చాపకింద నీరులా..జిల్లాలో విస్తరిస్తున్న కొవిడ్‌-19

ABN , First Publish Date - 2020-06-02T09:16:29+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతీరోజూ పదుల సంఖ్యలో కొవిడ్‌-19 పాజిటివ్‌లు నిర్ధారణ అవుతున్నాయి

చాపకింద నీరులా..జిల్లాలో విస్తరిస్తున్న కొవిడ్‌-19

నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసుల నమోదు

సోమవారం జిల్లావ్యాప్తంగా 29 మందికి వైరస్‌ నిర్ధారణ

జి.మామిడాడ-9, వేములపల్లి-8, అనపర్తి-1, రాజోలు, బొమ్మూరు క్వారంటైన్లలో-11

ఇందులో 18 మంది పురుషులు, 11 మంది మహిళలు

జి.మామిడాడలో 116కి చేరిన కొవిడ్‌ మృతుడి బాధితులు

జిల్లాలో మొత్తం 271కి పెరిగిన కేసులు


(కాకినాడ, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

జిల్లాలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతీరోజూ పదుల సంఖ్యలో కొవిడ్‌-19 పాజిటివ్‌లు నిర్ధారణ అవుతున్నాయి. దీంతో వైద్యులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ఒకే ప్రాంతం, దానికి అనుబంధంగా రెండు, మూడుచోట్ల కేసులు నమోదవ్వగా, గడచిన రెండు రోజులుగా అనేక మండలాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఏరోజు ఎక్కడ ఏ కేసు బయటపడుతుందోననే ఆందోళన నెలకొంది. తాజాగా సోమవారం జిల్లావ్యాప్తంగా 29 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో జి.మామిడాడలోనే మరో తొమ్మిది మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఇటీవల కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి ద్వారానే వీరంతా వైరస్‌ బారిన పడినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ముంబై నుంచి గత నెలలో తొమ్మిది మంది వలస కూలీలు కోనసీమకు వచ్చారు.


వీరిని రాజోలు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేశారు. వీరందరికీ పాజిటివ్‌ అని తేలింది. బాధితుల్లో ఎనిమిది మంది అంబాజీపేట మండలం గంగలకుర్రు ఆగ్రహారానికి చెందిన వారు కాగా ఒకరు అల్లవరం మండలం కోడురుపాడుకు చెందిన వారిగా గుర్తించారు. మండపేట మండలం ద్వారపూడి పంచాయతీ పరిధిలోని వేములపల్లిలో  ఎనిమిది కేసులు నమోదయ్యాయి. వీరందరికీ జి.మామిడాడలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో లింక్‌ ఉండడమే కారణంగా గుర్తించారు. బొమ్మూరు క్వారంటైన్‌లో ఇద్దరికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. గత నెల 31న వీరు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం రాగా క్వారంటైన్‌కు తరలించి టెస్టులు చేస్తే పాజిటివ్‌గా తేలింది.


అనపర్తికి చెందిన 29 సంవత్సరాల యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి కోటిరెడ్డి తెలిపారు. సోమవారం నమోదైన 29 పాజిటివ్‌ కేసుల్లో 18 మంది పురుషులు కాగా 11 మంది మహిళలు ఉన్నారు. ఆదివారం నమోదైన 25 కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 271కి చేరుకుంది. సోమవారం జి.మామిడాడలో నమోదైన తొమ్మిది కేసులతో కలిపితే గత నెల 21న కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి ద్వారా ఈ గ్రామంలో బాధితుల సంఖ్య 116కి పెరిగింది. మార్చిలో కరోనా ముప్పు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 47,219 మంది నుంచి శాంపిళ్లు సేకరించారు. ఇందులో 44,370 మంది ఫలితాలు వెల్లడి కాగా ఇంకా 2,500 మందికి సంబంధించి నివేదికలు రావలసి ఉంది. 

Updated Date - 2020-06-02T09:16:29+05:30 IST