కొర్రకు గిట్టుబాటు ధర ఏదీ?

ABN , First Publish Date - 2021-05-08T05:11:04+05:30 IST

కొర్ర పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కొర్రకు గిట్టుబాటు ధర ఏదీ?
గొట్లూరులో సాగు చేసిన కొర్ర పంట

  1. తెగుళ్లతో దెబ్బతిన్న పంట 
  2. ఆందోళనలో రైతులు 


చాగలమర్రి, మే 7: కొర్ర పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్‌లో మండలంలోని గొట్లూరు, నేలంపాడు, రాంపల్లె, మల్లేవేముల, చింతలచెరువు, చిన్నవంగలి, డి.వనిపెంట, కొత్తపల్లె, కొలుములపేట, నగల్లపాడు తదితర గ్రామాల్లో 3 వేల ఎకరాల దాకా కొర్ర పంటను సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి రూ.15 వేలు దాకా ఖర్చు చేశారు. ఎకరాకు 18 క్వింటాళ్లు రావాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల వల్ల ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.  కొర్ర ధాన్యం క్వింటం  రూ.2,200 మాత్రమే ధర పలుకుతుంది. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది క్వింటం కొర్ర ధాన్యం రూ.3,200 ధర పలికింది.  వ్యాపారులు గింజలను బట్టి ధర నిర్ణయిస్తున్నారని రైతులు విలపిస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.


గిట్టుబాటు ధర కల్పించాలి

కొర్ర ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. 6 ఎకరాల్లో కొర్ర పంట సాగు చేశా. రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 12 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ధర తగ్గడంతో లాభసాటిగా లేదు. 

 - రోషిరెడ్డి, రైతు, గొట్లూరు 


పభుత్వమే ఆదుకోవాలి

4 ఎకరాల్లో కొర్ర పంట సాగు చేశా. ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి పెట్టా. పంట చేతికొచ్చేసరికి ధర పతనమైంది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.

- దస్తగిరి, రైతు, గొట్లూరు

Updated Date - 2021-05-08T05:11:04+05:30 IST