Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరి రైతులపై పిడుగు

యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయం : కేసీఆర్‌

ఉమ్మడి జిల్లాలో 11 లక్షల ఎకరాల భవిత ప్రశ్నార్థకం

428 రైస్‌మిల్లులపై ప్రభావం

ఉమ్మడి జిల్లాలో లక్షలాది మందిపై ప్రభావం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : యాసంగిలో వరి సాగు చేద్దామనుకుం టున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేదు ప్రకటన వచ్చింది. ముఖ్యంగా ప్రపంచ ధాన్యపు గిన్నెగా పేరుగాంచిన నల్లగొండలోని రైతాంగానికి ఇది పిడుగు లాంటి సమాచారమే. యాసంగిలో వరి పండిస్తే కొనుగోలు చేసేది లేదంటూ సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పేశారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్న లక్షలాది రైతు కుటుంబాల పరిస్థితి ఏంటన్నది అంతుపట్టని పరిస్థితి. సీఎం తాజా ప్రకటనతో రైస్‌మిల్లుల అంటే గురుకొచ్చే నల్లగొండ జిల్లాలో లక్షలాది మంది ఆధారపడిన పరిశ్రమ ఉనికి కూడా కోల్పోనుంది.  ఉమ్మడి జిల్లా ఆర్థిక వ్యవస్థ మొత్తం సీఎం కేసీఆర్‌ తాజా ప్రకటనతో అస్తవ్యస్తంగా మారనుంది. సన్నద్దత, ప్రత్యామ్నాయ పంటలకు ప్రో త్సాహం లేకుండా అకాల ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో రైతుల్లో, మిల్లర్లలో అయోమయ వాతావరణం నెలకొంది.


11 లక్షల ఎకరాల రైతుల భవిత ప్రశ్నార్థకం

ఓ వైపు నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా జలాలు, మరో వైపు కాళేశ్వరం నుంచి గోదావరి, ఇంకోదిక్కున మూసీ, చెరువుల పూడికతీత, వరుస వర్షాలతో పెరిగిన భూగర్భ జలాల, పొంగిపొర్లుతున్న బోర్ల మూలం గా ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా నీటి జాడలే కనిపిస్తున్నాయి. అందివచ్చిన నీటి లభ్యతతో వరి సాగును ముమ్మ రంగా చేపడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో వరి తప్ప మరో పంట పండని పరిస్థితి. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా రైతులు ముందు చూపుతో యాసంగిలో సన్నరకం సాగువైపు మళ్లారు. ఈ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖాధికారులు ఇప్పటికే అంచనాకు వచ్చారు. సుమారు 3 లక్షల ఎకరాల సాగుకు సంబంధించి రైతులు వరి నార్లు పోసుకున్నారు. ఆ మేరకు  పెట్టుబడులు పెట్టి పొలాలను సిద్ధం చేసుకున్నారు, నార్లు పోసుకొని, ఎరువులు ముందస్తుగా కొనుగోలు చేసుకున్నారు. గత ఏడాది యాసంగిలో 9 లక్షల మెట్రిక్‌  టన్నుల బియ్యాన్ని సీఎంఆర్‌ రూపంలో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం పెద్దన్న పాత్ర నుంచి తప్పుకుంటే మద్దతు ధర సాధ్యమేనా? అన్న సందేహాలు రైతుల్లో వ్యక్త మవుతున్నాయి. పోలీసులను కాపలా పెడితేనే గిట్టుబాటు ధర దక్కడం లేనప్పుడు ప్రభుత్వమే చెతులెత్తేస్తే ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు పెట్టుబడి డబ్బులైనా వస్తాయా? అన్న ప్రశ్న రైతును తొలుస్తోంది. ప్రభుత్వం పక్కకు తప్పుకుంటే మిల్లర్లు చెప్పిందే ధర, వారి మాటే శాసనం, కొనుగోలు చేయాలంటూ వారిని బతిమిలాడుకోవడమే తప్ప ఏం చేయలేని స్థితికి అన్నదాత వెళ్లడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.


