువల్ల నేను పూర్తిగా వీటిని వ్యతిరేకిస్తున్నాను. అయితే ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. మద్యంపై పూర్తి నిషేధం విధిస్తే.. రాష్ట్రంలో ఎలాంటి దారుణం జరుగుతుందో ఊహించడం కూడా కష్టం.  నకిలీ మద్యం కారణంగా మరో ఘోరం జరగొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని భరించే శక్తి రాష్ట్రానికి లేదు...’’ అని ప్రముఖ సామాజిక వేత్త సీఆర్ నీలకంఠన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-25T04:28:20+05:30 IST