Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆయకట్టులో వరికే మొగ్గు

మిర్యాలగూడ అర్బన్‌: యాసంగిలో వరి వద్దని ప్రభుత్వం పరోక్షంగా చెబుతుండగా, సాగర్‌ ఆయకట్టులో మాత్రం రైతులు వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. వానాకాలం సీజన్‌లో ఆయకట్టులో 4.60లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కాగా, యాసంగిలో సైతం ఇదే స్థాయిలో వరి సాగయ్యే అవకాశం ఉంది.


సాధారణంగా యాసంగిలో తెగుళ్లవ్యాప్తిని తట్టుకొని అధికదిగుబడినిచ్చే దొడ్డురకం-1010 వంగడాలను రైతులు అధికంగా సాగుచేస్తారు. ఏప్రి ల్‌, మే నెలల్లో పంట దిగుబడి చేతికొస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా ధాన్యంలో తేమశాతం పడిపోయి పచ్చిబియ్యం(రారైస్‌) తయారీ సాధ్యపడకపోవడంతో పౌరసరఫరాల శాఖ కస్టం మిల్లింగ్‌ కింద బాయిల్డ్‌రై్‌సగా మార్చి ఎఫ్‌సీఐకి సరఫరా చేస్తుంది. కేంద్రప్రభుత్వం ఈ మారు బాయిల్డ్‌రైస్‌ ధాన్యం కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో వరిసాగును నియంత్రించే ఉద్దేశంతో ఆరుతడి సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెబుతూ వస్తోంది. వ్యవసాయశాఖ కూడా ఈ మేరకు ప్రచారం ప్రారంభించిం ది. అయితే నాగార్జునసాగర్‌ ఆయకట్టులో ఎక్కువగా జాలుపట్టే భూములతోపాటు తేమశాతాన్ని కోల్పోయే తేలికపాటి భూములే అధికంగా ఉన్నాయి. దీంతో ఈ భూములు వరిసాగు కు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఆరున్నర దశాబ్దాలుగా ఆయకట్టు రైతులకు వరి సాగుతప్ప ఇతర పంటలు తెలియవు. ప్రభు త్వం చెబుతున్నట్టు సాగర్‌ ఆయకట్టులో ఆరుతడి పంటలసాగు సాధ్యపడద ని రైతులు చెబుతున్నారు. సాగర్‌ జలాశయం నుంచి 2016లో ఆయకట్టుకు నీటి విడుదల చేయకపోవడంతో రైస్‌మిల్లులకు ధాన్యం కొరత ఏర్పడింది. దీంతో మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్‌మిల్లులు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకున్నాయి. మూసీ, ఏఎమ్మార్పీ, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం జలాలు ఉమ్మడి జిల్లాకు చేరడంతో నీటి లభ్యత పెరిగి సాగర్‌ ఆయకట్టుతోపాటు ఆయకట్టేతర ప్రాంతాల్లోనూ వరిసాగు పెరిగింది. దీంతో ధాన్యం ఉత్పత్తి సైతం గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టుల జాలలకు తోడు మిషన్‌కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు మత్తడిపోస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు పెరిగి బోరుబావుల ఆధారంగా వరిసాగు పెరిగింది. దీనికి 24గంటల ఉచిత విద్యుత్‌ ఊతమివ్వడంతో గడిచిన ఐదేళ్లుగా ఉమ్మడి జిల్లా రైతాంగం సాగర్‌ ఆయకట్టు రైతులతో పోటీపడి వరి సాగుచేస్తున్నారు. దీంతో సాధారణస్థాయికి మించి వరి సాగై ఆరుతడిపంటల ప్రాధాన్యం తగ్గింది. యాసంగిలో దొడ్డుధాన్యం దిగుబడులే సింహాభాగం వస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు ఈ రకం వరి విస్తీర్ణాన్ని తగ్గించి రైతులను ఆరుతడి పంటలవైపు మళ్లించేందుకు వ్యవసాయశాఖ  ప్రచారం ప్రారంభించింది.


సాధారణానికి మించి సాగయ్యే అవకాశం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని మిర్యాలగూడ, సాగర్‌, హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఆయకట్టు భూములు ఉన్నాయి. మేజర్‌, మైనర్‌కాల్వలతోపాటు 41 ఎత్తిపోతల పథకాలను నిర్మించి 3.60లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉచిత విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో ఆయకట్టు రైతులు బోరుబావుల వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చి ప్రతీ సీజన్‌లో ముందస్తు సాగు చేస్తున్నా రు. దీంతో వరి విస్తీర్ణం పెరిగింది. వానాకాలం సీజన్‌లో సాగర్‌ ఆయకట్టులో 4.60లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుత యాసంగిలోనూ అదేస్థాయిలో వరిసాగయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ సీజన్‌లో గతానికి భిన్నంగా సన్నరకాల వరి సాగుచేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. 


