లైఫ్ ఆఫ్టర్ కరోనా: సరికొత్త బాటలో ప్రాథమిక విద్య

ABN , First Publish Date - 2020-05-23T18:56:45+05:30 IST

కరోనా వైరస్‌ ఈ ప్రపంచానికి అనేక కొత్త పాఠాలు నేర్పుతోంది. ముఖ్యంగా విద్యారంగంలో పెనుమార్పులకి నాంది పలకబోతోంది.

లైఫ్ ఆఫ్టర్ కరోనా: సరికొత్త బాటలో ప్రాథమిక విద్య

కరోనా వైరస్‌ ఈ ప్రపంచానికి అనేక కొత్త పాఠాలు నేర్పుతోంది. ముఖ్యంగా విద్యారంగంలో పెనుమార్పులకి నాంది పలకబోతోంది. ఇకపై క్లాస్‌ రూమ్‌ల రూపురేఖలే మారనున్నాయి. టీచర్లు, పిల్లల మధ్య కూడా సోషల్‌ డిస్టెన్స్‌ పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల నిర్వహణ తీరు ఎలా ఉంటే మంచిది? బడిపిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సేవ్‌ ద చిల్డ్రన్‌ అనే సంస్థ ఎలాంటి సూచనలు అందిస్తోంది? అన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 


బడి అనగానే గుర్తుకువచ్చేది పసిపిల్లలే. పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెడితే కనిపించేది చిన్నారుల సందడే. బాలబాలికల మనోవికాసానికి బీజం పడేది అక్కడే. వారి చదువుసంధ్యలకు, ఆటపాటలకు విడిది కూడా అదే. అలాంటి స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పుడు మూతపడి ఉన్నాయి. దీనికి కారణం కరోనా వైరస్‌. బడి గేటు బంద్‌ కావడంతో దేశవ్యాప్తంగా చిన్నారులంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఫలితంగా సహజసిద్ధమైన వారి చురుకుదనం కొంతమేర తగ్గింది.


ప్రభుత్వ బడుల్లో ఒకటో క్లాస్‌ నుంచే చదువు మొదలవుతుంది. అయిదవ యేటనే తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూలుకి పంపుతారు. అదే ప్రైవేట్‌ స్కూళ్లలో అయితే పరిస్థితి వేరు. అక్కడ ప్లేస్కూల్‌, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అంటూ మూడేళ్ల నిండని పిల్లల్ని కూడా చేర్చుకుంటారు. ఇటీవల మన దేశంలో ఈ కల్చర్‌ బాగానే వర్ధిల్లుతోంది. నిరుపేద, సామాన్య ప్రజానీకం తమ పిల్లల్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ బడుల్లో చదివిస్తారు. కొంచెం స్థోమత కలిగినవారితోపాటు ధనవంతుల పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లకే వెళతారు. ఈ వ్యత్యాసాల సంగతిని అటుంచితే.. వచ్చే రోజుల్లో ప్రైమరీ విద్యారంగంలో అనేక మార్పులు చోటుచేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 


నిజానికి, చిన్నపిల్లలు ఎంతో కలివిడిగా ఉంటారు. చెట్టాపట్టాలు వేసుకుని ఆటలాడుకుంటారు. తరగతి గదుల్లో దగ్గరదగ్గరగా కూర్చుంటారు. నిన్నటివరకూ ఇవన్నీ మనకి ఎంతో సహజసిద్ధమైన సన్నివేశాలు. కానీ కరోనా ప్రమాద ఘంటికలు మోగిన తర్వాత పాఠశాలల నిర్వాహకులతోపాటు పిల్లల తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైన ఆందోళన పెరిగింది. భౌతిక దూరం, ఆరోగ్య జాగ్రత్తలు వంటివి పాటించడం పెద్దవాళ్లకు సులువే గానీ.. పిల్లల విషయంలో ఇది అంత తేలిక కాదు. ఆ బాధ్యత వారి సంరక్షకులుగా ఉండే పేరెంట్స్‌తోపాటు ఆయా పాఠశాలల నిర్వాహకులపైనే ఎక్కువగా ఉంటుంది. 


