Abn logo
Nov 22 2020 @ 23:58PM

రూ.100 కోట్లు పెంచేశారు..!

దువ్వూరు మండలం జొన్నాపురం వద్ద కుందు నదిపై కుందూ-టీజీపీ ఎత్తిపోతల పథకం నిర్మించే ప్రాంతంKaakateeya

 ఐబీఎం కమిటీ సూచనలకు విరుద్ధంగా పెంచిన వ్యయం

 మళ్లీ ప్రతిపాదనలు పంపిన ఇంజనీర్లు

 రాజకీయ అండ ఉన్న కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకేనా..?

 2019 డిసెంబరు 23న సీఎం జగన శంకుస్థాపన

 ఏడాది కావస్తున్నా టెండర్లకు కూడా నోచుకోని వైనం 

 ప్రశ్నార్థకంగా కుందూ-టీజీపీ ఎత్తిపోతల పథకం


తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంగా కుందూ-టీజీపీ ఎత్తిపోతల పథకం చేపట్టారు. రూ.560 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో కాంట్రాక్ట్‌ ఎస్టిమేట్‌ రూ.480 కోట్లు. ఐబీఎం కమిటీ పైపులైనలో పలు మార్పులు చేస్తూ రూ.375 కోట్లకు కుదించింది. గత ఏడాది డిసెంబరు 23న సీఎం జగన శంకుస్థాపన చేశారు. తక్షణమే టెండర్లు పిలిచి ఉంటే ప్రభుత్వానికి రూ.105 కోట్లు మిగిలి ఉండేవి. టెండర్లలో జాప్యం.. రాజకీయ జోక్యం కారణంగా ఐబీఎం కమిటీ సిఫారసులు పక్కన పట్టారు. మళ్లీ ప్రతిపాదనలకు సై అనడంతో సుమారుగా రూ.100 కోట్లు పెరుగుతోందని సమాచారం. కాంట్రాక్టర్‌కు మేలు చేసేందుకే పెంచారనే ఆరోపణలు లేకపోలేదు. 2020-21 కొత్త ఎస్‌ఎ్‌సఆర్‌  ప్రకారం రీఎస్టిమెట్‌ తయారు చేస్తున్నామని ఇంజనీర్లు అంటున్నారు. కుందూ-టీజీపీ లిఫ్టు ప్రశ్నార్థకంగా మారనుంది. ఆ  వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టు (టీజీపీ) పరిధిలో జిల్లాలో మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలలో 12 మండలాల్లో 1.77 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రధాన కాలువలో 5 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటేనే పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అయితే.. జిల్లా సరిహద్దు 98.60 కి.మీల దగ్గర 1600-2000 క్యూసెక్కులకు మించి నీరు రాలేని పరిస్థితి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఇలాగే ఉంది. మెయిన కెనాల్‌ 0/0 నుంచి 18 కి.మీల వరకు సీసీ లైనింగ్‌ లేకపోవడం, ఎగువన కర్నూలు జిల్లాలో అక్రమ ఆయకట్టు సాగు పెరగడంతో జిల్లా సరిహద్దు దగ్గర రావాల్సిన నీటి ప్రవాహం రావడం లేదని ఇంజనీర్లు అంటున్నారు. కుందూ నదిలో ఏటా వరద ప్రవాహం ఆశాజనకంగా ఉంటుంది. ఆ నీటిని టీజీపీ కాలువలో ఎత్తిపోస్తే 1.77 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చనే లక్ష్యంగా ‘కుందూ-టీజీపీ లిఫ్ట్‌ స్కీం’కు రూపకల్పన చేశారు.


ఏడాది కావస్తున్నా..!


దువ్వూరు మండలం జొన్నవరం దగ్గర కుందూ నుంచి 1400 క్యూసెక్కులు ఎత్తిపోసేలా 350 క్యూసెక్కుల సామర్థ్యంతో నాలుగు పంపులతో ప్రధాన లిఫ్టు స్కీం నిర్మిస్తారు. అక్కడి నుంచి స్టేజ్‌-1 కింద 5 కి.మీలు నాలుగు లైన్ల పైపులైన, స్టేజ్‌-2లో 0.50 కి.మీలు నాలుగు లైన్ల పైపులైన నిర్మాణం కీలకమైనది. 2.6 డయామీటర్లు, 14 ఎం.ఎం మందం (తిక్‌నె్‌స)తో పైపులైన ప్రతిపాదించారు. 2019-20 ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్ల మేరకు రూ.564.60 కోట్లకు టీజీపీ ఇంజనీరింగ్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందులో కాంట్రాక్ట్‌ ఎస్టిమేట్‌ విలువ రూ.480 కోట్లు. 2019 డిసెంబరు నెలలో రూ.564.60 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెం.562 జారీ చేసింది. డిసెంబరు 23న సీఎం జగన శంకుస్థాన చేశారు. ఏడాది కావస్తున్నా టెండర్లకు కూడా నోచుకోలేదు. 


