అప్పగింతలయ్యాక డ్రైవింగ్ చేసుకుంటూ అత్తారింటికి కొత్త కోడలు!

ABN , First Publish Date - 2021-03-29T11:54:42+05:30 IST

సాధారణంగా మన దేశంలో పెళ్లి తంతు పూర్తయ్యాక...

అప్పగింతలయ్యాక డ్రైవింగ్ చేసుకుంటూ అత్తారింటికి కొత్త కోడలు!

కోల్‌కతా: సాధారణంగా మన దేశంలో పెళ్లి తంతు పూర్తయ్యాక అప్పగింతల సమయంలో ఆడపెళ్లి తరపువారు... వధువు వేరే ఇంటికి వెళ్లిపోతున్నదని కంట నీరు పెట్టుకుంటారు. ఈ సమయంలో వధువు కూడా తన తల్లిదండ్రులను పట్టుకుని ఏడుస్తుండటం చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా కోల్‌కతాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. అప్పగింతలయ్యాక ఒక వధువు కారులో కూర్చుని, స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ, నవ్వుకుంటూ అత్తారింటికి బయలుదేరింది. 


ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను వధువు స్నేహా సింఘీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో స్నేహ డ్రైవర్ సీటులో కూర్చోగా, ఆమె పక్కన వరుడు కూర్చున్నాడు. పాత ఆచారాలకు భిన్నంగా ఈ అప్పగింతల కార్యక్రమం జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఇది మారుతున్న కాలానికి దర్పణమని అంటున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన స్నేహ... ‘నిర్భయులైన, శక్తివంతులైన, స్ఫూర్తిదాయకులైన మహిళలకు అంకితమంటూ’ కామెంట్ రాశారు.

                                    ‘ది హిందుస్తాన్ మిర్రర్’ సౌజన్యంతో...

Updated Date - 2021-03-29T11:54:42+05:30 IST