సామాన్యులకు ఒరిగిందేమీ లేదు...!

ABN , First Publish Date - 2020-09-18T05:56:16+05:30 IST

భూములను క్రమ బద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ సామాన్య ప్రజలకు మేలు

సామాన్యులకు ఒరిగిందేమీ లేదు...!

ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణతో భూస్వాములకే మేలు

200 గజాల ప్లాటుపై తగ్గించింది కేవలం రూ.3,360

10వేల గజాల పైబడి ఉన్న వారికి సగానికి సగం తగ్గింపు

బడాబాబులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం


మంచిర్యాల, సెప్టెంబరు 17: భూములను క్రమ బద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా లేదు. 3000 లోపు చదరపు గజాలు ఉన్న స్థలాలపై 25 నుంచి 20 శాతానికి తగ్గించింది. కేవలం 5 శాతం మాత్రమే ఈ పరిధిలో ఉన్న వారికి తగ్గించినట్లయింది. అయితే అంతకు మించి స్థలం ఉన్న వారికి పరోక్షంగా మేలు చేకూర్చినట్లయింది. ఈ నెల 1వ తేదీన జారీ చేసి జీవో 131 ప్రకారం 10వేల చదరపు గజాలు పైబడి భూమి ఉన్న వారికి 100 శాతం చార్జీలు అమలు చేయగా, సవరించిన జీవో 135 ప్రకారం పై విధంగా స్థలం ఉన్న వారికి ఏకంగా 50 శాతం చార్జీలు తగ్గించేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు 3000  గజాల స్థలం ఉండదు. పేదలకు మేలు చేకూర్చా ల్సింది పోయి, భూ స్వాముల వంతపాడటం విమర్శ లకు దారి తీస్తోంది. 3000లోపు చదరపు గజాలపై 50 శాతం మేర చార్జీలు తగ్గించి ఉంటే పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయుక్తంగా ఉండేది. పేదల పక్షం అని చెప్పుకొనే ప్రభుత్వం వారి స్థలాలకు కేవ లం 5 శాతం తగ్గించి, 50వేల గజాలు ఉన్న స్థలాలకు మాత్రం 100 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంటే భూ స్వాములకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనడానికి ఎల్‌ఆర్‌ఎస్‌ జీవో సవరణ నిదర్శనంగా నిలుస్తోంది.


పేదలకు ఊరటనివ్వని సవరణ...

భూముల క్రమబద్ధీకరణకు ధరలు సవరించినట్లు చెబుతున్న ప్రభుత్వం సామాన్య ప్రజలపై అధిక భారమే మోపుతోంది. ఉదాహరణకు 200 చ.గ ప్లాటు 168 చ.మీ.కు సమానం. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల ప్రకారం 168 చదరపు మీటర్లకు రూ. 400 చొప్పున లెక్కిస్తే రూ.67,200 అవుతోంది. మొదట జారీ చేసిన జీఓ ప్రకారం 25 శాతం చార్జీల చొప్పున సదరు ప్లాటుకు (67,200లో 25 శాతం) రూ. 16, 800 చెల్లించాల్సి ఉండేది. దీంతోపాటు  మిగతా చార్జీ లు యథావిధిగా ఉంచారు. స్థలం నాన్‌ లే అవుట్‌ అయితే అదనంగా ఓపెన్‌ స్పేస్‌ కంట్రిబ్యూషన్‌ చార్జీల కింద ప్లాటు మార్కెటు విలువపై మరో 14 శాతం పన్ను విధిస్తారు. ఈ లెక్కన మార్కెట్‌ విలువ రూ.1200 ఉన్న చోట 168 చదరపు గజాల స్థలానికి రూ. 2 లక్షల 1600 ధర పలుకుతుంది. ఇందులో 14 శాతం పన్ను కింద రూ.28,224 వసూలు చేస్తారు. 


ప్రస్తుతం తగ్గించిన ప్రకారం 3000 చ.గజాల లోపు భూమికి గతంలో కంటే 5 శాతం తగ్గిస్తూ 20 శాతం  చార్జీలు చెల్లించేలా సవరణ చేశారు. ఈ క్రమంలో పై ప్లాటుకు (67,200లో 20 శాతం) రూ.13,440 ఎల్‌ఆర్‌ ఎస్‌ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 200 చదరపు గజాల స్థలం ఉన్న వారికి సవరణకు ముందు జీవోతో పోల్చితే ప్రభుత్వం తగ్గించేది కేవలం రూ.3,360 మాత్రమే. ఇలా ప్లాటు క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్‌ కింద రూ. 13,440తోపాటు ఓపెన్‌ స్పేస్‌ కంట్రిబ్యూషన్‌ చార్జీల కింద మరో రూ.28,224 చెల్లించాలి. అంటే ప్లాటు క్రమబద్ధీకరణ అయ్యే సరికి రెండు కలిపి రూ. 41,664 చెల్లించాల్సి ఉంటుంది. 


రోడ్లు లేకపోతే భూమి కోల్పోవలసిందే...

భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం  తెచ్చిన చట్టంలో అనేక చిక్కులు ఉన్నాయి. లే అవుట్‌ లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి నూతన చట్టం ప్రకారం తిప్పలు తప్పవు. అనధికార వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లాటును ఆనుకొని ఉన్న రోడ్డు కనీ సం 30 ఫీట్ల వెడల్పు ఉండాలి. రోడ్డు తక్కువగా ఉన్న పక్షంలో సదరు ప్లాటు నుంచే రోడ్డుకు సరిపడా స్థలం మినహాయించి, మిగిలిన భూమికే ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిం పజేస్తారు. అంటే రోడ్డుకుపోను మిగిలిన స్థలం మాత్ర మే భూమి యజమానికి దక్కుతుంది. కాయకష్టం చేసి కూడబెట్టుకున్న డబ్బులతో కొనుగోలు చేసిన ప్లాట్లు కూడా పూర్తిస్థాయిలో దక్కే అవకాశం లేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల తప్పిదం కారణంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్‌ఆర్‌ఎస్‌ రూపంలో అధిక భారం మోయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 


భూ స్వాములకే మేలు..వొడ్నాల శ్యాంసుందర్‌, పాత మంచిర్యాల

ఎల్‌ఆర్‌ఎస్‌ విషయమై సవరించిన జీఓ కేవలం భూస్వాములకే మేలు చేసే విధంగా ఉంది. సామాన్య ప్రజలు గరిష్టంగా 1000 గజాలకంటే భూములు కొనుగోలు చేయడం కష్టసాధ్యం. ఈ లెక్కన ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వం తగ్గించింది కేవలం 5 శాతం. చార్జీల చెల్లింపుల్లో ఇది పెద్ద తేడా రాదు. సామాన్య ప్రజల ఉపయోగార్థం సగం చార్జీలు తగ్గిస్తే బాగుండేది. 


ఎల్‌ఆర్‌ఎస్‌ భారం సమంజసంకాదు..డాక్టర్‌ నీలకంఠేశ్వర్‌ గౌడ్‌

పాత రిజిస్ట్రేషన్లకు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయా లి. అప్పుడు అన్ని రకాల చార్జీలు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట భారం మోపడం సమంజసం కాదు. 10వేల గజాల మాదిరి గా 3 వేల గజాల పరిధిలో ఉన్న భూములకు కూడా 50 శాతం చార్జీలు తగ్గించాలి. ప్రభుత్వాలు పేదలకు మేలు చేయాలిగానీ భూ స్వాములకు వంతపాడుతోంది.

Updated Date - 2020-09-18T05:56:16+05:30 IST