భారత్‌లో అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంపు.. మరి ఇతర దేశాల పరిస్థితేంటి..? ఆ దేశంలో 15 ఏళ్లకు ఓకే..!

ABN , First Publish Date - 2021-12-17T20:54:59+05:30 IST

అమ్మాయిల పెళ్లి వయసు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహానికి చట్టబద్ధమైన కనీస వయసును 18 నుంచి 21ఏళ్లకు పెంచాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. బాల్య వివాహాల నిరోధక

భారత్‌లో అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంపు.. మరి ఇతర దేశాల పరిస్థితేంటి..? ఆ దేశంలో 15 ఏళ్లకు ఓకే..!

ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయిల పెళ్లి వయసు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహానికి చట్టబద్ధమైన కనీస వయసును 18 నుంచి 21ఏళ్లకు పెంచాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. బాల్య వివాహాల నిరోధక చట్ట సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో ఇతర దేశాల్లో పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే..


అమెరికాలో 18ఏళ్లకు ఓకే

అగ్రరాజ్యం అమెరికా.. వివాహానికి చట్టబద్ధమైన కనీస వయసును 18 సంవత్సరాలుగా నిర్ణయించింది. 18ఏళ్లు నిండిన యువతి, యువకులు పెళ్లి చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే అమ్మాయి తల్లిదండ్రులు(ఎవరో ఒకరైనా సరే) లేదా సంరక్షకుల సమ్మతితో 16/17 ఏళ్ల యువతి పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆమె పెళ్లి చేసుకునే యువకుడికి మాత్రం 18ఏళ్లు కచ్చితంగా ఉండాల్సిందే. కానీ నెబ్రాస్కా, మిస్సిస్సిప్పి రాష్ట్రాల్లో కనీస వివాహ వయసు 19ఏళ్లు, 21 సంవత్సరాలు. 


బ్రిటన్‌లో కూడా 18ఏళ్లే కానీ..

యువతి, యువకులకు 18ఏళ్లను కనీస వివాహ వయసుగా బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. 18ఏళ్లు నిండిన యువతి, యువకులు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడానికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతిస్తుంది. 16/17 ఏళ్ల యువతి, యువకులు తమ తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఇంతకంటే తక్కువ వయసు వాళ్లు పెళ్లి చేసుకోవడం అక్కడ నిషేధం.


డ్రాగన్ కంట్రీలో పరిస్థితి ఏంటంటే..

పక్క దేశం చైనాలో చట్టబద్ధమైన వివాహ వయసు యువతి, యువకులకు వేరువేరుగా ఉన్నాయి. యువకులకు లీగల్ మ్యారేజ్ ఏజ్ 22 సంవత్సరాలు. అమ్మాయిలకు వివాహ వయసును 20ఏళ్లుగా డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది.


ట్రినిడాడ్ మరియు టొబాగో‌లో అశ్చర్యకర అంశం..

18ఏళ్లు నిండిన యువతి, యువకులు పెళ్లి చేసుకోవడానికి ఈ కరేబియన్ కంట్రీ అనుమతిస్తుంది. కానీ మత సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని వెసులుబాట్లు కల్పించింది. 12 ఏళ్ల ముస్లిం యువతి యువకులు వివాహ బంధంతో ఒకటవడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతిస్తుంది. అలాగే 16ఏళ్లు నిండిన హిందూ యువతి, యువకులు పెళ్లి చేసుకోవచ్చు. 


ఎస్టోనియా‌లో ఇలా..

నార్త్ యూరప్ కంట్రీ ఎస్టోనియా 18ఏళ్లను వివాహ వయసుగా పరిగణిస్తుంది. కానీ 15 సంవత్సరాల వయస్సు ఉన్న యువతి, యువకులు తల్లిదండ్రుల సమ్మతితో పెళ్లి చేసుకోవచ్చు.


నైజర్‌లో 15ఏళ్లకే గ్రీన్ సిగ్నల్..

వెస్ట్ ఆఫ్రికా దేశమైన నైజర్‌.. 18ఏళ్ల అబ్బాయిలు, 15 సంవత్సరాల అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే అక్కడి ప్రజలు ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. వారి వారి సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా ఇలా జరిగే పెళ్లిళ్లకు అభ్యంతరం చెప్పదు.




Updated Date - 2021-12-17T20:54:59+05:30 IST