ఇసుకకు తగ్గిన డిమాండ్‌

ABN , First Publish Date - 2020-10-30T06:18:50+05:30 IST

విశాఖ నగరంతోపాటు రూరల్‌ ప్రాంతంలోని డిపోలకు ప్రస్తుతం గోదావరి ఇసుక మాత్రమే సరఫరా అవుతోంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం కాకముందే అక్కడ యంత్రాంగం ముందుగా ఇసుక నిల్వ చేసింది.

ఇసుకకు తగ్గిన డిమాండ్‌
అగనంపూడి డిపోలో ఇసుక

మందకొడిగా అమ్మకాలు

పండుగలు, వర్షాలు పడుతుండడం కారణం

టన్ను రూ.2000 పడుతుండడంతో కొనుగోలుకు

ముందుకురాని గ్రామీణ ప్రాంత వాసులు

ప్రస్తుతం గోదావరి ఇసుకే సరఫరా

జిల్లాలోని డిపోల్లో 2.75 లక్షల టన్నుల నిల్వలు

డిసెంబరు నుంచి స్థానికంగా రీచ్‌లు

నదుల్లో నీటి ప్రవాహంతో శ్రీకాకుళం ఇసుక బంద్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ నగరంతోపాటు రూరల్‌ ప్రాంతంలోని డిపోలకు ప్రస్తుతం గోదావరి ఇసుక మాత్రమే సరఫరా అవుతోంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం కాకముందే అక్కడ యంత్రాంగం ముందుగా ఇసుక నిల్వ చేసింది. గత ఏడాది ఇసుక నూతన విధానం ప్రారంభించినప్పుడు నగరానికి శ్రీకాకుళం జిల్లాలోని యార్డుల నుంచి రెండు లక్షల టన్నుల ఇసుక కేటాయించారు. ఆ మేరకు ఇసుక నగరానికి చేరింది. అయితే  వర్షాకాలం ప్రారంభం నుంచి నదుల్లో ప్రవాహాలు పెరగడంతో వంశధార, నాగావళి నదుల్లో రీచ్‌లు పూర్తిగా నీట మునిగాయి. దాంతో శ్రీకాకుళం నుంచి విశాఖకు ఇసుక సరఫరా నిలిచిపోయింది. కొందరు బల్క్‌ యూజర్లు శ్రీకాకుళం ఇసుక కోసం యత్నిస్తున్నా రీచ్‌లు నీటిలో వుండడంతో సాధ్యం కావడం లేదు. దీంతో ఒడిశా నుంచి ఇసుక కొనుగోలు చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతంలో రిటైల్‌ వినియోగదారుల కోసం పలుచోట్ల డిపోలు ఏర్పాటుచేశారు. అయితే ఆన్‌లైన్‌లో నాలుగున్నర టన్నుల లోపు ఇసుక బుక్‌ చేయడానికి అనుమతి లేదు. దీంతో నాలుగున్నర టన్నులకు మించి ఇసుక  అవసరం వున్న వినియోగదారులు మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. వీరికి ముడసర్లోవ, అగనంపూడి, అనకాపల్లి, అచ్యుతాపురం, చోడవరం డిపోల నుంచి ఇసుక సరఫరా చేస్తున్నారు. టన్ను రూ.1500, డిపో నుంచి గమ్య స్థానానికి రవాణా చార్జీలు...కలిపి ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే టన్నుకు రమారమి రెండు వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. అందుకే గ్రామీణ ప్రాంతంలో డిపోల నుంచి ఇసుక కొనుగోలుకు ప్రజలు ముందుకురావడం లేదు. అత్యవసరం అనుకుంటే సమీపంలో నది నుంచి ఏదోవిధంగా తెచ్చుకుంటున్నారు. 

తగ్గిన ఇసుక కొనుగోళ్లు

కాగా నగరంలో కూడా ఇసుక కొనుగోళ్లు తగ్గాయి. ఒకవైపు పండుగలు, మరోవైపు వర్షాలు పడుతుండడంతో కొనుగోలుదారులు ఆలోచించి బుక్‌ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేల టన్నుల ఇసుక వస్తుండగా మూడు వేల టన్నులు మాత్రమే విక్రయం జరుగుతోంది. దీంతో డిపోల్లో నిల్వలు పెరుగుతున్నాయి. గురువారం నాటికి జిల్లాలోని ఐదు డిపోల్లో 2.75 లక్షల టన్నుల ఇసుక ఉంది. అయితే నర్సీపట్నం, నక్కపల్లి, భీమిలి డిపోల్లో మాత్రం ఇసుక లేదు. శ్రీకాకుళం నుంచి సరఫరా నిలిచిపోవడంతో భీమిలి డిపోకు ఇసుక అందడం లేదు. భీమిలి ప్రాంతానికి చెందినవారు ముడసర్లోవ డిపో నుంచి బుక్‌ చేసుకుంటున్నారు. 

ఇక రాజమండ్రి నుంచి నక్కపల్లి, నర్సీపట్నం డిపోలకు ఇసుక సరఫరాకు లారీ యజమానులు ముందుకురావడం లేదు. కిలోమీటరుకు రూ.3.90  మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడంతో గిట్టుబాటు కాదని యజమానులు ససేమిరా అంటున్నారు. ఏడాది నుంచి ఈ సమస్య వున్నప్పటికీ ప్రభుత్వం పరిష్కరించడం లేదు. ఈ రెండు డిపోల పరిధిలో వినియోగదారులకు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి కేటాయిస్తున్నారు. భవిష్యత్తులో నర్సీపట్నం, నక్కపల్లి డిపోలను ఎత్తివేసే ఆలోచన కూడా ఉంది. నక్కపల్లి డిపో కొనసాగించాలని పాయకరావుపేట ఎమ్మెల్యే డిమాండ్‌ చేస్తున్నా రవాణా చార్జీల సమస్య పరిష్కారం కాలేదు.

కాగా గ్రామీణ ప్రాంతంలో ప్రజల అవసరాలకు నదులు, గెడ్డల నుంచి ఇసుక (థర్డ్‌ ఆర్డర్‌ రీచ్‌లు) రవాణాకు గత ఏడాది అనుమతించారు. అయితే ప్రస్తుతం నదులు, గెడ్డల్లో నీరు వుండడంతో తవ్వకాలు జరగడం లేదు. ఈ విషయాన్ని జిల్లా ఇసుక అధికారి డీవీఎస్‌ రాజు వద్ద ప్రస్తావించగా వర్షాలు తగ్గిన తరువాత ఆ రీచ్‌లకు అనుమతిస్తామన్నారు. గత ఏడాది కేటాయించిన 32 రీచ్‌లతోపాటు కొత్తగా 18 రీచ్‌లు గుర్తించామన్నారు. బహుశా డిసెంబరు నుంచి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు థర్డ్‌ ఆర్డర్‌ రీచ్‌ల నుంచి ఇసుక తవ్వుకునే అవకాశం లభించవచ్చునన్నారు. గ్రామ సచివాలయం నుంచి అనుమతి తీసుకున్న తరువాతే ఇసుక రవాణా చేయాల్సి ఉంటుందన్నారు.

గురువారం నాటి కి ఇసుక నిల్వలు

డిపో నిల్వ (టన్నులు)

ముడసర్లోవ 1,61,336.80 

అగనంపూడి 64,938.83

అచ్యుతాపురం 8,609.00

అనకాపల్లి 18,745.26

చోడవరం 16,557.26

నక్కపల్లి 1190.86

నర్సీపట్నం 2016.43

భీమిలి 169.93

Updated Date - 2020-10-30T06:18:50+05:30 IST