ఐబీఎం సూచనలు పక్కన పెట్టి..


టెండర్ల కోసం సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను ఇంటర్నేషన బెంచ మార్క్‌ (ఐబీఎం) కమిటీకి పంపించారు. ఈ కమిటీలో రిటైర్డ్‌ సీఈ చైర్మన, సెంట్రల్‌ డిజైన ఆర్గనైజేషన (సీడీవో) సీఈ, కడప ఇరిగేషన ప్రాజెక్ట్స్‌ సీఈ సభ్యులుగా ఉంటారు. కుందూ-టీజీపీ లిఫ్టు డీపీఆర్‌ను పరిశీలించిన ఐబీఎం కమిటీ పలు సవరణలు చేసి పైప్‌లైను డిజైనలో కీలక మార్పులు చేసింది. 350 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా పైపులైన 2.6 డయామీటరు, 14 ఎంఎం మందం (తిక్‌నె్‌స)ను ఇంజనీర్లు ప్రతిపాదిస్తే.. ఆ సామర్థ్యం నీటి ప్రవాహానికి 2.2 డయామీటర్‌, 12 ఎంఎం మందం (తిక్‌సెన) సరిపోతుందని సిఫారసు చేసింది. కీలకమైన పైప్‌లైన డయామీటర్‌, తిక్‌నెస్‌ తగ్గించడంతో కాంట్రాక్ట్‌ ఎస్టిమేట్‌ విలువ రూ.480 కోట్ల నుంచి రూ.375 కోట్లకు తగ్గింది. ఆ మేరకు అప్రూవల్‌ కూడా ఇచ్చారు. అంటే.. రూ.105 కోట్లు ప్రజాధనం ఆదా అయింది. తక్షణమే టెండర్లు పిలిచి ఉంటే ఈ పాటికే స్కీం నిర్మాణం సగం పూర్తయి ఉండేది. ఎందుకు టెండర్లు పిలవలేదో ఇంజనీర్లకే ఎరుక.


రూ.100 కోట్లకుపైగా పెంచేశారు


ఐబీఎం కమిటీ సూచనల మేరకు టెండర్లు పిలవాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గండికోట-చిత్రావతి లిఫ్ట్‌, పైడిపాలెం లిఫ్ట్‌ సామర్థ్యం పెంపు ప్రాజెక్టులతో కుందూ-టీజీపీ లిఫ్ట్‌ కలిపి ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది కావొస్తుంది. ఐబీఎం సూచనలకు విరుద్ధంగా పైపులైన 2.2 డయామీటర్లు, 12 ఎంఎం తిక్‌నెస్‌ కాదని.. 2.2 డయామీటరు, 18 ఎంఎం తిక్‌నె్‌సతో రీఎస్టిమెట్‌ తయారు చేసినట్లు తెలిసింది. 2020-21 ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్ల ప్రకారం ఈ ప్రతిపాదనలు తయారు చేయడంతో కాంట్రాక్ట్‌ ఎస్టిమెట్‌ విలువ రూ.375 కోట్ల నుంచి రూ.470 కోట్లకు పైగా చేరినట్లు సమాచారం. అంటే.. రూ.100 కోట్లు ఖజానాపై అదనపు భారం పడనుంది. రాజకీయ అండదండలు కలిగిన జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్ట్‌ సంస్థల జోక్యంతోనే ఐబీఎం కమిటీ సూచనలకు విరుద్ధంగా పైప్‌లైన మందం పెంచారని, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రతిపాదన విలువ పెంచారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా టెండర్‌ ఎస్టిమెట్‌ విలువ తగ్గించి ప్రజాధనం ఆదా చేస్తున్నామని ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఘనంగా చెబుతుంటే.. మరోపక్క సీఎం జగన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకే కీలకమైన ఐబీఎం కమిటీ సూచనలకు విరుద్ధంగా ప్రతిపాదన విలువ పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


నూతన ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్ల ప్రకారం ప్రతిపాదన 

- శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సీఈ, ఇరిగేషన ప్రాజెక్ట్స్‌, కడప

కుందూ-టీజీపీ లిఫ్ట్‌ స్కీం పైపులైన నిర్మాణంలో ఐబీఎం కమిటీ పలు సూచనలు చేస్తూ అప్రూవల్‌ ఇచ్చిన మాట నిజమే. గండికోట-చిత్రావతి లిఫ్ట్‌, పైడిపాలెం లిఫ్ట్‌ సామర్థ్యం పెంపు పనులతో ఈ ప్రాజెక్టును కలిపి ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్లనే కుందూ-టీజీపీ లిఫ్ట్‌ టెండర్లలో జాప్యం జరిగింది. 2020-21 ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్ల ప్రకారం తిరిగి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. 

2019 డిసెంబరు 23న సీఎం జగన వేసిన శిలాఫలకం (ఫైల్‌)


Advertisement
Advertisement