ఏసుక్రీస్తు శిలువ మోసినట్టు అధికారుల పాపాలను మోయలేం! : హైకోర్టు

ABN , First Publish Date - 2021-01-14T16:40:07+05:30 IST

ఏసుక్రీస్తు శిలువ మోసినట్టు అధికారుల పాపాలను మోయలేం! : హైకోర్టు

ఏసుక్రీస్తు శిలువ మోసినట్టు అధికారుల పాపాలను మోయలేం! : హైకోర్టు

చెన్నై : ఏసుక్రీస్తు శిలువ మోసినట్టుగా అధికారుల పాపాలను న్యాయస్థానం మోయలేదని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించా లని స్పష్టం చేసింది. అధికారుల తప్పిదాల కారణంగా కోర్టుల్లో పలు కేసులు దాఖలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు రూ.లక్ష, 50 వేల చొప్పున నష్టపరిహారం అందజేయాలని ధర్మపురి, పెరంబలూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.శేషసాయి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.


ధర్మపురి జిల్లా వీరప్పనాయకన్‌పట్టిలో రత్నం అనే మహిళకు చెందిన నాలుగెకరాల వ్యవసాయ భూమిని 1987లో ఓ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా, 2000 సంవత్సరంలో న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే అప్పటినుంచి అధికారులు ఆ భూమిని ఆమెకు స్వాధీనం చేయలేదు. అలాగని కోర్టు ఉత్తర్వులపైనా అప్పీలుకు వెళ్లలేదు. దీంతో రత్నం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూమిని అధికారులు తనకు అప్పగించడం లేదని వివరించింది. అదేవిధంగా పెరంబలూరుకు చెందిన జయలక్ష్మి కూడా ఇదేవిధమైన వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది.


ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.శేషసాయి.. అధికారుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కోర్టు ఆదేశించి 20 ఏళ్లు అవుతున్నా, పిటిషనర్లకు భూములను అప్పగించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. పొంతనలేని అధికారుల వ్యవహారశైలితో పడిన చిక్కుముడిని పరిష్కరించడం న్యాయస్థానాలకు కష్టంగా మారుతుందన్నారు. ఆ భూములను పిటిషనర్ల పేర్లపైకి మార్చాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పిటిషనర్లకు నష్టపరిహారం అందజేయా లని ఆదేశించారు. తమ ఆదేశాలను అమలు చేసి సమగ్ర నివేదికలను దాఖలు చేయాలని రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

Updated Date - 2021-01-14T16:40:07+05:30 IST