ప్రమాదంలో రైస్‌ మిల్లులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 428 రైస్‌మిల్లులు ఉన్నాయి. ఇందులో 78 చిన్న స్థాయి(బిన్ని) రా రైస్‌ మిల్లుల ఉండగా 350 బడా మిల్లులు ఉన్నాయి. పెద్దమిల్లుల్లో 202 పాత టెక్నాలజీవి కాగా 148 అత్యాధునిక టెక్నాలజీతో పనిచేస్తున్నాయి. వీటిపై వ్యాపారులు, గుమస్తాలు, డ్రైవర్లు, హమాలీలు, కూలీలు, అనుబంధంగా సాల్వెంట్‌ ఆయిల్‌ మిల్స్‌, లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు ఇలా ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది కడుపు ఈ పరిశ్రమ నింపుతోంది. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు నుంచి పక్కకు తప్పుకుంటే మిల్లులకు ధాన్యం వచ్చేది ఎలా? ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించకపోతే అటు రైతు, ఇటు మిల్లర్‌ నష్టపోయే పరిస్థితి. కొనుగోలు స్థోమత ప్రభుత్వానికే లేనిపక్షంలో మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసి చెల్లింపులు చేసే స్థాయి ఏ మేరకు ఉంటుంది. రైతులకు సకాలంలో చెల్లింపులు జరుగుతాయా? జరగకపోతే? నష్టాలు వచ్చి వ్యాపారులు చేతులేత్తేస్తే ఆ తర్వాత పరిణామాలకు బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 


ఢిల్లీ తరహా ఉద్యమాలు చూపిస్తాం : జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్మి

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రకటన చాలా అన్యాయమైంది. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా ఢిల్లీ తరహాలో పార్టీలకు అతీతంగా రైతాంగ ఉద్యమాన్ని నిర్మిస్తాం. వరి పండించే భూముల్లో వేరే పంటలు పండవు. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించరు, ఆ పంటల సాగుకు ప్రోత్సాహం ఏంటో కేసీఆర్‌ చెప్పడు. వరి వేయకపోతే రైస్‌మిల్లులు మూత పడి లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు. బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతాయి. సీఎం కొనకపోయినా మిల్లర్లు కొనుగోలు చేసి మిల్లింగ్‌ చేసుకొని ఓపెన్‌ మార్కెట్‌లో అమ్ముకుంటారు. దానికి ప్రభుత్వం మార్గదర్మకాలు, మద్దతు ఇవ్వాలి కదా. దానికి వరి వేయవద్దని సీఎం చెప్పేది ఏంటి? ఇది చాలా అన్యాయం, సీఎం కేసీఆర్‌ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. 


మార్కెట్‌ రేటు ప్రకారం ఖరీదు చేస్తాం : యాదగిరి, మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ

యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం చెప్పారు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి రైస్‌మిల్లుపై నేరుగా 500 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మిల్లులు నడవాలంటే 1010 రకం కాక మరే ధాన్యమైనా అంతర్జాతీయ మార్కెట్‌ ధర ఆధారంగా  కొనుగోలు చేస్తాం. రైస్‌మిల్లులు అన్నీ కొనుగోలు చేస్తా యి. 1010 రకాలకు పెట్టుబడి తక్కువ, రేటు తక్కువగా ఉంటుంది, బాయిల్డ్‌ మిల్లులు నడుపుతాం. సన్న ధాన్యం సాగులో పెట్టుబడి, రిస్క్‌ ఎక్కువ. సన్న ధాన్యం కూడా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుకు వెళ్తాయి. పోటీ ఎక్కువ ఉంటే మిల్లర్లు రేటు ఎక్కువ పెట్టి కొంటారు. రెండు రోజులుగా శ్రీరాం, చింట్లు 2300 వరకు కొనుగోలు చేశాం. మార్కెట్‌ డిమాండ్‌ సప్లమ్‌ ఆధారంగా కొనుగోలు చేసేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నారు. 


ప్రభుత్వం ధాన్యం కొనాల్సిందే : ఎన్‌.శ్రీనివాసరెడ్డి, రైతు, వేముల పల్లి

ధాన్యం కొనుగోలు ప్రక్రియ నుంచి ప్రభుత్వం వైదొలగడం రైతులకు శాపంగా మారుతుంది. పోలీస్‌, రెవెన్యూ, మార్కెటింగ్‌ అధి కారుల పర్యవేక్షణ ఉన్నప్పుడే మిల్లర్లు మద్దతు ధర ఇవ్వలేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడం సరికాదు. ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారుల వద్ద రైతులు సాగిల్ల పడాల్సిన దుస్థితి వస్తుంది. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లది పైచేయిగా మారి మద్దతు ధర ఇవ్వకపోగా ఇష్టానుసా రం కొనుగోలు చేయడంతో రైతులకు రాబడి తగ్గి భారం పెరుగుతుంది. ఫలితంగా ధాన్యం రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం లో ప్రభుత్వం పునరాలోచన చేసి కొనుగోలు ప్రక్రియను యథాతథంగా కొన సాగించడమే రైతాంగానికి శ్రేయస్కరం.


Advertisement
Advertisement