కొత్త కేసులు 50 వేల లోపే

ABN , First Publish Date - 2020-10-21T08:56:21+05:30 IST

దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 46,790 మందికి వైరస్‌ సోకిందని, 587 మంది మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కొత్త కేసులు 50 వేల లోపే

తాజాగా 46,790 మందికి పాజిటివ్‌

మరో 587 మంది మృతి

ఏపీలోని 5 జిల్లాల్లో వైరస్‌ ఉధృతి


న్యూఢిల్లీ, అక్టోబరు 20: దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 46,790 మందికి వైరస్‌ సోకిందని, 587 మంది మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూలై 23న దేశంలో 45,720 కేసులు వచ్చాయి. జూలై 28న 47,700, అదే నెల 31న మొదటిసారి 50 వేల మార్క్‌ను దాటాయి.  ఆ తర్వాత 50 వేలలోపు నమోదు కావడం ఇదే తొలిసారి.


వైరస్‌ నుంచి మరో 69,720 మంది కోలుకోవడంతో యాక్టివ్‌ కేసులు 7.4848 లక్షలకు తగ్గాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 10 శాతం లోపునకు వచ్చాయి. 64 శాతం యాక్టివ్‌ కేసులు ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్రం వివరించింది. ఈ రాష్ట్రాల్లో వైరస్‌ ఉధృతి అధికంగా ఉన్న టాప్‌ -5 జిల్లాల (మొత్తం 30) జాబితాను విడుదల చేసింది. మహారాష్ట్రలోని ముంబై, పుణె, ఠాణె, నాగపూర్‌, అహ్మద్‌నగర్‌, కర్ణాటకలో బెంగళూరు అర్బన్‌, మైసూర్‌, తుమకూరు, హసన్‌, దక్షిణ కన్నడ, కేరళలోని ఎర్నాకుళం, కొజిక్కోడ్‌, మళప్పురం, తిరువనంతపురం, త్రిస్సూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి.


 గత వారం రోజుల నుంచి పది లక్షల జనాభాకు దేశంలో 310 కేసులు మాత్రమే నమోదయ్యాయని.. ఇది ప్రపంచంలోనే అతి తక్కువని పేర్కొంది. మరోవైపు దేశంలో గత 10 నెలల నుంచి ఆక్సిజన్‌ నిల్వలకు ఏమాత్రం లోటు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. సెప్టెంబరు నాటికే రోజువారీ ఉత్పత్తి 6,862 టన్నులకు చేరిందని, ఈ నెలతో అది 7,191 టన్నులు అయిందని పేర్కొన్నారు. 18 రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతున్నామన్నారు.  


బెయిల్‌, పెరోల్‌ పొడిగింపులొద్దు: ఢిల్లీ హైకోర్టు

దేశంలో కొవిడ్‌ అధ్యాయం ముగిసిందని, ఇక ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నాటి పరిస్థితులకు మళ్లాల్సి ఉందని, అందుచేత బెయిల్స్‌, పెరోల్స్‌లను అదేపనిగా పొడిగించడం మానుకోవాల్సిన సమయమొచ్చిందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ’ఇక నేరస్థులందరూ జైళ్లకు పోవాల్సిన టైమొచ్చింది. కొవిడ్‌ ఉధృతి కారణంగా చిన్న చిన్న నేరాలు, విచారణలో ఉన్న ప్రమాదకరం కాని ఖైదీలను విడుదల చేయాలని కొద్ది నెలల కిందట ఆదేశించాం. కిక్కిరిసిన జైళ్లతో మాకు సంబంధం లేదు. పెరుగుతున్న నేరాలపైనే మా ఆందోళనంతా’ అని చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-21T08:56:21+05:30 IST