‘అమ్మఒడి’కి.. హాజరు బెంగ

ABN , First Publish Date - 2021-09-13T04:22:27+05:30 IST

‘అమ్మఒడి’కి.. హాజరు బెంగ

‘అమ్మఒడి’కి.. హాజరు బెంగ
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు

- ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో పాఠాలు

- ప్రభుత్వ బడులకూ 60 శాతమే విద్యార్థులు

- హాజరు తక్కువైతే లబ్ధి దక్కదంటున్న అధికారులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 70శాతం కంటే తక్కువ హాజరుంటే.. ‘అమ్మఒడి’ పథకం కింద డబ్బులు జమ కావంటూ అధికారులు నిబంధన పెట్టారు. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలన్నీ తెరిచినా.... విద్యార్థుల సంఖ్య 50 నుంచి 60 శాతమే ఉంటోంది. ప్రైవేటు పాఠశాలలు చాలావరకూ ఆన్‌లైన్‌లోనే తరగతులు కొనసాగిస్తున్నాయి. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలు యాప్‌లో నమోదు చేయాలంటూ ‘ప్రైవేటు’ యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఆన్‌లైన్‌లో తరగతులకు వచ్చే విద్యార్థులకు హాజరు వేయాలా? లేదా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఎక్కువమంది తల్లిదండ్రులు ఈ ఏడాది తమకు ‘అమ్మఒడి’ డబ్బులు వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నారు. 

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 4.89 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో మూడున్నర లక్షల మందికి పైగా విద్యార్థులు  ‘అమ్మఒడి’ పథకానికి అర్హులు. జిల్లాలో 3,828 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 3,77,592 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు తెరిచినా విద్యార్థులు పూర్తిస్థాయిలో రావడం లేదు. దీనికి తోడు ప్రతిరోజు ఏదో ఒక పాఠశాలలో కరోనా పాజిటివ్‌ కేసులు వస్తుండడంతో మిగతా వారిలో ఆందోళన నెలకొంటోంది. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభంలో.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌  ఏదో ఒకటి కొనసాగించవచ్చని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత తప్పనిసరిగా పాఠశాలలకు రావాల్సిందేనని మౌఖికంగా సూచించారు. కానీ.. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రైవేటు పాఠశాలల యాజామాన్యాలు సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లలను పాఠశాలకు పంపించే విషయంలో అభిప్రాయాలు తీసుకుంటున్నాయి. చాలా పాఠశాలల్లో 70 శాతం మందికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. పాఠశాలలకు భౌతికంగా హాజరయ్యే విద్యార్థులు ఎవరూ లేరంటూ యాప్‌లో నిత్యం నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం పాఠశాలలకు వచ్చిన వారే హాజరైనట్టా?.. లేక ఆన్‌లైన్‌లో వచ్చినా ఫర్వాలేదా? అనే విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులకూ స్పష్టత లేదు. దీంతో ఏటా అమ్మఒడి కింద వచ్చే రూ.15వేలు జమవుతాయో లేదోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలను దీనిపై అడగ్గా.. తమకు ఏ విషయం తెలియదని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి పాఠశాలల నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. 


ప్రారంభం నుంచే హాజరు లెక్కింపు

ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించినప్పటి నుంచే పని చేసిన రోజులకు సంబంధించి హాజరు శాతం లెక్కిస్తారు. కనుక 70 శాతం హాజరు ఎక్కువ మంది విద్యార్థులు సాధించే అవకాశం ఉంది. ఎక్కడైనా సమస్య ఉంటే.. అక్కడ విద్యార్థులు ‘అమ్మఒడి’ని కోల్పోతారు. 

- కె.వాసుదేవరావు, డెప్యూటీ డీఈవో, టెక్కలి 

 

Updated Date - 2021-09-13T04:22:27+05:30 IST