నాలుగోసారి!

ABN , First Publish Date - 2020-08-13T08:20:31+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ నాలుగోసారి కూడా వాయిదా పడింది. ఇంతకీ ప్రభుత్వం ఇస్తుందా.. వాయిదాలతోనే సరిపుచ్చుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ విధానమే సమస్యాత్మ

నాలుగోసారి!

ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా

తేదీ తర్వాత ప్రకటిస్తామన్న ప్రభుత్వం

పూర్తి స్థాయిలో సిద్ధం కాని ప్లాట్లు 


కర్నూలు(అర్బన్‌), ఆగస్టు 12: పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ నాలుగోసారి కూడా వాయిదా పడింది. ఇంతకీ ప్రభుత్వం ఇస్తుందా.. వాయిదాలతోనే సరిపుచ్చుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ విధానమే సమస్యాత్మకంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్‌ బుధవారం ఇంటి పట్టాల పంపిణీ వాయిదా విషయం ప్రకటిస్తూ..  తేదీని తర్వాత వెల్లడిస్తామన్నారు. 


సాధారణంగా పేదలకు డీకేటీ పట్టాల రూపంలో ప్రభుత్వం భూమి ఇస్తుంది. దానికి చట్టబద్ధత ఉంది. అయితే ఇప్పడు కన్వేయన్స్‌ డీడ్‌ల రూపంలో పట్టాలను ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఈ పద్ధతికి చట్టబద్ధత లేదు. ఏ ప్రాతిపదికన, ఏ చట్ట నిబంధనలకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నదీ ప్రభుత్వం .


స్పష్టత ఇవ్వలేదు. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఏ చట్ట ప్రకారం కన్వేయన్స్‌ డీడ్‌లు ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.


దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రభుత్వం ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. సుప్రీం కోర్టులో కేసు ఇంకా ఉండడంతో మరోసారి వాయిదా వేయకతప్పలేదు. 


నాలుగు సార్లు వాయిదా..

సంక్రాంతికి కానుకగా పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇది అనివార్య కారణాలతో అంబేడ్కర్‌ జయంతి రోజుకు వాయిదా పడింది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. తర్వాత మళ్లీ కరోనా, లాక్‌డౌన్‌ దెబ్బకు ఆగిపోయాయి. లాక్‌డౌన్‌ ఎత్తేయడంతో వైఎస్‌ఆర్‌ జయంతి రోజు ఇవ్వాలనుకున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసింది. చివరికి ఆగస్టు 15న పట్టాలు ఇవ్వాలని అనుకుంది. కోర్టులో కేసు ఉన్నందున నాలుగోసారి కూడా వాయిదా వేయక తప్పలేదని చెబుతున్నారు.


పూర్తి స్థాయిలో సిద్ధం కాని ప్లాట్లు 

జిల్లాలో 1,87,237 మంది లబ్ధిదారుల్లో 1,57,369 మందికి ఇంటి స్థలాలు, 29,868 లబ్ధిదారులకు టిడ్కో గృహాలు కేటాయిం చనున్నారు. ఇందుకోసం లబ్ధిదారులకుఇంటి పట్టాలు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనికి 3,900 ఎకరాలు అవసరం. 2,900 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబా టులో ఉంది. మరో 1,000 ఎకరాల ప్రైవేట్‌ భూమి కొనాలను కున్నారు. ఈ భూమి కొనుగోలులో అనేక వివాదాలు తలెత్తాయి.


వివిధ ప్రాంతాల్లో లే అవుట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. చాలా లే అవుట్లు ఇంకా  సిద్ధం కాలేదు. ఒక వేళ ఆగస్టు 15న పట్టాల పంపిణీ చేసినా ఆ రోజున చాలామంది పేదలకు పట్టాలు అందుకునే అవకాశంలే కుండా పోయింది. 


పలు చోట్ల వివాదాలు 

కొన్ని గ్రామాల్లో లే అవుట్లు ఊరికి దూరంగా ఉన్నాయని పేదలు నిరసన తెలియజేశారు. మరికొన్ని చోట్ల అర్హులను పక్కనపెట్టి అనర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చారంటూ సచివాలయాల వద్ద ఆందోళనలకు దిగుతున్నారు. ఇన్ని సమస్యల నడుమ రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సతమతమ వుతూ వచ్చారు.


భవిష్యత్‌లో ఏ ఇబ్బందులు లేకుండా భూమి ఎంపిక జరగాలని, లేకపోతే పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చినా ప్రయోజనం ఉండదని విశ్రాంత రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో లే అవుట్లు సిద్ధం కాలేదు. మరికొన్ని ప్రాంతాల్లో సిద్ధమైనా లాటరీ తీయలేదు. లాటరీ తీసిన చోట మాత్రం పట్టాల ముద్రణ మొదలు పెట్టారు. అది కూడా వేగం పుంజుకున్నట్లు లేదు. 


 డివిజన్‌ల వారీగా..

కర్నూలు డివిజన్‌ పరిధిలో..

20 మండలాలు, కర్నూలు, ఆత్మ కూరు, డోన్‌, నందికొట్కూరు, గూడూరు అర్బన్‌ ప్రాంతాలున్నాయి. అర్బన్‌లో 43,867, రూరల్‌ 38,633 మంది లబ్ధిదారులకు 921.04 ఎకరాల ప్రభుత్వ, 69.10 ఎకరాల పట్టా భూమిని సేకరించారు. 


నంద్యాల డివిజన్‌లో..

17 మండలాలు, నంద్యాల, ఆళ్లగడ్డ అర్బన్‌ ప్రాంతాలకుగాను 48,814 మంది లబ్ధిదారులుండగా రూరల్‌-730, అర్బన్‌-120 ఎకరాలు సేకరించారు. మొత్తం 980 ఎకరాల్లో 860 ప్రభుత్వ, 120 ఎకరాల పట్టా భూమిని సేకరించారు.


ఆదోని డివిజన్‌లో..

ఫేజ్‌-1 కింద అర్బన్‌-24,583 రూరల్‌ 39,015 మంది లబ్ధిదారులకు గాను 140 ఎకరాల భూమిని సేకరించారు. అందులో 80 ప్రభుత్వ, 60 ఎకరాల పట్టా భూమిని సేకరించారు. రూరల్‌ పరిధిలో 818.22 ఎకరాలుగాను 687.97 ప్రభుత్వ, 130.25 పట్టా భూమిని సేకరించారు. 

Updated Date - 2020-08-13T08:20:31+05:30 IST