ఆర్థిక సాయంలో ‘వైసీపీ మార్క్‌’

ABN , First Publish Date - 2020-04-05T10:16:21+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లల్లో ఉంటున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుండగా, వైసీపీ నాయకులు తమ మార్క్‌ను వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్థిక సాయంలో ‘వైసీపీ మార్క్‌’

 సర్కారు నిధులకు అధికార పార్టీ నాయకుల సొంత ప్రచారం

పట్టించుకోని అధికారులు


పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌ 4 : లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లల్లో ఉంటున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుండగా, వైసీపీ నాయకులు తమ మార్క్‌ను వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు కె.బాలకృష్ణ, 24వ వార్డు మాజీ కౌన్సిలర్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు మంత్రి రవికుమార్‌, ఆయా వార్డుల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు వార్డు వలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి నగదు పంపిణీ చేశారు. అలాగే 11వ వార్డులో వైసీపీ నాయకుడు తాడ్డి శంకరరావుతోపాటు పలు వార్డుల్లో ఆ పార్టీ నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. 


కమిషనర్‌కు ఫిర్యాదు 

వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ఆర్థిక సాయం పంపిణీ చేయడంపై టీడీపీ పట్టణ సీనియర్‌ నాయకుడు బార్నాల సీతారామ్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 


గరుగుబిల్లిలో...

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 4 : గరుగుబిల్లి మండలంలో కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటింకి వెళ్లి ప్రభుత్వ సాయం అందజేశారు. మండలంలోని 25 పంచాయతీల పరిధిలో 12,668 కార్డులకు రూ.1.26 కోట్లు మంజూరు అయ్యాయి. అయితే వైసీపీ కార్యకర్తలే ఇంటింటికి వెళ్లి అందించారు. 


కొమరాడలో...

కొమరాడ, ఏప్రిల్‌ 4: మండలంలో వైసీపీ మండల అధ్యక్షుడు, గంగరేగువలస ఎంపీటీసీ అభ్యర్థి డి.జనార్ధనరావు లబ్ధిదారులకు ప్రభుత్వ సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వలంటీర్లు పాల్గొన్నారు.


విజయనగరంలో...

విజయనగరం టౌన్‌, ఏప్రిల్‌ 4 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి రూ.1000 చొప్పున్న ఆర్థిక సాయం చేస్తుంది. ఈ డబ్బులను ఆయా వార్డుల్లో వలంటీర్లు కాకుండా అధికార పార్టీ నాయకులే అందిస్తున్నారు. శనివారం నగరంలోని అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని అందిస్తూ లోగుట్టుగా ప్రచారం చేసుకుంటున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2020-04-05T10:16:21+05:30 IST