నైరుతి కరుణించేనా?

ABN , First Publish Date - 2020-06-04T10:23:15+05:30 IST

కాడి కదలాలన్నా.. దుక్కి దున్నలన్నా.. సాగు చేయాలన్నా చినుకు పడితేనే సాధ్యం.

నైరుతి కరుణించేనా?

వానలు పడితేనే ఖరీఫ్‌ సాగు

నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా తగ్గని ఎండలు

తొలకరి జల్లులతో సాగుకు సిద్ధమవుతున్న రైతులు

దుక్కులు దున్నుతూ వరి నారుమళ్లు సిద్ధం

జిల్లా సాధారణ వర్షపాతం 1029 మి.మీ.

గత ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు

వానాకాలంలో 4.85 లక్షల ఎకరాలలో పంటలు సాగయ్యే అవకాశం

సబ్సిడీ విత్తనాలు, ఎరువుల పంపిణీ



కామారెడ్డి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): కాడి కదలాలన్నా.. దుక్కి దున్నలన్నా.. సాగు చేయాలన్నా చినుకు పడితేనే సాధ్యం. జూన్‌లో తొలకరిగా పలకరించే నైరుతి రుతుపవ నాలపైనే అందరు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రాష్ర్టాన్ని తాకిన రుతుపవనాలు జిల్లాలో తొలకరి జల్లులు కురుస్తు న్నాయి. ఈ తొలకరి పలకరింపుతో జిల్లా రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ వానా కాలం సీజన్‌లో 4.85 లక్షల ఎకరాల్లో పంటలను రైతులు సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన పంటల సాగు విధానా న్ని అమలు చేస్తుండడంతో రైతులు, ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేసేలా అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఏడాది ఆలస్యంగానైన విస్తారంగా వర్షాలు పడడంతో జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదయింది. దీంతో గత ఖరీఫ్‌, రబీ లలో రైతులు విస్తారంగానే పంటలు సాగు చేశారు. ఈ ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు కనికరించి విస్తారంగా వర్షాలు కురవాలని జిల్లా రైతాంగంతో పాటు ప్రజలు ఆశిస్తున్నారు.


జిల్లాలో సాధారణ ..వర్షపాతం 1029 మిల్లీ మీటర్లు

జిల్లాలో సాధారణ వర్షపాతం 1029 మిల్లీమీటర్లుగా లెక్కించారు. ఇందులో జూన్‌ నుంచి మొదలై సెప్టెంబరు వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల ద్వారా 800 మిల్లీ మీటర్ల వరకు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఈశాన్య రుతుపవనాల ద్వారా 300ల మీల్లీమీటర్ల వర్షపాతం కురు స్తుందని అంచనా వేశారు. శీతాకాలం, వేసవిలో 120 మిల్లీ మీటర్ల వర్షం పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా అల్పపీడనాలు, తుఫాన్‌ లు సంభవిస్తే ఈ వర్షపాతం మరింత రెట్టింపు అయ్యే అవ కాశం ఉంటుంది. నైరుతి రుతుపవనాలే జిల్లాకు నీటి వన రులను సమకూరుస్తున్నాయి. మే ఆఖరులో అండమాన్‌ను తాకే ఈ రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోగా కేరళ ను తాకి అక్కడి నుంచి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి.


గత ఏడా ది జూన్‌ మొదటి వారంలో కేరళను తాకిన నైరుతి రుతుప వనాలు జూన్‌ రెండో వారంలో రాష్ర్టాన్ని పలకరించినా పెద్దగా వర్షాలు వర్షించలేదు. జూలై మాసంలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలోని నీటి ప్రాజె క్ట్‌లు, చెరువులు కుంటలు, వాగులు వంకలు నీటితో కళకళ లాడాయి. ఈ సారి మాత్రం ఇప్పటికే నైరుతి రుతుపవ నాలు కేరళను తాకి రాష్ట్రంలో ప్రవేశించాయి. దీంతో జిల్లా అంతటా చిరుజల్లులు పడుతుండడంతో వాతావరణం కాస్త చల్లబడింది. 


గత ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు

గత ఏడాది నైరుతి రుతుపవనాలు జిల్లాను  తాకడం తొలకరి జల్లులు సమయానికి పడటంతో రైతులు, ప్రజలు సంతోషపడ్డారు. కానీ జూన్‌ మూడో వారం నుంచే వర్షాలు మొఖం చాటేయడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు జూలై రెండో వారం వరకు వర్షాలు లేక రైతులు పంటల సాగుకై ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జూలై చివరి సమయంలో ఆగష్టు మాసంలో విస్తారంగా వర్షాలు కురిశా యి. జిల్లా సాధారణ వర్షపాతం 1029 మి.మీ కాగా గత ఏడాది వర్షాకాలంలో 1040 మి.మీ వర్షపాతం నమోదైంది.


