రైతు బజార్‌ విస్తరణకు రూ.4.5 కోట్లు

ABN , First Publish Date - 2021-06-14T05:20:13+05:30 IST

జిల్లా కేంద్రంలోని సి.క్యాంపు రైతు బజార్‌కు రాష్ట్రంలోనే గుర్తింపు ఉంది.

రైతు బజార్‌ విస్తరణకు రూ.4.5 కోట్లు
సి.క్యాంపు రైతు బజార్‌

కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 13: జిల్లా కేంద్రంలోని సి.క్యాంపు రైతు బజార్‌కు రాష్ట్రంలోనే గుర్తింపు ఉంది. రోజు పది వేల మంది పైగానే వినియోగదారులు ఈ రైతుబజారుకు వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు పొలాల్లో పండించిన కూరగాయలను విక్రయానికి ఇక్కడికి తీసుకువస్తున్నారు. రోజురోజుకు ఈ రైతుబజారుకు వినియోగదారులు, రైతుల తాకిడి ఎక్కువ కావడం వల్ల ప్రభుత్వం రైతుబజారును విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. రైతుబజారుకు ఆనుకొని ఉన్న శిథిలావస్థకు చేరిన అర ఎకరా స్థలంలోని రెవెన్యూ క్వార్టర్లను రైతుబజార్‌ విస్తరణకోసం సంవత్సరం క్రితమే అప్పగించారు. మార్కెటింగ్‌ శాఖ ఏడీఎం సత్యనారాయణ చౌదరి ఈ క్వార్టర్లను స్వాధీనం చేసుకునేందుకు తీసుకున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. ప్రస్తుతం ఉన్న రైతుబజార్‌లో స్థలం సరిపోక వినియోగదారులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలోనే ఈ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.


 విస్తరణకు రూ.4.5 కోట్లు


ప్రస్తుతం ఉన్న రైతుబజార్‌లో వసతులను పెంచి పాత రెవెన్యూ క్వార్టర్లను స్వాధీనం చేసుకుని విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.4.5 కోట్లను మంజూరు చేసింది. అయితే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల కారణంగా నిధులను ఖర్చు పెట్టేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఎన్నికలు పూర్తి కావడం, ఎన్నికల కోడ్‌ తొలగిపోవడంతో రైతుబజార్‌ విస్తరణకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. త్వరలోనే పాత రెవెన్యూ క్వార్టర్స్‌ స్తానంలో సి.క్యాంపు రైతుబజార్‌ విస్తరణ పనులు మొదలు పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


 పనులు త్వరలోనే చేపడతాం


సి.క్యాంపు రైతుబజార్‌ విస్తరణ పనులకు కరోనా కారణంగా పనులు కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఈ కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. రైతుబజార్‌ విస్తరణ పూర్తయితే రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. వినియోగదారులు కూడా త్వరితగతిన బయటికి వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. అన్ని వసతులతో రైతులకు, నగర ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చి రైతుబజార్‌ను అన్ని సౌకర్యాలతో పునర్నిర్మిస్తాం.


 - ఏడీఎం సత్యనారాయణ చౌదరి

Updated Date - 2021-06-14T05:20:13+05:30 IST