ఇకపై తరగతి గదుల్లో పిల్లల్ని మునుపటిలా బెంచీలపై పక్కపక్కనే కూర్చోబెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఒక్కో తరగతిలో విద్యార్థుల సంఖ్యని బట్టి సెక్షన్లుగా విభజించే పద్ధతిని ప్రవేశపెట్టొచ్చు. ప్రాథమిక స్థాయిలోనూ ఆన్‌లైన్‌ పాఠ్యబోధన మొదలుకావచ్చు. దీనితోపాటు ఆరోగ్యపరమైన అనేక అంశాల్లో జాగ్రత్తలు చేపట్టవచ్చు. వచ్చే రోజుల్లో ఇటువంటి ప్రమాణాలు పాటించే స్కూళ్లకే ఆదరణ ఎక్కువగా ఉంటుందని విద్యారంగ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. 


భవిష్యత్తులో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను కొవిడ్‌ రహితంగా తీర్చిదిద్దుకోవాలి. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలి. ఆయా పాఠశాలల్లో సమర్థ యాజయాన్యం, పరిశుభ్రమైన పరిసరాలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ, కరికులమ్‌లో నిబద్దత, క్రీడలు, వ్యాయామాలకు పెద్దపీట వేయడం, పౌష్టికాహారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా కొవిడ్‌ వంటి ప్రమాదకర పరిస్థితులను అధిగమించడం కోసం ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులను చైతన్యపరచాలి. సేవ్‌ ద చిల్డ్రన్ అనే సంస్థ ఇప్పటికే దీనిపై ఒక విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రకటించింది. అందులోని మార్గదర్శకాలు అనుసరించే విధానంపై ప్రత్యేక వెబినార్లు, వాట్సప్‌ గ్రూపుల ద్వారా అవగాహనా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపడుతోంది.


అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటోంది. విద్యార్థులకు కనీస సదుపాయాలు ఉండటం లేదు. తరగతి గదులు ఇరుకుగా ఉంటున్నాయి. పారిశుద్ధ్య చర్యలు శూన్యం. మంచినీటి వసతి అసలే ఉండదు. మరుగుదొడ్లు అద్వాన్నంగా ఉంటాయి. వాటిలో నీళ్లుండవు. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల పరిశుభ్రతపై ఎలాంటి అవగాహన ఉండదు. ఈ స్థితిలో భౌతికదూరం, చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడం వంటి చర్యలకు ఆస్కారమెక్కడ? అందుకే సేవ్‌ ద చిల్ట్రన్‌ నిపుణులు కొన్ని విలువైన సూచనలు చేస్తున్నారు. పాఠశాల ఉండే గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని స్థానిక యాజమాన్యం, తల్లిదండ్రులు, పిల్లలు ఉమ్మడిగా ఒక ప్రణాళికను రూపొందించుకొని ఆయా సమస్యలను అధిగమించడానికి కృషిచేయాలని చెప్తున్నారు. చిన్నారుల శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి చర్యలు అత్యవసరం కూడా! 


కరోనా విజృంభణ తర్వాత కొన్ని బడులు, అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రాలుగా, గోడౌన్లుగా వినియోగించినట్టు వార్తలొచ్చాయి. వాటితోపాటు అన్ని ప్రైమరీ పాఠశాలలను రసాయన ప్రక్రియతో శుద్ధిచేయాలి. ఎందుకంటే బడులు తెరిచే తరుణం ఆసన్నం కాబోతోంది. అలాగే అన్ని విద్యాకేంద్రాల్లో శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు వంటివి సరిపడిన మోతాదులో విద్యాశాఖ అధికారులు సమకూర్చాలి. ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలను షిఫ్ట్‌ పద్ధతిలో నిర్వహించడం ఉత్తమం. ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌లు అవసరమని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం పాఠశాల పరిధిలోగానీ లేదా క్లస్టర్‌ స్థాయిలో గానీ కౌన్సిలర్లను కూడా నియమించాలని సూచిస్తున్నారు.


జూన్‌ తర్వాత వాతావరణంలో మార్పులొస్తాయి. వర్షాలు కురుస్తాయి. ఈ గాలి మార్పువల్ల ప్రైమరీ విద్యార్థులు త్వరగా అస్వస్థులయ్యే అవకాశముంది. పైగా.. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్‌ త్వరగా వ్యాపిస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్ల పిల్లల్లో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే ఆయా పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తం కావాలి. అంతకంటే ముందు.. అంటే, స్కూళ్లు రీఓపెన్‌ చేసే ముందే ఉపాధ్యాయులకు, పిల్లలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలన్న విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. వనరుల అందుబాటుని బట్టి ప్రభుత్వ పెద్దలు దీనిపై నిర్ణయం తీసుకుంటే అందరికీ మంచిది!


