తాగునీటి సమస్యను తరిమేద్దాం

ABN , First Publish Date - 2020-05-29T10:28:06+05:30 IST

సమష్టి కృషితో తాగునీటి సమస్యను శాశ్వతంగా తరిమేద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మిషన్‌

తాగునీటి సమస్యను తరిమేద్దాం

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, మే 28 : సమష్టి కృషితో తాగునీటి సమస్యను శాశ్వతంగా తరిమేద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మిషన్‌ భగీరథ అధికారులతో అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు సమీపంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం ఆ శాఖ జిల్లా అధికారులు, ఇంజనీర్లతో కలిసి మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి ఏ గ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ తాగునీటికి అత్యంత ప్రాధాన్యమిచ్చి మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించారని వివరించారు.


ప్రతి ఆడబిడ్డ నీటి బిందె పట్టుకుని కోసం కడప దాటి రావొద్దన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని చెప్పారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారా ప్రతి మనిషికీ 100 లీటర్లు స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి నిత్యం, సమయానికి ఇవ్వాలన్నదే లక్ష్యమని తెలిపారు. ప్రతీ ఆదివారం ఏఈలు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, లాంగ్‌షీట్‌ పంపిన తర్వాత పైఅధికారులను ఫీల్డ్‌ పైకి పంపాలని సూచించారు. జిల్లా, డివిజన్‌ స్థాయిలో ఈఈలు లాంగ్‌ షీట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 27 వేల గ్రామాల్లో, మున్సిపాలిటీ పరిధిలో ప్రతీ మంగళవారం లాంగ్‌షీట్‌ల నివేదికలు ఈఎన్సీ కార్యాలయానికి అందేలా చర్యలు చేపట్టినట్లు ఈఎన్సీ కృపాకర్‌ మంత్రి హరీశ్‌రావుకు వివరించారు.


రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ పథకంలో ఆరెంజ్‌, గ్రీన్‌, రెడ్‌ జోన్లుగా ఏర్పాటు చేసినట్లు, ఈ జోన్లలో రాష్ట్రం మొత్తం 3 వేల గ్రామాలకు నీళ్లు వెళ్లలేదని ఫిర్యాదులు అందాయని, వాటిలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలూ ఉన్నాయని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొన్ని గ్రామాలకు 7 రోజులు నీళ్లు వెళ్లలేదని అధికారులు తెలపగా పునరావృతం కాకుండా, 24 గంటల్లోనే ఎక్కడైనా లీకేజీలు ఉంటే అరికట్టాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, ఫారూఖ్‌హుస్సేన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T10:28:06+05:30 IST