ఏళ్లుగా కంప్యూటరీకరణకు నోచుకోని భూ రికార్డులు

ABN , First Publish Date - 2020-06-03T10:37:17+05:30 IST

వారికి భూములు ఉన్నా అమ్ముకోవడానికి వీలుపడదు.. పట్టాదారు పాసు పుస్తకాల్లో సర్వే నంబర్లు ఉన్నా అవి ఆన్‌లైన్‌లో ..

ఏళ్లుగా కంప్యూటరీకరణకు నోచుకోని భూ రికార్డులు

అధికారుల నిర్లక్ష్యం.. రైతుల పాలిట శాపం

సర్వేలు మీద సర్వేలు చేస్తున్నా పరిష్కారం కాని సమస్య

ప్రభుత్వ పథకాలకు నోచుకోని దేరసాం రైతులు


రణస్థలం: వారికి భూములు ఉన్నా అమ్ముకోవడానికి వీలుపడదు.. పట్టాదారు పాసు పుస్తకాల్లో సర్వే నంబర్లు ఉన్నా అవి ఆన్‌లైన్‌లో కనిపించవు.. రుణాల కోసం బ్యాంకులకు వెళ్తే అక్కడా చేదు అనుభవమే.. ప్రభుత్వ పథకాలేవీ వారి దరి చేరవు.. ఏళ్లుగా ఇదే తంతు. సమస్య పరిష్కరించండి మొర్రో అన్నా పట్టించుకున్న నాథుడు లేడు. అధికారుల నిర్లక్ష్యం వారిపాలిట శాపంగా మారింది. ఇదీ దేరసాం రైతుల పరిస్థితి. దేరసాం గ్రామ రెవెన్యూ పరిధిలో 700 ఎకరాల భూములు ఉన్నాయి. 400 మంది రైతులు ఈ భూములను సాగు చేస్తున్నారు. భూ రికార్డులు పక్కాగా లేవని 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో రైతులంతా సర్వే చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సర్వేలు మీద సర్వేలు చేస్తున్నా రైతుల సమస్య పరిష్కారం కావడం లేదు.


భూముల వివరాలు రికార్డుల్లో నమోదు కావడం లేదు. 1బీ, అడంగళ్‌ రాకపోవడంతో ఏ పథకానికి నోచుకోలేక పోతున్నారు. గత ఆరేళ్లుగా జిల్లాకు వచ్చిన మంత్రులు, కలెక్టర్లు,   రెవెన్యూ అధికారులకు అర్జీలు పెట్టుకుంటున్నా ఫలితం దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. భూ రికార్డులు కంప్యూటరీకరణకు నోచుకోకపోవ డంతో చాలా మంది పేద రైతులు తమ అవసరాలకు భూములను అమ్ముకో లేని పరిస్థితి నెలకొంది. పంట నష్ట పరిహారం, రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్‌ యోజన వంటి పథకాలను పొందులేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా  తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 


 పథకాలను పొందలేకపోతున్నాం..మీసాల రామారావు, దేరసాం గ్రామ పెద్ద.  

మా భూ రికార్డులు పక్కాగా లేకపోవడంతో ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను పొందలేక పోతున్నాం. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదు. చాలా మంది నిరుపేద రైతులు భూములు ఉండి కూడా ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు రుణాలు అందడం లేదు. రైతు భరోసా వర్తించడం లేదు. మా గ్రామ భూములను కంప్యూటరికరణ చేసి రైతులను ఆదుకోవాలి.


Updated Date - 2020-06-03T10:37:17+05:30 IST