అన్ని ప్రాథమిక పాఠశాలల్లో వాష్‌ ప్లాట్‌ఫామ్స్‌ నిర్మించి.. నీటి వసతి కల్పించాలి. కనీసం ఇరవై సెకండ్లపాటు చేతులు కడుక్కునేలా పిల్లలకు అలవాటు చేయాలి. ఈ అంశాలను శ్రద్ధగా గమనించేందుకు పాఠశాల స్థాయిలో వాష్‌ కమిటీలు ఏర్పాటుచేయాలి. కొందరు పిల్లలకు నీళ్లను చూస్తే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. నీటిని వృథాచేయడాన్ని ఆటగా భావిస్తారు. అలాంటి వారికి కూడా నీటి పొదుపుపై అవగాహన కూడా కల్పించాలి. ఇక్కడే వాష్‌ కమిటీల అవసరం ఎంతో ఉంటుంది. 


పిల్లలకి మానసిక వికాసం ఎంత ముఖ్యమో భౌతిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందువల్ల కరోనా అనంతర కాలంలో అన్ని పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకి వ్యాయామం అనేది తప్పనిసరి అంశంగా చేయాలని విద్యారంగ ప్రముఖులు గట్టిగా చెబుతున్నారు. కరోనా తర్వాత మరో జాగ్రత్తని కూడా వారు సూచిస్తున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వసతి ఉంటుంది.. అయితే ఇకపై పాఠశాల ప్రాంగణంలో భోజనం వండి వడ్డించేకంటే.. కొన్ని నెలలపాటు ఆయా పిల్లల కుటుంబాలకే డ్రై రేషన్‌ సమకూర్చడం మంచిదంటున్నారు. అలాగే పాఠశాల సమయంలో పిల్లలకు విటమిన్‌ బిస్కట్లు అందించాలన్న సూచనలు కూడా వస్తున్నాయి. ఫ్యూచర్‌ స్కూళ్లు ఇలాంటి ఎన్నో సవాళ్లను స్వీకరించాల్సి ఉంటుంది. ఆయా చర్యలను సమర్థంగా అమలుచేయగలవారే ఛాంపియన్లుగా వెలుగొందుతారు కూడా!


ప్రాథమిక స్థాయి విద్య సజావుగా సాగితే.. అక్కడినుంచి పిల్లల భవితవ్యం గాడిలో పడుతుంది. ప్రతి చిన్నారి జీవితంలోనూ ఇదే అత్యంత కీలక దశ. కుటుంబం నుంచి అందే సహకారంతోపాటు అవకాశాలు కలిసివస్తే.. కళాశాల వైపు, అక్కడి నుంచి యూనివర్సిటీల వైపు వారి నడక సాగుతుంది. ఈ క్రమంలో ప్రైమరీ విద్యాలయాలకి వచ్చే పిల్లల ఆరోగ్య పరిరక్షణ మనందరి బాధ్యత. ముఖ్యంగా ప్రభుత్వాల బాధ్యత. కరోనా విలయ తాండవం చేస్తున్న నేటి సందర్భంలో చంటివాళ్లను మన కంటిపాపల్లా రక్షించుకోవడం మన విధి!


ఇప్పటికే చిన్నారి జీవితాలపై కరోనా పరోక్ష ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా 154 కోట్లకు పైగా విద్యార్థులు కరోనా వల్ల నష్టపోతారని యునెస్కో అంచనా వేసింది. ముఖ్యంగా బాలికల డ్రాప్ అవుట్‌ రేటు పెరిగే అవకాశం ఉందట. కరోనా పీడ విరగడయ్యాక కూడా విద్యారంగంలో అస్థిరత కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అనేక విద్యాసంస్థలు మూతపడే ప్రమాదముందట. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు చైతన్యవంతులు కావాలి. ప్రైమరీ విద్యాసంస్థలను కాపాడుకునే చర్యలు చేపట్టాలి. కరోనా విషయంలో ఎంత అప్రమత్తత పాటిస్తున్నామో.. అదే స్థాయిలో పాఠశాలల పరిరక్షణకు కూడా శ్రద్ధవహించడం నేటి అవసరం! 


ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. కొత్త విద్యాసంవత్సరం నుంచే ప్రాథమిక పాఠశాలల నిర్వహణలో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇకపై ప్రతి విద్యాసంస్థా విద్యాబోధనతోపాటు విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకి కూడా ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. ఈ తరహా చర్యలు చేపట్టాల్సి రావడం భారంగా అనిపించినా.. వచ్చేరోజుల్లో తప్పక మంచి ఫలితాలు ఇస్తాయి. 

Updated Date - 2020-05-23T18:56:45+05:30 IST