Advertisement
Advertisement
Abn logo
Advertisement

అత్యవసరం.. అయోమయం!


- ఆసుపత్రి భవన నిర్మాణాలకు నిధుల కొరత

- మౌలిక వసతుల కల్పనదీ అదే పరిస్థితి

-  అర్థాంతరంగా ఆగిన ‘నాడు-నేడు’ నిర్మాణాలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

’ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తాం. ‘నాడు-నేడు’తో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో కి తెస్తాం’....ఇవీ వైసీపీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చేసిన ప్రకటనలు. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నం. గత ఏడాది డిసెంబరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అదనపు భవనాలు, ఇతరత్రా మౌలిక సౌకర్యాలకు సంబంధించి పనులు ప్రారంభించారు. ఏడాది గడుస్తున్నా అలాగే ఉంటున్నాయి. ‘నాడు-నేడు’ పథకంలో భాగంగా పీహెచ్‌సీల్లో 74 పనులను ప్రారంభించారు. ఇందుకుగాను రూ.39 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులు ఒక అడుగు ముందుకు..నాలుగడుగుల వెనక్కి అన్న చందంగా మారాయి. సాధారణంగా ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు ఏపీ మౌలిక వసతుల కల్పన ఇంజినీరింగ్‌ విభాగం అధికారులతో  చేపట్టాల్సి ఉంది.   పనిభారం అన్న నేపంతో ఆ బాధ్యతలను ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. నిధుల కొరత, బిల్లుల చెల్లింపులో జాప్యంతో ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయాయి. కొత్తగా బొంతు, బూర్జ, లావేరు, మాణిక్యపురం, నిమ్మాడ, అక్కుపల్లి, నివగాం, వెంకటాపురం పీహెచ్‌సీలకు అదనపు భవన నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. ఒక్కొక్క భవనానికి రూ.1.80 కోట్ల అంచనాలతో కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినా... చేసిన పనులకు బిల్లులూ చెల్లించలేదు. దీంతో ఆసుపత్రి కొత్త భవనాల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మిగిలిపోయాయి. కొన్నిచోట్ల పనులు నిలిచిపోగా..మరికొన్ని చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. 

 సగం కూడా పూర్తికాని వైనం

 ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా గత ఏడాది ప్రారంభించిన 74 నిర్మాణ పనుల్లో సగం కూడా పూర్తి కాలేదు. సుమారు 34చోట్ల 50 శాతానికి మించలేదు. ఎనిమిది చోట్ల అసలు పనులే ప్రారంభించలేదు. నాలుగు చోట్ల మాత్రం తుది దశకు చేరుకున్నాయి. సుమారు రూ.16 కోట్ల అంచనాల విలువైన నిర్మాణ పనులు కాంట్రాక్టర్లు పూర్తి చేసి గత ఏడాది జూన్‌ నాటికే సీఎఫ్‌ఎంఎస్‌ -2 కింద బిల్లులు అప్‌లోడ్‌ చేసినా... నిధులు కేటాయించలేదు. 2021 మార్చి నెలలో కేవలం రూ.1.80 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన రూ.14.20 కోట్లు విలువైన నిర్మాణాలు పూర్తయినా బిల్లులు రావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు చాలాచోట్ల పనులు నిలిపివేశారు.   

 పనులు పూర్తిచేస్తాం

‘నాడు-నేడు’ కింద ఆసుపత్రుల్లో చేపడుతున్న నిర్మాణ పనులు వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం. గత ఏడాది కరోనా ప్రభావంతో నిర్మాణాలు సకాలంలో ప్రారంభించలేకపోయాం. బిల్లుల చెల్లింపుల్లో కొంత జాప్యం జరగడం వాస్తవమే. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులకు లేఖ రాశాం. కాంట్రాక్టర్లకు పనులు పూర్తి చేయాలని నోటీసులు జారీ చేస్తున్నాం.  

- కాంతిమతి, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బి, శ్రీకాకుళంAdvertisement
Advertisement