కరోనా పోరాటంలో పొదుపు మహిళ

ABN , First Publish Date - 2020-04-05T09:52:25+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. కరోనా వ్యాపించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి.

కరోనా పోరాటంలో పొదుపు మహిళ

ఓర్వకల్లులో మాస్కుల తయారీ

శానిటైజర్లు, దుస్తుల పంపిణీకి సిద్ధం

ఉద్యమ స్ఫూర్తి కొనసాగింపు


ఓర్వకల్లు, ఏప్రిల్‌ 2: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. కరోనా వ్యాపించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. దీందో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఇల్లు విడిచి వీధి కూడా దాటే పరిస్థితి లేదు. ప్రధాని ప్రకటించిన కొన్ని గంటల్లో ఇది అమల్లోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా రహదారులపై ప్రయాణికులు నిలిచిపోయారు. చదువు, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం తదితర పనులకోసం వెళ్లినవారు సొంత ప్రాంతాలకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఓర్వకల్లు పొదుపు మహిళలు ముందుకొచ్చారు. సామాజిక బాధ్యత విషయంలో ఎప్పుడూ ఓ అడుగు ముందుంటే వీరు గతంలో కోటాను కోట్ల రూపాయల సొమ్మును ప్రభుత్వానికి విరాళం రూపంలో అందజేశారు. ప్రస్తుతం తామే స్వయంగా రంగంలోకి దిగి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా కట్టడికి అవసరమైన వస్తువులు, దుస్తులు సమకూరుస్తున్నారు. 


మాస్కుల తయారీ

లాక్‌డౌన్‌ సమయంలోనూ వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, పాత్రికేయులు, ముఖ్య అధికారులు విధుల్లో కొనసాగుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వీరికి మాస్కులు, శానిటైజర్లు అత్యవసరం. డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో కొరత ఏర్పడింది. ధరలు కూడా పెరిగిపోయాయి. సమస్య పరిష్కారం కోసం ఓర్వకల్లు పొదుపు మహిళలు స్వయంగా మాస్కుల తయారీ చేపట్టారు. విధుల్లో ఉండేవారికి వీటిని ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. సుమారు రూ.3 లక్షలు వెచ్చించి పది వేలకు పైగా మాస్కులను తయారు చేస్తున్నారు. 


పంచేందుకు సిద్ధం

వలస కూలీలు సరిహద్దుల్లో ఇరుక్కుపోయారు. నిరాశ్రయులు, యాచకులు, అనాథల పరిస్థితి చెప్పాల్సిన పనే లేదు. వీరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే పెనుముప్పు తప్పదు. అందుకే ఓర్వకల్లు మండల సమాఖ్య ఆధ్వర్యంలో గౌరవ సలహాదారు విజయభారతి సహకారంతో మాస్కులు, దుస్తులు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. మాస్కులను సొంతంగా మిషన్లపై తయారు చేస్తున్నారు. పేస్టు, బ్రష్‌, సబ్బులు, తేనె, శానిటైజర్‌, దుప్పట్లు, టీ షర్టులు, టవళ్లు, చీరలు, మాస్క్‌లతో కూడిన కిట్‌ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓర్వకల్లు పొదుపు మహిళల ఉద్యమ స్ఫూర్తి జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆ గుర్తింపునకు వన్నె తెచ్చేలా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. లాక్‌డౌన్‌  కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు నిర్ణయించామని మండల సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి తెలిపారు.  


అండగా నిలుస్తాం.. కళ్యాణి, పొదుపు మహిళ


ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే పొదుపు మహిళల ధ్యేయం. మండల సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి సహకారంతో మాస్కులు తయారు చేస్తున్నాము. దాదాపు పది వేల మాస్కులను సిద్ధం చేసి ప్రజలకు, అధికారులకు, వైద్యులకు, పాత్రికేయులకు అందిస్తాము.


మా వంతు సాయం..పద్మావతి, పొదుపు మహిళ

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్నవారికి మా వంతు సాయం చేయాలని నిర్ణయించాము. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాస్కులు తయారు చేస్తున్నాము. ప్రజలు ఈ క్లిష్ట సమయంలో అప్రమత్తంగా ఉండాలి. 


భౌతిక దూరం పాటించాలి.. తాజున్నిసా, పొదుపు మహిళ

ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చు. దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు మహిళలు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నాం. 

 

Updated Date - 2020-04-05T09:52:25+05:30 IST