రూ.కోటి విలువైన భూమి హుష్‌కాకి

ABN , First Publish Date - 2021-05-18T05:35:09+05:30 IST

రూ.కోటి విలువైన భూమి హుష్‌కాకి

రూ.కోటి విలువైన భూమి హుష్‌కాకి
తాడిగడప వంతెనకు ఆనుకుని బందరు కాల్వ పక్కన చేపడుతున్న నిర్మాణం

బందరు కాల్వపై ఇరిగేషన్‌ స్థలంలో కబ్జాకాండ

తాడిగడపలో రూ.కోటి విలువైన ప్రభుత్వ స్థలం స్వాహా 

అధికారులు పట్టించుకోకపోవడంతో బరితెగింపు

పక్కా శ్లాబ్‌తో నిర్మాణం

అదో అవినీతి రుచి మరిగిన రాజకీయ ‘కాకి’. ఖాళీ జాగా కనిపిస్తే వాలిపోతుంది. అధికారం చేతిలో ఉంది కదా అని అరాచకాలు చేస్తుంది. అనధికారికంగా నిర్మాణాలు చేపడుతుంది. ఇప్పటికే అనేక అవినీతి కట్టడాలతో రూ.కోట్లు ఆర్జించిన ఈ కాకి తాజాగా ఇరిగేషన్‌ స్థలంపై కన్నేసింది. ఏకంగా ప్రభుత్వ స్థలంలో శ్లాబ్‌ వేసి మరీ పక్కా నిర్మాణం చేపడుతోంది.

విజయవాడ, ఆంధ్రజ్యోతి/పెనమలూరు : తాడిగడప వందడుగుల రోడ్డు జంక్షన్‌ నుంచి గ్రామంలోకి  వెళ్లేందుకు బందరు కాల్వపై వంతెన ఉంది. ఈ వంతెన చివర, బందరు కాల్వకు ఆనుకుని ఈ చోటా నేత కొద్దిరోజులుగా అక్రమ నిర్మాణం చేపడుతున్నాడు. దాదాపు 3 సెంట్లు ఉన్న ప్రభుత్వ స్థలంలో ఈ నిర్మాణం జరుగుతోంది. ఈ స్థలం విలువ సుమారు రూ.కోటి పైచిలుకు ఉంటుంది. ఇరిగేషన్‌ శాఖకు చెందిన ఈ స్థలంలో శ్లాబ్‌ వేసి మరీ పక్కా నిర్మాణం చేపడుతున్నారు. పనులు కూడా దాదాపు చివరికి వచ్చాయి. గతంలో ఈ చోటా నేత తాడిగడప జంక్షన్‌ వద్ద కూల్చేసిన బస్‌షెల్డర్‌ పక్కన స్థలాన్ని ఆక్రమించి రేకుల షెడ్లు వేసి కూరగాయల వ్యాపారులకు అద్దెకు ఇచ్చి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో వామపక్ష నాయకులు ఆక్రమణలను అడ్డుకున్నారు. దీంతో ఈ రాజకీయ కాకి అక్కడి నుంచి మకాం మార్చింది. ఆ తర్వాత వీఆర్‌ సిద్ధార్థ కళాశాల ఎదురుగా బందరు రోడ్డు-బందరు కాల్వ మధ్యలో ఉన్న ఇరిగేషన్‌ స్థలంలో వరుసగా షెడ్లను నిర్మించాడు. ఈ విషయాన్ని కూడా ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేసి కలెక్టర్‌ ఉత్తర్వుల ప్రకారం ఆ ప్రాంతంలో ఆక్రమణలు చేపట్టకూడదని హెచ్చరించి తొలగించారు. తాజాగా తాడిగడప వంతెన అవతలి వైపు బందరు కాల్వను ఆనుకుని నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం నిర్మించిన శ్లాబుకు అదనంగా మరొక శ్లాబును నిర్మించి వ్యాపారాలకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

‘హనుమంతుడి’ ఆశీస్సులతో..

ఈ రాజకీయ కాకికి పెనమలూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతగా చెలామణి అవుతున్న ‘హనుమంతు’ని ఆశీస్సులు ఉన్నాయి. ఆయన తెరవెనుక ఉండి ఈ కాకితో అన్ని అక్రమాలు చేయిస్తూ తన పబ్బం గడుపుకొంటుంటారు. వీరిద్దరూ తాము ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితులమని ప్రచారం చేసుకుంటుండటంతో అధికారులెవరూ వీరివైపు చూసేందుకు సాహసించడం లేదు. దీంతో వీరి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఈ నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ జాగా కనిపించినా అక్కడ కాకిని వాలేలా చేసి దాన్ని ఆక్రమించేయడం హనుమంతుడి పని. అదే సమయంలో నియోజకవర్గ పరిధిలో లే అవుట్లు, భవన నిర్మాణాలు చేసే రియల్టర్ల నుంచి మామూళ్లు వసూలు చేయడం కూడా చేస్తున్నారు. తాము చేసే ప్రతి పనికీ ఎమ్మెల్యే పేరు చెబుతుండటంతో రియల్టర్లు కూడా మారు మాట్లాడకుండా మామూళ్లు ముట్టజెబుతున్నారు. వీరి కార్యక్రమాలు పార్టీకి అప్రతిష్ట తెచ్చేవిలా ఉన్నాయని పలువురు వైసీపీ నాయకులే చెబుతున్నారు. ఎమ్మెల్యే వీరి అక్రమాలపై దృష్టిసారించి కట్టడి చేయకుంటే మున్ముందు పార్టీకి భారీ నష్టం వాటిల్లడం ఖాయమంటున్నారు.

విచారణ చేయించి తొలగిస్తాం..

తాడిగడప వంతెన వద్ద అక్రమ నిర్మాణం విషయం మా దృష్టికి రాలేదు. నిర్మాణం జరిగింది నిజమే అయితే, ఇరిగేషన్‌ అధికారులతో చర్చించి, స్థానిక వీఆర్వోతో విచారణ చేయించి తొలగిస్తాం. 

- భద్రు నాయక్‌, తహసీల్దార్‌




Updated Date - 2021-05-18T05:35:09+05:30 IST