కర్ఫ్యూ మాటున మద్యం దందా

ABN , First Publish Date - 2021-05-08T07:38:24+05:30 IST

కూలి పనులు చేసుకొనే బడుగులు వేకువనే పొలాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరే సరికి మందు షాపులు మూసివేస్తున్నారు.

కర్ఫ్యూ మాటున మద్యం దందా
మద్యం షాపు

వాడవాడలా బెల్టు షాపులు 

చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌ అధికారులు

పర్చూరు, మే 7 : కర్ఫ్యూ మాటున మద్యం దళారులు ఇష్టానుసారంగా దండుకుంటున్నారు. కూలి పనులు చేసుకొనే బడుగులు వేకువనే పొలాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరే సరికి మందు షాపులు మూసివేస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని మద్యం దళారులు ఇష్టానుసారంగా ధరలను పెంచి సందుల్లో, గొందుల్లో, కూడళ్లలో అమ్ముతున్నారు. క్వార్టర్‌ బాటిల్‌పై ఉన్న అసలు ధరకు మరో వంద పెంచి మరీ విక్రయిస్తూ దోచుకుంటున్నారు. పర్చూరు పరిసర ప్రాంతంలో మద్యం అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నా అరికట్టాల్సిన ఎస్‌ఈబీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

చీకటి మాటున వ్యాపారాలు

సాయంత్రం 6 దాటితే చాలు ప్రధాన రహదారుల కూడళ్లలో మద్యం దళారులు యథేచ్ఛగా అమ్ముతున్నారు. ప్రస్తుతం పర్చూరు ప్రాంతంలో ఈ తరహా విక్రయాలు కుటీర పరిశ్రమను తలపిస్తున్నాయి. మద్యం విక్రయాల కోసం యువకులకు కాసులు ఎరచూపి వారిని అడ్డాగా చేసుకుని సాగిస్తున్నారు. 

టీదుకాణాల్లోనూ  మద్యం విక్రయాలు

లాక్‌డౌన్‌ను అదునుగా చేసుకుని కొంత మంది టీదుకాణాల మాటున మద్యం విక్రయిస్తున్నారు. సాక్షాత్తు బొమ్మల సెంటర్‌కు కూతవేటు దూరంలో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం గమనార్హం. అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతోందని పలువురు అంటున్నారు. 

దళారులకు సహకరిస్తున్న సేల్స్‌మెన్లు, సూపర్‌వైజర్లు

కొంత మంది ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సేల్స్‌మెన్లు, సూపర్‌వైజర్లు మద్యం దళారులకు సహకారం అందిస్తున్నారు. దళారుల వద్ద నుంచి అందే కాసులకు కక్కుర్తి పడి కేసుకు కేసుల మద్యాన్ని కర్ఫ్యూ సమయానికి ముందే తమ అడ్డాలకు చేరుస్తున్నారు. 

పేరుకే కర్ఫ్యూ

కరోనా కట్టడి నిమిత్తం ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత జనసంచారం ఉండకూడదన్న నిబంధనలు ఉన్నా అమలుకు నోచుకోవటం లేదు. రాత్రి సమయాల్లో మద్యం విక్రమాలు ఆయా కూడళ్లలో జోరుగా సాగుతున్నాయి. ఎక్కడ చూచినా పదుల సంఖ్యలో మద్యం ప్రియులు దర్శనమిస్తున్నారు. కర్ఫ్యూ సమయంలోనైనా మద్యం అక్రమ విక్రయాలను అరికట్టకపోవటం విచారకరం.  

పెరిగిన బెల్ట్‌ దుకాణాలు

గ్రామాల్లో ఏమూల చూసినా బెల్ట్‌షాపులే దర్శనమిస్తున్నాయి. సాయంత్రం కల్లా ఆయా గ్రామాలలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో గ్రామంలో గుట్టుమాటున ఒకటో రెండో ఉన్న దుకాణాలు నేడు పదుల సంఖ్యలో నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

నామమాత్రపు కేసులతో సరి

తనిఖీల సమయంలో ఎవరైనా పట్టుపడితే అందినకాడికి వసూలు చేసి నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో భారీస్థాయిలో అక్రమ మద్యం విక్రయించి పట్టుబడిన వారు సైతం తిరిగి విక్రయాలు చేస్తున్నారంటే అధికారుల అండదండలు ఏమేరకు ఉన్నాయో ఇట్టే అర్థం అవుతుంది. పర్చూరుతోపాటు చెరుకూరు, బోడవాడ, నూతలపాడు, దేరలపల్లి, ఉప్పుటూరు తదితర గ్రామాల్లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 

గ్రామాల్లో యథేచ్ఛగా మద్యం

ముండ్లమూరు : మండలంలోని దాదాపు ప్రతి గ్రామంలో బెల్టుషాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. కరోనా  ఉధృతం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మినీ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వైన్‌ షాపులు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు తెరుస్తున్నారు. సాధారణ రోజుల కంటే ప్రస్తుతం ప్రతి గ్రామంలో  బెల్టు షాపుల నిర్వాహకుల పంట పండింది. మద్యం షాపుల్లో పనిచేసే సూపర్‌వైజర్‌, సేల్స్‌మేన్స్‌తో కుమ్మక్కై మద్యాన్ని కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్ముతున్నారు.  ఒక్కొక్క బెల్టు షాపు నిర్వాహకుడికి ఒకటి నుంచి మూడు కేసుల మద్యం వరకు అందజేస్తున్నట్లు సమాచారం.  

క్వార్టర్‌కు 20 వరకు మామూళ్లు

బెల్టు షాపు నిర్వాహకులు మద్యం షాపుల్లో పని చేసే సూపర్‌వైజర్‌, సేల్స్‌మేన్‌లకు క్వార్టర్‌ రూ.10 నుంచి రూ.20 అదనంగా ఇస్తూ వారిని ఆకట్టుకున్నారు. దీంతో వారు మద్యం అడిగినంత అమ్ముతున్నారు. మండలంలో పలు గ్రామాల్లో ఏ వీధిలో చూసినా ఒకటి నుంచి మూడు నాలుగు బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. పట్టించుకోవాల్సిన ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయారు. ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మినీ లాక్‌డౌన్‌ ముందు ఒక్కొక్క గ్రామంలో ఒకటి నుంచి మూడు నాలుగు బెల్టు షాపులు ఉండేవి. కరోనా వైరెస్‌ పుణ్యమా అంటూ ఒక్కొక్క గ్రామంలో పదికి పైగానే బెల్టు షాపులు వెలిశాయి. 

బెల్టు షాపుల నిర్వాహకులు రోజంతా యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. వీరు క్వార్టర్‌కు రూ.50 నుంచి రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా బెల్టు షాపులో మందు ఏరులై పారుతోంది. కొందరు బెల్టు షాపులు నిర్వాహకులకు స్థానికంగా రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ పోలీసులు బెల్టు షాపులపై దాడులు చేస్తుంటే క్షణాల్లో ఆ అధికారులకు ఫోన్‌లు రావటంతో చేసేది ఏమి లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుండి పోతున్నారు. నిత్య ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జరిగే విక్రయం కంటే బెల్ట్‌షాపులోనే ఎక్కువ విక్రయం జరుగుతుంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

Updated Date - 2021-05-08T07:38:24+05:30 IST