మత్తులో ముంచేందుకు...

ABN , First Publish Date - 2021-03-06T06:01:00+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను మద్యం మత్తులో ముంచేందుకు అధికార వైసీపీ సహా విపక్ష పార్టీలు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఆయా పురపాలక సంఘాల్లోని వార్డులకు మద్యం నిల్వలను రహస్యంగా తరలిస్తున్నారు.

మత్తులో ముంచేందుకు...
రంగాపురంలో స్వాధీనం చేసుకున్న బెల్లపు ఊట డ్రమ్ములు

  • ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యం, సారా సిద్ధం 
  • మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఇతర రాషా్ట్రల నుంచి మద్యం తెప్పిస్తున్న నేతలు
  • స్‌ఈబీ ప్రత్యేక అధికారుల బృందం దాడులు 
  • రంగాపురంలో సారా డంపులు స్వాధీనం 
  • రెండువేల లీటర్ల బెల్లపుఊట ధ్వంసం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను మద్యం మత్తులో ముంచేందుకు అధికార వైసీపీ సహా విపక్ష పార్టీలు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఆయా పురపాలక సంఘాల్లోని వార్డులకు మద్యం నిల్వలను రహస్యంగా తరలిస్తున్నారు. దీనికి తోడు కోనసీమలో పోలీసు, ఎక్సైజ్‌ అధికారుల కనుసన్నల్లోనే కుటీర పరిశ్రమగా సారా తయారీ, విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ఎస్‌ఈబీతో పాటు పోలీసు అధికారులు సారా, మద్యం అక్రమ అమ్మకాలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో సారా వ్యాపారం ఊపందుకుంటోందనేది ప్రధాన ఆరోపణ. శుక్రవారం అమలాపురం రూరల్‌ మండలం రంగాపురం పరిసర ప్రాంతాల్లో రహదారుల మధ్యలో మందుపాతర్ల తరహాలో బెల్లంఊట నిల్వలను స్వాధీనం చేసుకున్న కాకినాడకు చెందిన ఎస్‌ఈబీ అధికారులు నిశ్చేష్టులయ్యరు. ప్రజలు సంచరించే మట్టిరోడ్లమీదే ఒక దాని తర్వాత ఒకటి బెల్లంఊట డంపులను గుర్తించారు. ఈ నెల 10న జరిగే మునిసిపల్‌ ఎన్నికల కోసం కోనసీమలోని పలు కీలక ప్రాంతాల్లో సారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో భారీగా జరిగిన ఈ వ్యాపారంపై అప్పట్లో అధికారులు కూడా పెద్దగా స్పందించకపోవడంతో సారా తయారీదారులు పేట్రేగిపోతున్నారు. దీనికితోడు ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో సారా తయారీకి అధికారిక అనుమతులు ఇస్తున్నారన్న అభియోగాలున్నాయి. రంగా పురంలో సారా బట్టీలపై ఆ గ్రామస్తులు ఇటీవల కాకినాడ స్పెషల్‌ ఎనఫోర్స్‌మెంట్‌ బ్యూరోలోని ఉన్నతాధికారులకు చేసిన లిఖితపూర్వక ఫిర్యాదుపై ఎస్‌ఈబీ సీఐ జి.శ్రీనివాస్‌ స్పందించారు. ఆ ప్రాంతంలో దాడులు జరిపి 20 డ్రమ్ముల్లో సుమారు 2వేల లీటర్ల బెల్లంఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సీఐ శ్రీనివాస్‌ చెప్పారు. సారాతో పాటు వ్యక్తులను స్థానిక ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించారు. మరోవైపు ఇతర రాషా్ట్రల నుంచి మద్యం డంపులు భారీగా తరలుతున్నాయి. తెలంగాణ, మహరాష్ట్ర మద్యం సీసాలు కోనసీమలోని పలు ప్రాంతాల్లో తరచూ దర్శనమిస్తున్నాయని మద్యంప్రియులు చెప్తున్నారు. యానాం నుంచి కూడా రాజకీయ పార్టీల నాయకులు ముందస్తు వ్యూహంతో తరలిస్తున్నప్పటికీ పట్టించుకునే అధికారులే కరువయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-03-06T06:01:00+05:30 IST