సన్నాల కొనుగోళ్లకు ప్రజాప్రతినిధుల భరోసా

ఆయకట్టు రైతులు వరి సాగుకు మొగ్గుచూపుతుండగా, దిగుబడుల కొనుగోలుకు ప్రజాప్రతినిధులు భరోసా ఇస్తున్నారు. ధాన్యం పరిశ్రమలు ఎక్కువగా ఆయకట్టు ప్రాంతాల్లో ఉండడంతో, మిల్లర్లు డిమాండ్‌ చేసే వరి సాగు చేయాలని సూచిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడలో రైతు అవగాహన సదస్సు నిర్వహించగా, రైతులు ప్రశ్నించడంతో సన్నరకాల వరిని సాగుచేస్తే కొనుగోలు చేయించే బాధ్యత తనదంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదేవిధంగా సాగర్‌, హుజూర్‌నగర్‌, కోదాడ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం భరోసా ఇచ్చారు.


ఆరుతడి నుంచి ఆయకట్టుకు మినహాయింపు ఇవ్వాలి : జి.రాజు, రైతు, వేములపల్లి

రాష్ట్ర ప్రభుత్వం వరి వద్దంటోంది. సాగర్‌ ఆయకట్టు భూముల్లో ఆరుతడి పంటల సాగు కుదరదు. ఇక్కడి భూములు జాలుపట్టేవి, తేలికపాటివి. ఈ భూము లు నీటి ఆధారిత వరిసాగుకే అనుకూలం. అంతేగాక ఇక్కడి రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన లేదు. దశాబ్దాల తరబడి ధాన్యం పరిశ్రమలు ఆయకట్టు భూములపైనే ఆధారపడ్డాయి. ఆరుతడి పంటల నుంచి సాగర్‌ ఆయకట్టుకు మినహాయింపు ఇవ్వాలి.ఆరుతడిపై వ్యవసాయశాఖ ప్రచారం

నల్లగొండ: యాసంగిలో వరి సాగు విషయంలో సంది గ్ధం వీడకపోగా, ఆరుతడి పంటల పై వ్యవసాయశాఖ ప్రచారం ప్రారంభించింది. వరిసాగు వద్దని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకున్నా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన వ్యవసాయశాఖ అధికారుల సమావేశంలో రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయం నుంచి పరోక్షంగా సంకేతాలు అందాయి. కాగా, ఈ నెల 22 నుంచి యాసంగి సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బలమైన కార్తెలకు అనుగుణంగా ఈ నెలలోనే వరి నారుమడులు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.


ఆరుతడి పంటల ప్రణాళిక ఇలా..

ఉమ్మడి జిల్లాలోని ఆరుతడి పంటల అనువైన సమయా ల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 30 వరకు వేరుశనగ విత్తవచ్చు. విత్తన రకాన్ని బట్టి ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. జనవరి నెల 15 నుంచి ఫిబ్రవరి 15 వర కు నువ్వులు సాగుచేయవచ్చు. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేస్తే 2.5క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇప్పటి నుంచి డిసెంబరు 10వరకు పెసర సాగుచేయవచ్చు. ఎకరానికి 12-14 కిలోల విత్తనాలు అవసరముంటాయి. దిగుబడి నాలుగు క్వింటాళ్ల వరకు వస్తుంది. మినుములు ఇప్పటి నుంచి డిసెంబరు 10వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి ఐదు క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. డిసెంబరు 31వ తేదీ వరకు జొన్న విత్తనాలు విత్తవచ్చు. ఎకరానికి 12క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. పొద్దుతిరుగుడు కూడా ఆరుతడి పంటగా సాగుచేయవచ్చని రైతులకు వ్యవసాయశాఖ సూచిస్తోంది. వీటితోపాటు పప్పు దినుసులు, పెసర, మొక్కజొన్న, అలసంద, రాగులు, ఆముదాలు, కూరగాయలు, కుసుమ, ఉల్వలు సాగుచేయాలని వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.


 రైతులను చైతన్య పరుస్తున్నాం : కె.నూతన్‌కుమార్‌, ఏడీఏ, నల్లగొండ 

యాసంగి సీజన్‌లో వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేయాలని రైతులను చైతన్యపరుస్తున్నాం. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయశాఖ బృందాలు పర్యటిస్తున్నాయి. రైతులు ఆరుతడి పంటలు సాగుచేస్తే అధిక లాభాలు పొందే అవకాశాలున్నాయి. విత్తనాలు కూడా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశాం.

Advertisement
Advertisement