వర్చువల్ విచారణలో వకీలు రాసలీల!
ABN , First Publish Date - 2021-12-23T08:05:08+05:30 IST
వర్చువల్‌గా కోర్టు విచారణ సాగుతోంది. ఆ వకీల్‌సాబ్ తన ఇంట్లో నుంచే వాదనలకు సిద్ధమయ్యారు. కంప్యూటర్ ముందు కూర్చున్నారు. వాదనలో భాగంగా ..
- మహిళతో అభ్యంతరకర స్థితిలో లాయర్
- చెన్నై కోర్టులో ఘటన.. ఆ దృశ్యాలు వైరల్
- సుమోటోగా స్వీకరణ.. సీబీసీఐడీ విచారణకు ఆదేశం
- ‘అశ్లీలం’పై మౌనంగా ఉండలేమని వ్యాఖ్య
- తమిళనాడు, పుదుచ్చేరి బార్‌కౌన్సిల్స్ కొరడా
- ఎక్కడా ప్రాక్టీస్ చేయకుండా నిషేధం
- పడకపై ఒరిగిన పంజాబ్ పోలీసు మాజీ చీఫ్
- హెచ్చరికతో వదిలేసిన సీబీఐ కోర్టు
చెన్నై, డిసెంబరు 22: వర్చువల్‌గా కోర్టు విచారణ సాగుతోంది. ఆ వకీల్‌సాబ్ తన ఇంట్లో నుంచే వాదనలకు సిద్ధమయ్యారు. కంప్యూటర్ ముందు కూర్చున్నారు. వాదనలో భాగంగా తన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. కొద్ది సమయం గడిచేసరికి ఆవలి వైపు నుంచి అతడిని చూస్తున్న న్యాయమూర్తి, కోర్టు అధికారులు అవాక్కయ్యారు. కెమెరా నడుస్తోందన్న సంగతే మరిచిపోయాడో ఏమో కానీ.. సదరు లాయరు, ఓ మహిళతో అభ్యంతరకరమైన రీతిలో కనిపించారు. మద్రాస్ హైకోర్టులో సోమవారం ఈ ఘటన జరిగింది.
క్షణాల్లోనే లాయర్‌గారి సరసాలు నెట్‌లో వైరల్ అయిపోయాయి. ఆర్‌డీ సంతాన కృష్ణన్ అనే అడ్వొకేట్‌దీ ఘనకార్యం! ఈ ఘటనపై సీరియస్ అయిన మద్రాస్ హైకోర్టు, కృష్ణన్‌పై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. జస్టిస్ ప్రకాశ్, జస్టిస్ హేమలతతో కూడిన ధర్మాసనం, ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఐటీ చట్టం కింద అపరాధంగా పరిగణించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. గురువారానికి (డిసెంబరు 23) నివేదికను ఇవ్వాలని స్పష్టం చేసింది. ‘‘విచారణ సందర్భంగా చోటుచేసుకున్న అశ్లీల ప్రదర్శనను కోర్టు ఓ మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకోబోదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లాయర్ సంతాన కృష్ణన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా బార్ కౌన్సిళ్లను ఆదేశించింది. ఈ మేరకు వెంటనే స్పందించిన తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిళ్లు.. ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేయకుండా సంతాన కృష్ణన్‌పై నిషేధం విధించాయి. కాగా ఇంటర్నెట్ నుంచి వీడియోను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని చెన్నై సీపీకి ఆదేశాలు వెళ్లాయి. కాగా సుమేధ్ సైనీ అనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, పంజాబ్ మాజీ పోలీస్ చీఫ్.. ఓ కేసుకు సంబంధించి వర్చువల్ విచారణలో భాగంగా పడకమీద పడుకున్న స్థితిలో వీడియోలో కనిపించారు.
1994లో మూడు హత్యలు జరిగిన ఘటనలో సుమేధ్ నిందితులు. ఈ నెల 22న సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. సుమేధ్ ప్రవర్తనను సీబీఐ జడ్జి సంజీవ్ అగర్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. మున్ముందు జాగ్రత్తగా ఉండాలని వర్చువల్ విచారణలో భాగంగా కోర్టు మర్యాదను పాటించాలని హెచ్చరించారు.