వామపక్షాల నిరసనలు

ABN , First Publish Date - 2021-06-19T05:13:55+05:30 IST

ప్రజలపై భారాలు వేస్తున్న బాధ్యత లేని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ.గఫూర్‌ పిలుపునిచ్చారు.

వామపక్షాల నిరసనలు
కర్నూలులో మాట్లాడుతున్న ఎంఏ గఫూర్‌

కర్నూలు(న్యూసిటీ), జూన్‌ 18: ప్రజలపై భారాలు వేస్తున్న బాధ్యత లేని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ.గఫూర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట పాతబస్తీ కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా గఫూర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై రోజు వారిగా భారాలు పెంచుతున్నాయని విమర్శించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.9, డీజిల్‌పై రూ.14 పన్ను తగ్గించిందన్నారు. అదే పని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం పన్ను పెంచినప్పుడల్లా వ్యాట్‌ రూపంలో రాష్ట్రం సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.రామాంజనేయులు మాట్లాడుతూ దేశచరిత్రలో ఎప్పుడూచూడనంతగా ఒకే నెలలో 22 సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయని అన్నారు. ఒకవైపు ధరలు పెంచుతూ మరోవైపు దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతు న్నారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.గౌస్‌దేశాయ్‌, సుభాన్‌, విజయ్‌, మనోహర్‌మాణిక్యం, శ్రీరాములు పాల్గొన్నారు. 


 పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలను తగ్గించాలంటూ కొండారెడ్డి బురుజు వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్‌, మహ్మద్‌షరీఫ్‌, అబ్దుల్‌దేశాయ్‌ తదితరులు ఆటోకు తాడికట్టు లాగారు. 


డోన్‌(రూరల్‌): పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, సీపీఎం మండల కార్యదర్శి శివరాం డిమాండ్‌ చేశారు. సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక గుత్తి రోడ్డులో ఆందోళన చేపట్టారు. సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు నక్కి శ్రీకాంత్‌, ప్రభాకర్‌, హసీనా, లక్ష్మీనారాయణ, అబ్బాస్‌, అన్వర్‌, శివన్న, సుధాకర్‌, సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు లక్ష్మన్న, కిట్టు, నారాయణ, నూర్‌బాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


పత్తికొండటౌన్‌: ప్రజల సంక్షేమాన్ని మరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పతనం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య హెచ్చరించారు. పెంచిన పెట్రో, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలను తగ్గించాలని పత్తికొండలో అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఎర్రజెండాలను చేతభూని పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగుస్తంభాల కూడలిలో ధర్నా చేపట్టారు.  సీపీఐ, సీపీఎం నాయకులు రాజాసాహెబ్‌, సురేంద్ర, గురుదాసు, రంగారెడ్డి, ఈరన్న, కారన్న, రంగన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T05:13:55+05:30 IST