పిల్లలు ఏమనుకుంటున్నారు?

ABN , First Publish Date - 2020-04-07T05:30:00+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ వల్ల పిల్లలు బయటకు వెళ్లడం పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు ఇళ్లలో లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ గురించి వారికొచ్చే సందేహాలను తీర్చడం తల్లిదండ్రులకు సవాలుగా...

పిల్లలు ఏమనుకుంటున్నారు?

  • పీటీఐ జర్నలిస్టుల స్వీయ అనుభవాలు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6:  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ వల్ల పిల్లలు బయటకు వెళ్లడం పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు ఇళ్లలో లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ గురించి వారికొచ్చే సందేహాలను తీర్చడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో తెలియని కరోనా వైరస్‌ గురించి పిల్లలడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం తల్లిదండ్రులకు కత్తి మీద సాము లాంటిదే. ఈ నేపథ్యంలో పీటీఐ వార్తాసంస్థకు చెందిన జర్నలిస్టులు తమ అనుభవాలను పంచుకున్నారు. కరోనా వైరస్‌ గురించి 2 నుంచి 13 ఏళ్లలోపు వయసున్న తమ పిల్లలు కరోనా గురించి ఆలోచిస్తున్న తీరును అందరితో పంచుకున్నారు.

  1. నిహీర్‌ వయసు 2 ఏళ్ల 4 నెలలు. తన తండ్రి వాడే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అంటే చాలా ఇష్టం. మామూలు రోజుల్లో రోజూ కాసేపు ఆ బైక్‌ మీద తిరిగి రావడం తప్పనిసరి. ఇప్పుడు మాత్రం పొద్దున్నే బైక్‌ను కాసేపు స్టార్ట్‌ చేసి పెట్రోల్‌ ట్యాంకు మీద నిహీర్‌ను కూర్చోబెడుతున్నారు. బయట రోడ్ల మీద కరోనా ఉందని, అది అందరికీ కొడుతుందని వాళ్ల అమ్మ చెప్పింది. నిహీర్‌కు కూడా కరోనా ప్రమాదకరమైందని అర్థం చేసుకొని, అది పోయాక దగ్గర్లోని కొండ దగ్గరకు ఆడుకోడానికి వెళ్తానని చెపుతున్నాడు.
  2. మూడేళ్ల ఇరాకు మామూలుగా ప్లేస్కూల్‌కు వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ లాక్‌డౌన్‌ తర్వాత తన స్నేహితులతో ఆడుకోవాలని మొండికేస్తుంది. దీంతో తల్లి అరుంధతి పొద్దున్నే ఇంట్లో ఉన్న ఆటబొమ్మలన్నీ బయటకు తీసి, స్కూలు వాతావరణాన్ని సృష్టిస్తుంది. కరోనా ఒక భూతమనీ, బయటికెళ్లినా, చేతులు సరిగా కడుక్కోకపోయినా కరోనా తీసుకెళుతుందని చెప్పింది.
  3. నాలుగేళ్ల అన్వీ దేశ్‌ముఖ్‌ మాత్రం ఎలాగైనా కరోనా దెయ్యాన్ని పట్టుకొని కొట్టాలని రోజూ రెండుసార్లు గేటు దగ్గరికెళ్లి చూస్తుంటాడు. కరోనాను తాకకూడదనీ, సబ్బుతో చేతులు కడుక్కుంటే నువ్వు దానికి కనబడవని వాళ్ల డాడీ చెప్పడంతో అప్పటి నుంచి అదే పని చేస్తున్నాడు.
  4. ఏప్రిల్‌లో బర్త్‌డే కోసం వేచిచూసున్న షహనాకు కరోనా అంటే కొంచెం ఇష్టం, కొంచెం కోపం. ఇష్టం ఎందుకంటే వాళ్ల మమ్మీ, డాడీ రోజూ ఇంటి దగ్గరే ఉంటారు. కోపం ఎందుకంటే బర్త్‌డే చేసుకొనే అవకాశం లేకపోవడంతో ఫ్రెండ్స్‌ ఎవరూ ఇంటికి రారు, గిఫ్ట్‌లు కూడా మిస్‌ అవుతుంది. కరోనా జబ్బు వల్ల దగ్గు వస్తుందనీ, చనిపోతారని వాళ్ల మమ్మీ చెప్పడంతో, చుట్టుపక్కల ఎవరు దగ్గినా వాళ్లు చనిపోతారా మమ్మీ అని అడుగుతుంది. టీవీలో చాలామంది వలసలు పోవడం చూసి వాళ్లందరినీ మనతో ఉండమనకూడదా అని అడిగింది. ఏం చెప్పాలో తెలియక కరోనా గురించి ఓ 10 లైన్ల వ్యాసం రాయమని వాళ్ల మమ్మీ చెప్పింది. పద్దతిగా రాసింది.. కానీ చివర్లో కరోనా వచ్చినవారందరూ చనిపోయారని రాసింది.
  5. ఏడేళ్ల ఐరా జైదీ కొద్దిరోజుల్లో కొత్త క్లాస్‌కు వెళుతుందనగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో డీలా పడిపోయింది. చైనా వాళ్లు గబ్బిలాలు, పురుగులు తినకూడదని వాళ్ల డాడీతో చెప్పింది. అవసరమనుకుంటే వాళ్ల దేశంలో వాళ్లు ఏ వైరస్‌నైనా తెచ్చుకోవచ్చు కానీ ఇండియాలో ఎలా తెస్తారని ప్రశ్నించింది.

అయిదేళ్ల సుదీప్తో తన డాడీకి, గ్రాండ్‌ పేరెంట్స్‌కి రోజూ మాస్కులు వేసుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ ఉంటుంది. తనకి ఇష్టమైన బొమ్మకు కూడా కరోనా వైరస్‌ సోకకుండా ముఖానికి కూడా ఒక వస్త్రం కట్టింది.

Updated Date - 2020-04-07T05:30:00+05:30 IST