విద్యుదాఘాతంతోనే బోటు దగ్ధం

ABN , First Publish Date - 2021-10-09T07:01:53+05:30 IST

కాకినాడ క్రైం, అక్టోబరు 8: గత నెల 16వ తేదీన కాకినాడ జగన్నాథపురం ఉప్పుటేరులో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతోనే బోట్‌ దగ్ధం కావడం జరిగిందని, నిరాధార ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనవసర ఘర్షణ వాతావరణం సృష్టించారని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ

విద్యుదాఘాతంతోనే బోటు దగ్ధం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఐజీ కేవీ మోహనరావు

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రవి నిరాధార ఆరోపణలు 

వారం రోజుల్లో సాక్ష్యాధారాలు అందజేయకపోతే చర్యలు

చినరాజప్ప, కొండబాబు, రామకృష్ణారెడ్డి, నవీన్‌లపై కేసు

అనుమతి లేకుండా సీ పోర్టులోకి ప్రవేశించినందుకే..

ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు వెల్లడి

కాకినాడ క్రైం, అక్టోబరు 8: గత నెల 16వ తేదీన కాకినాడ జగన్నాథపురం ఉప్పుటేరులో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతోనే బోట్‌ దగ్ధం కావడం జరిగిందని, నిరాధార ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనవసర ఘర్షణ వాతావరణం సృష్టించారని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు. డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన కాకినాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాధ్‌బాబుతో కలసి బోటు దగ్ధం అయిన ఉప్పుటేరు ప్రాంతాన్ని పరిశీలించి, స్థానికంగా బోటు ప్రమాదంపై మత్స్యకారులు, పోలీసు అధికారులు, సిబ్బందిని విచారించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మోహనరావు మాట్లాడుతూ సెప్టెంబరు 16వ తేదీ సాయంత్రం జగన్నాథపురం బకింగ్‌హోం కాల్వ (ఉప్పుటేరు)లో ఉన్న పాలెపు జయప్రకాశ్‌కు చెందిన బోటు యాంకరింగ్‌ ప్రాంతంలో ఉండగా వేటకు వెళ్లేందుకు ట్రయల్‌ రన్‌ చేసే క్రమం లో ఇంజన్‌ సెల్ఫ్‌ ఆన్‌ చేయగా వైర్లు షార్ట్‌ కావడంతో ప్రమాదవశాత్తు బోటు అగ్నికి ఆహుతి అయ్యిందన్నారు. ప్రమాదం సంఘటనపై బోటులో ఉన్న చిం తాడ గంగాధర్‌, బోటు సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వన్‌టౌన్‌ సీఐతో కలసి డీఎస్పీ, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీనా వెళ్లి సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఘటనలో కళాసీ మల్లాడి విజయ భాస్కర్‌కు స్వల్పంగా కాలిన గాయాలు అయినట్టు బోట్‌ డ్రైవర్‌ చింతాడ గంగాధర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు.


ఇదే విషయాన్ని జనరల్‌ డైరీలు నమోదు చేశారన్నారు. ప్రమాదం జరిగిన సుమారు 20 రోజుల తర్వాత ఈనెల 5న గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ బోటు దగ్ధం ఘటనపై నిరాధార విమర్శలు, ఆరోపణలు చేశారన్నారు. ఈ విషయమై డీజీపీ ఆదేశాల మేరకు విచారణకు వచ్చానని, వాస్తవాలను పరిశీలించాక నరేంద్ర తప్పుడు ఆరోపణలు చేసినట్టు తేలిందన్నారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులపై అసత్య ఆరోపణలు చేయడమే కాకుండా అనవసర ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారన్నారు.ఈ విషయమై నరేంద్ర వద్ద ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే వారం రోజుల్లో కాకినాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్లో అందజేయాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసు కోవడం జరుగుతుందని నోటీసులు పంపించడం జరిగిందన్నారు. ఇదే కేసు విషయమై ఈనెల 6న టీడీపీ నాయకులు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జ్యోతుల నవీన్‌, ధూళిపాళ్ల నరేంద్రలు అనుమతి లేకుండా కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకుగాను వీరిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ కరణం కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-09T07:01:53+05:30 IST