అరకొర నిధులు.. ఆలస్యంగా పనులు

ABN , First Publish Date - 2021-02-25T05:34:19+05:30 IST

మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలు మార్గం పనులు మరో దశాబ్ధమైనా పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు.

అరకొర నిధులు.. ఆలస్యంగా పనులు

 ముందుకు సాగని మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలు మార్గం 

 అంచనా వ్యయం 1,160 కోట్లు, కేటాయించింది 800 కోట్లు

 మార్గం నిడివి 151 కిలోమీటర్లు, ఐదేళ్లలో పూర్తయింది 32 కిలోమీటర్లు



(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలు మార్గం పనులు మరో దశాబ్ధమైనా పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు. అరకొర నిధుల కేటాయింపుతో పనులు నత్తనడకన సాగుతుండగా అంచనా వ్యయం మాత్రం ఏటేటా పెరుగుతూ పోతున్నది. 151 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలు మార్గం పనుల్లో ఐదేళ్లలో కేవలం 32 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తి కావడంతో మరో దశాబ్ధానికైనా పనులు పూర్తయ్యేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేంద్రం ఈ సంవత్సరం కూడా తన బడ్టెట్‌లో ఈ రైలు మార్గం పనులకు కేవలం రూ.235 కోట్ల నిధులు మాత్రమే కేటాయంచడంతో పనులు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. సికింద్రాబాద్‌-ఖాజీపేట రైల్వేలైన్‌కు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ కోసం నిధులు అంతంతమాత్రంగా కేటాయిస్తున్నారు.


2004 సంవత్సరంలో మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌ కోసం బీజం పడగా, 2016 సంవత్సరం ఆగస్టులో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మనోహరాబాద్‌ నుండి కొత్తపల్లి వరకు సిద్దిపేట, సిరిసిల్ల కొత్త జిల్లా కేంద్రాలను కలుపుతూ ప్రతిపాదించిన రైల్వేలైన్‌ 151.36 కిలోమీటర్ల మేర లైన్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. 1160.47 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులను ప్రారంభించారు.


హైదరాబాద్‌ సమీపంలోని మనోహరాబాద్‌ నుండి కొత్తపల్లి లైన్‌ పనులు మూడు దశల్లో పూర్తి చేయాల్సి ఉంది. మొదటి దశలో మనోహరాబాద్‌ గజ్వేల్‌ వరకు పనులు పూర్తి కావస్తున్నాయి. రెండవ దశలో మనోహరాబాద్‌-గజ్వేల్‌ వరకు 32 కిలోమీటర్ల మేర లైన్‌పనులు 2017-18 సంవత్సరంలో పూర్తి కావాల్సి ఉండగా ఈ సంవత్సరం పూర్తి కావస్తున్నాయి. రెండవ దశలో గజ్వేల్‌ నుండి సిద్దిపేట భూసేకరణ పనులు పూర్తయ్యాయి. మూడవ దశలో సిద్దిపేట నుండి సిరిసిల్ల వరకు, నాల్గవ దశలో సిరిసిల్ల నుండి కొత్తపల్లి వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది.


అరకొరగా బడ్జెట్‌ కేటాయింపులు


2006 సంవత్సరంలో పది కోట్ల రూపాయల కేటాయింపులతో మొదలైన రైల్వేలైన్‌కు అరకొరగానే బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ 1160.47 కోట్ల అంచనా వ్యయం కానుండగా, 2017-18 సంవత్సరంలో 350 కోట్లు, 2018-19 సంవత్సరంలో 150 కోట్లు, 2019-20 సంవత్సరంలో 200 కోట్లు, 2020-2021 సంవత్సరంలో 235 కోట్ల రూపాయలు కేటాయించారు. 2020-21 సంవత్సరానికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అవసరమైన మేర నిధులు కేటాయించక పోవడంతో పనులు నామమాత్రంగా సాగుతున్నాయి. అంచనా వ్యయం రోజు రోజుకు పెరుగుతుండడం లైన్‌  నిర్మాణ పనులకు అటంకాలు ఏర్పడుతున్నాయి.




కొత్త రైల్వేలైన్‌లో 13 స్టేషన్లు


మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌ మధ్యలో 13 రైల్వేస్టేషన్లు నిర్మించనున్నారు. నాచారం, ఇరన్నగరం, గజ్వేల్‌, కొడకండ్ల, లక్డారం, దుద్దెడ, సిద్దిపేట, గుర్రాలగొంది, చిన్నలింగాపూర్‌, సిరిసిల్ల, వేములవాడ, బోయిన్‌పల్లి, వెదిర గ్రామాల్లో కొత్తగా రైల్వే స్టేషన్లు నిర్మాణం కానున్నాయి. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌ నిర్మాణంతో కొత్తగా ఈ 13 గ్రామాలతో పాటు, చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజల చిరకాల వాంఛ రైలు కూతను విననున్నారు.  


రాజమండ్రి తరహాలో వంతెన


మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌ మధ్యలో సిరిసిల్ల వద్ద మిడ్‌మానేరు డ్యాం వద్ద రాజమండ్రి తరహా బ్రిడ్జి నిర్మించనున్నారు. నాలుగు జిల్లాల్లో రెండువందలకుపైగా వంతెనలు నిర్మించనున్నారు. 29 పెద్ద వంతెనలు నిర్మించనుంగా, 187 చిన్న వంతెనలు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు. రైల్వేలైన్‌ నిర్మాణంతో రహదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల రాకపోకలకు అంతరాయాలు లేకుండా వంతెనల నిర్మాణాలకు రూపకల్పన చేశారు.


మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం నాలుగు సంవత్సరాల్లో 2020-21 సంవత్సరంలో పూర్తి కావాల్సి ఉండగా 25 శాతం పనులు కూడా కాలేదు. అప్పటి అంచనాల ప్రకారం నిధులు కేటాయించినా, అవి ఏ మూలకు సరిపోవడం లేదు. ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ రైల్వే లైన్‌ నిర్మాణానికి నాయకులు దృష్టి సారించి అధిక మొత్తంలో ప్రత్యేక నిధులు కేటాయించి రైల్వేలైన్‌ను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-02-25T05:34:19+05:30 IST