ఫీవర్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డుల ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-09T10:26:21+05:30 IST

కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందించేందుకకు నగరంలోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో

ఫీవర్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డుల ప్రారంభం

గుంటూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందించేందుకకు నగరంలోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు ఏర్పాటుచేశామని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. బుధవారం సాయంత్రం ఫీవర్‌ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ వార్డులను ఆమె రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా  సుచరిత మాట్లాడుతూ మొత్తం ఆరు ఐసోలేషన్‌ వార్డులను ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.


కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా జిల్లాలో అనేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు 50పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో సింహభాగం నగరంలోనివేనన్నారు. పాజిటివ్‌ కేసులు గుర్తించిన ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామన్నారు. అనుమానిత లక్షణాలున్న వారు ముందుకువచ్చి చికిత్స చేయించుకోవాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం స్థానిక రెడ్డిపాలెంలోని గురుకాలేజ్‌లో క్వారంటైన్‌ సెంటర్‌ని తనిఖీచేశారు. అక్కడ ఉంచిన కరోనా అనుమానితులతో మాట్లాడారు.


ఐసోలేషన్‌ సెంటర్‌లో సౌకర్యాలు, చికిత్స గురించి ఆరాతీశారు. లాక్‌డౌన్‌ ప్రకటించినందున ఎవ్వరూ బయటకురాకుండా ఇంట్లోనే ఉండి సహకరించాలని మంత్రి సుచరిత కోరారు. మంత్రి వెంట కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు, ఫీవర్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భూషణం, ఆర్‌ఎంవో డాక్టర్‌ సునంద, ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-09T10:26:21+05:30 IST