తవ్వుకో.. దోచుకో..

ABN , First Publish Date - 2022-01-07T06:20:31+05:30 IST

మండలంలోని గంగిరెడ్డిపాలెం శివారు గాంధీనగరం గ్రామం గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారింది.

తవ్వుకో.. దోచుకో..
గాంధీనగర్‌ సమీపంలో లారీలో గ్రావెల్‌ వేస్తున్న జేసీబీ

అనుమతులు ఒకచోట.. గ్రావెల్‌ తవ్వకాలు మరోచోట 

రెండు నెలల కిందటే పర్మిట్‌ గడువు పూర్తి

అయినా ఆగని గ్రావెల్‌ అక్రమ రవాణా

చర్యలు చేపట్టాలని కోరుతున్న స్థానికులు 


మాచవరం, జనవరి6: మండలంలోని గంగిరెడ్డిపాలెం శివారు గాంధీనగరం గ్రామం గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారింది. ఇక్కడి సంపదను ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఇందుకు స్థానిక అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

 గాంధీనగరం చెరువుకట్ట పిన్నెల్లి గ్రామానికి చెందిన యరవేద చిన్నరామిరెడ్డి అనే పేరుమీద 1128/1 లో 1-63 సెంట్ల భూమిలో గ్రావెల్‌ తరలింపునకు తాత్కాలిక అనుమతి పొందారు.  గ్రావెల్‌ తరలింపునకు మైనింగ్‌ శాఖ ఇచ్చిన పర్మిట్‌ గడువు గత నెలలో పూర్తయింది. కానీ నేటికీ రేయింబవళ్లు గ్రావెల్‌ తవ్వి తరలిస్తున్నారు. పైగా అనుమతులు తీసుకున్న సర్వే నెంబర్‌లో కాకుండా వేరే భూమిలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్‌ దాచేపల్లి సమీపంలో ఉన్న సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసం వేస్తున్న రైల్వేట్రాక్‌ కోసం వినియోగిస్తున్నారని సమాచారం. గతంలో అనేకసార్లు అనేకమంది ఈ ప్రాంతలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు జరిపినప్పటికీ మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు శాఖల నుంచి అడ్డుకోలేదు.  గ్రావెల్‌ తరలింపు చేస్తున్న భారీ వాహనాలతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు దుమ్ముధూళితో నిండిపోయి దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించి లోడులతో లారీలు వెళ్తుంటే రోడ్డు వెంబటి ఉన్న గృహాలకు పెచ్చులిస్తున్నాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. 


ఎవరికి వారే.. 

ఈ విషయంపై పలు శాఖలవారిని సంప్రదించగా.. ఒక సర్వే నెంబర్‌కు అనుమతిచ్చాం, వేరే సర్వే నెంబర్‌లో అక్రమ తవ్వకాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మైనింగ్‌ అధికారులు తెలిపారు. మైనింగ్‌ అధికారులు యంత్రాలను పట్టుకుని తమకు అప్పగిస్తే కేసు నమోదు చేస్తామని పోలీసు శాఖ తెలిపింది. రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా సదరు సర్వే నెంబర్లు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటామన్నారు. అయితే లక్షలాది రూపాయల విలువైన గ్రావెల్‌ తరలింపు వెనుక స్థానిక అధికార పార్టీ నేతలు అండదండలు పుష్కలంగా ఉండటంతో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునేందుకు పూనుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిఽధులు స్పదించి ప్రకృతి సంపదను కాపాడాలని మండల ప్రజానీకం కోరుతుంది. 

Updated Date - 2022-01-07T06:20:31+05:30 IST