వస్తోంది.. కేంద్ర సాయం

ABN , First Publish Date - 2020-04-05T10:11:18+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బియ్యం ఈ నెల 15 నుంచి జిల్లాలో పంపిణీ చేయనున్నారు.

వస్తోంది.. కేంద్ర సాయం

ఈ నెల 15 నుంచి బియ్యం పంపిణీ

జిల్లాలో 7,10,528 రేషన్‌కార్డుదారులకు మేలు

వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ


(పార్వతీపురం): లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బియ్యం ఈ నెల 15 నుంచి జిల్లాలో పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పేదలు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా సాయం అందిస్తోంది. ఇప్పటికే జన్‌ధన్‌ ఖాతాలున్న మహిళల పేరిట ప్రతి నెలా రూ. 500 చొప్పున మూడు నెలల పాటు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇందులో మొదటి నెల ఆర్థిక సాయం జమ కావడం ప్రారంభమైంది. ఇదిలాఉండగా ప్రతి పేదవానికి ఐదు కిలోల బియ్యం పంపిణీని త్వరలోనే చేపట్టనుంది. ఈ నెల 15 నాటికి జిల్లాలోని అన్ని రేషన్‌ డిపోలకు బియ్యం సరఫరా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.


వలంటీర్లతోనే...

జిల్లాలోని 34 మండలాలతో పాటు పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి పురపాలక సంఘాలు, విజయనగరం కార్పొరేషన్‌, నెల్లిమర్ల నగర పంచాయతీలో కలిపి 1,404 రేషన్‌ డిపోలు ఉన్నాయి. ఇందులో పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు ప్రాంతాల్లో  గిరిజన సహకార సంస్థ ద్వారా 8 సబ్‌ప్లాన్‌ మండలాల్లో 102 డీఆర్‌ డిపోలు ఉన్నాయి. 102 డీఆర్‌ డిపోల పరిధిలో 52,690 రేషన్‌కార్డులు ఉన్నాయి. పేదలందరికీ బియ్యాన్ని సకాలంలో చేర్చాలని కేంద్రం ఆదేశించింది. వైఏపీ కార్డులకు 35 కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. మిగతా వారికి 5 కిలోలు చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 778 సచివాలయాల పరిధిలో ఉన్న 1,233 మంది గ్రామ వలంటీర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ జరుగనుంది.


లబ్ధిదారుల ఇంటి ఇద్దకు వలంటీర్లు వెళ్లి బియ్యం అందజేస్తారు. ఈ బియ్యం కొండ శిఖర ప్రాంతాల ప్రజలకు అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వలంటీర్లకు అయ్యే రవాణా చార్జీలను ఐటీడీఏ లేదా జీసీసీ భరించే అవకాశం ఉంది. ఎందుకంటే డీఆర్‌ డిపోలకు మాత్రమే బియ్యం రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి గ్రామాల్లోకి తీసుకువెళ్లి  వలంటీర్లు అందించాంటే ప్రత్యేక రవాణాను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గిరిజన ప్రాంతాల్లో 12,876.55 క్వింటాళ్ల బియ్యం అందించనున్నారు. ఒక్కో క్వింటా బియ్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు మొత్తం రూ.18 చొప్పున జీసీసీ లేదా ఐటీడీఏ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


15 నుంచి ఇంటింటికీ పంపిణీ... ఎల్‌ఎన్‌ రెడ్డి, ఏఎస్‌వో, పార్వతీపురం

కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యాన్ని ఈ నెల 15 నుంచి  గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రారంభించాం. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు బియ్యం పూర్తిస్థాయిలో వచ్చిన తరువాత రేషన్‌ డిపోలకు పంపించి అక్కడ నుంచి వలంటీర్లు ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయిస్తాం.

 

Updated Date - 2020-04-05T10:11:18+05:30 IST