అనగా గత ఏడాది సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షా లు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటు న్నారు. విస్తారంగా వర్షాలు కురవడంతో పోచారం ప్రాజెక్ట్‌, సింగీతం, కళ్యాణి లాంటి రిజర్వాయర్‌లతో పాటు పలు డ్యాంలు, చెరువులు, అలుగు పారి నీటితో కళకళలాడాయి. భూగర్భ జలాలు సైతం కాస్త వృద్ధి చెందాయి. కానీ నిజాం సాగర్‌, కౌలాస్‌ ప్రాజెక్ట్‌లు మాత్రం నిండుకోలేకపోయాయి. అయినప్పటికీ ఖరీఫ్‌, రబీ సీజన్‌లో రైతులు విస్తారంగా పంటలు సాగు చేశారు.


ఈ సీజన్‌లో 4.85 లక్షల ఎకరాల్లో  పంటలు సాగయ్యే అవకాశం

రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ఈ వానా కాలం సీజన్‌ నుంచి అమలు చేస్తోంది. వానా కాలంలో మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని పత్తి, కంది తదితర పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దానికి తగ్గట్టుగానే అధికారులు నూత న సాగు విధానంపై విస్తృత అవగాహన కల్పించడం తో పాటు వానాకాలం పంటల సాగు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలోని 22 మండలాల్లో ఈ సీజ న్‌లో 4.85లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగ య్యే అవకాశాలున్నాయి.


గత ఖరీఫ్‌లో 4.31 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ప్రధానంగా వరి 2,12,846 ఎకరాలలో, పత్తి 86,865 ఎకరాలలో, కందులు 38,774 ఎకరాలలో, పెసర్లు 20,282 ఎకరాలలో, మినుములు 14,406 ఎక రాలలో, సోయాబిన్‌ 1,01,920 ఎకరాలలో, చెరుకు 9,328 ఎకరాలలో, ఇతర పంట లు 883 ఎకరాలలో పంటలు సాగవు తాయని వ్యవసాయశాఖ అంచ నా వేస్తోంది. ఈ వానాకాలంలో మొక్కజొన్న పంటను అధికారు లు ప్రణాళికలో చేర్చలేదు. నూతన సాగు విధానం ప్రకా రం వానాకాలంలో మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని ప్రభుత్వం నిబంధన విధించింది. రైతులు ఏ మేరకు మొక్కజొన్న ను సాగు చేయరో చూడాలి.


సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సరఫరా

వానాకాలం సీజన్‌ ఆరంభం కాకముందే జిల్లా యంత్రాంగం రైతులకు అవసరమయ్యే సబ్సిడీ విత్తనాలు, ఎరువులను మార్కెట్‌లో అందుబాటు లో ఉంచారు. ఇప్పటికే ఆయా సహకార సంఘా లు, ప్రైవేట్‌ డీలర్ల వద్ద పూర్తిస్థాయి స్టాక్‌ను చేర్చారు. రబీ సీజన్‌ కోతలు ముగియడం, అమ్మి న పంటల డబ్బులు చేతికి రావడంతో వానా కాలం పంటల సాగుకు అవసరమయ్యే విత్తనాలు ఎరువులను కొనుగోలు చేస్తూ సిద్ధంగా పెట్టు కుం టున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో సోయా 30 వేల క్వింటాళ్లు, వరి సన్నరకం విత్తనాలు 22వేల క్వింటాళ్లు, దొడ్డు రకం 37,581 క్వింటాళ్లు, కంది 800క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు యూరియా 45 వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 8వేల మెట్రిక్‌ టన్ను లు, పోటాష్‌ 6వేల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 22వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులను అందుబాటు లో ఉంచారు.


పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు

జిల్లాకు నైరుతి పవనాలు తాకడంతో తొలకరి జల్లులు పడుతుండటంతో జిల్లా రైతులు వానా కాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రైతులు, విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచుకు న్నారు. తొలకరి జల్లులతో పంట పొలాల్లో దుక్కు లు దున్నుతూ నారుమల్లను సిద్ధం చేస్తున్నారు. బోరుబావుల కింద వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. మరోవైపు జిల్లాలో వరితో పాటు పత్తి, సోయా, కంది, పెసర పంటలను విస్తారంగా నే సాగు చేస్తుంటారు. నీటి వసతులు లేనిచోట్ల ఈ పంటలను సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వర్షాధార పంటలపై జిల్లా రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. తొలకరి జల్లులు పడటంతో సోయా, మొక్కజొన్న, పత్తి విత్తనాలను వలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2020-06-04T10:23:15+05:30 IST