Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్నాళ్లిలా?

పీఏసీఎస్‌ల ఎన్నికలకు ఎదురుచూపు 

త్రీమెన్‌కమిటీలతో కాలయాపన

(ఇచ్ఛాపురం)

ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్‌) ఎన్నికల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మూడేళ్లుగా పూర్తి స్థాయి పాలక మండళ్లు లేకుండానే నెట్టుకొచ్చారు.  2018లో టీడీపీ ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా... అప్పట్లో సొసైటీలకు పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత త్రీమెన్‌కమిటీలను ఏర్పాటు చేసింది. ఎన్నికలు నిర్వహించాలని సహకార సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. త్రీమెన్‌ కమిటీలతోనే కాలయాపన చేస్తోంది. జిల్లాలో 50 పీఏసీఎస్‌ల్లో 70 వేల మంది సభ్యులు ఉన్నారు. రెండు లక్షల మంది వ్యవసాయ భూమి గల రైతులు సంఘాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ప్రతి ఓటరు రూ.300 చొప్పున సొసైటీలకు చెల్లించి సభ్యత్వం పొందారు. వీరికి స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, వాణిజ్య యంత్రాలను సంఘాలు అందజేస్తుంటాయి. రైతుల భూముల తనఖాపై కార్యదర్శులు రుణాలను అందిస్తారు. పీఏసీఎస్‌ల అధ్యక్షులు డీసీసీబీ డైరెక్టర్లను, ఆ డైరెక్టర్లు  చైర్మన్‌ను ఎన్నుకుంటారు. మూడేళ్లుగా సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇన్‌చార్జిలతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. రెగ్యులర్‌ పాలకవర్గాలు లేకపోవడంతో తమకు రుణాలు సక్రమంగా అందడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు సొసైటీ లక్ష్యాలు చేరుకోవడంలో వెనుకబడిపోతున్నాయి. రావాల్సిన బకాయిలు సక్రమంగా వసూలు కాకపోవడంతో సహకార సంఘాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలని సహకార సంఘాల ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఐదు నెలల కిందట హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ప్రభుత్వం కాలయాపన చేయడంతో సహకార సంఘాల ప్రతినిధులు, రైతుల్లో అసంతృప్తి నెలకొంది. 


ఆదేశాలు రాలేదు

సొసైటీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. జిల్లాలోని సొసైటీల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందజేశాం. ప్రస్తుతం ఓటరు జాబితాలను తయారు చేస్తున్నాం. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తాం. 

- కె.మురళీ కృష్ణమూర్తి, జిల్లా ప్రాథమిక సహకార పరపతి అధికారి, శ్రీకాకుళం

Advertisement
Advertisement