Advertisement
Advertisement
Abn logo
Advertisement

లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు!

ఉట్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ ఉన్నా.. లాభం సున్నా
నాలుగు సంవత్సరాలు పూర్తయినా అందుబాటులోకి రాని వైద్య సేవలు
రోగులకు తప్పని అవస్థలు

ఉట్నూర్‌, నవంబరు 28: అత్యవసర రోగులకు వైద్య సేవలు అందించడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య సేవలు పడకేశాయి. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఉట్నూర్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ లో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ) ఏర్పాటు చేసినా.. రోగులకు మాత్రం వైద్య సేవలు అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా  స్థాని క ఆస్పత్రి నుంచి రిమ్స్‌కు, నిమ్స్‌కు తరలిస్తునప్పటికీ.. పరిస్థితి విషమిం చి ఎంతో మంది రోగుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.
2018లో ప్రారంభించిన అప్పటి మంత్రి లక్ష్మారెడ్డి
21 జనవరి 2018న అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఉట్నూర్‌ ఆస్పత్రిలో  ఐసీయూని ప్రారంభించారు. త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని మంత్రులు ప్రకటించిన నేటికి అందుబాటులోకి రాలేదు.  ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌ మండలాలతో పాటు కుమ్రం భీం జిల్లాలోని జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల నుంచి వైద్యం కోసం ఉట్నూర్‌ ఆస్పత్రికి రోగులు తరలి వస్తుంటారు. ఏజెన్సీలోని రెండు జిల్లాల పరిదిలో ఎక్కడ ప్రమాదాలు జరిగిన ముందుగా ఉట్నూర్‌ ఆస్పత్రికి తెచ్చి ప్రథమ చికిత్సలు అం దించిన అనంతరం జిల్లా కేంద్రంతో పాటు కరీంనగర్‌, నిజామాబాద్‌, మహారాష్ట్రలోని యావత్‌మాల్‌, హైదరాబాద్‌ లాంటి నగరాలకు రోగులను అత్యవసర వైద్యం కోసం తరలిస్తుంటారు. ఉట్నూర్‌ ఆస్పత్రిలో రూ.కోటి  రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన అత్యవసర విభాగంలో ఆధునిక యంత్రాలు, వ్యాధి నిర్ధారణ పరీక్ష పరికరాలను సమకుర్చారు. హృదయ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం అత్యవసర వేళల్లో అవసరమైన కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్‌, గుండెను తట్టిలేపే పరికరం, ఈసీజీ,  రోగివద్దకే వెళ్లి ఎక్స్‌రేలను తీసే యంత్రాలను సమకూర్చారు. అదేకాకుండా రోగుల కోసం నాణ్యమైన గదులతో పాటు పడకలను ఏర్పాటు చేశారు. అయితే, అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఐసీయూకి కావాల్సిన  డాక్టర్లు, వైద్య సిబ్బంది లేక పోవడం తో ఐసీయూ సేవలు రోగులకు అందకుండ పోతున్నాయి. ఇప్పటికైన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఉట్నూర్‌ ఆస్పత్రిలోని ఐసీయూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నామ్‌కే వాస్తేగా సేవలు
ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉపేందర్‌ ఆధ్వర్యంలో సేవలను నామ్‌కే వాస్తేగా ప్రారంభించారు. చిన్న చిన్న కేసులను బతికిద్దామని బావించిన సూపరిండెంట్‌ ఆధ్వర్యంలో ఐసీయూలో ఇటీవల పాముకాటుకు గురైన ముగ్గురిని చేర్పించి రిమ్స్‌ ద్వారా వైద్య నిపుణుల సూచనలు ఫోన్‌ ద్వారా తీసుకుంటూ స్థానిక వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందించడంతో ముగ్గురి ప్రాణాలు దక్కా యి. పాముకాటుకు గురైన వారిని ఉట్నూర్‌ నుంచి రిమ్స్‌కు తరలించే లోపు ప్రాణాలు పోయే అవకాశాలు మెండుగా ఉంటాయని బావించిన సూపరిండెంట్‌ సేవలను తాత్కాలికంగా చేపట్టినప్పటికి ఐసీయూలో ఉండాల్సిన వైద్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో డిప్యూటేషన్‌లో ఉండడంతో ఐసీయూలో పూర్తి సేవలు అందించలేక పోతున్నారు. ఇదే కాకుండా ఉట్నూర్‌ ఆస్పత్రికి ప్రభుత్వం నిధులు సైతం విడుదల చేయక పోతుండడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఆస్పత్రి అభివృద్ధి నిధులు కేవలం యేడాదికి రూ. రెండు లక్షలు మాత్ర మే కేటాయించడంతో నిధులు సరిపోక అవస్థలు ఎదుర్కొంటున్నారు. అదే కాకుండా ఆస్పత్రికి ఫార్మసిస్టును కూడా నియమించడంలో వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా నర్సులే ఫార్మసీ విధులు కూడా నిర్వహిస్తున్నారు.
డిప్యూటేషన్‌లు రద్దు చేయాలని కోరాం
: డాక్టర్‌ జాదవ్‌ ఉపేందర్‌, ఆసుప్రతి సూపరింటెండెంట్‌
ఉట్నూర్‌ సీహెచ్‌సీలో ఐసీయూకి స్పెషలిస్టులను నియమించినప్పటి కీ.. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కొందరు డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. అయితే, జిల్లా కలెక్టర్‌కి తెలిపి వారంలో మూడు రోజులైన ఉట్నూర్‌లో విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరాం. ఐసీయూకి ముగ్గురు స్పెషలిస్టులతో పాటు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్‌లు అవసరం ఉంది. ఖాళీలు ఉండడంతో ఐసీయూ పూర్తిగా  అందుబాటులోకి రావడం లేదు.

Advertisement
Advertisement