నిషా.. తమాషా!

ABN , First Publish Date - 2021-07-31T06:03:02+05:30 IST

ఆర్టీసీ కండక్టర్‌ ఒకరు తెలంగాణ మద్యం తెచ్చారు.

నిషా.. తమాషా!

ఆర్టీసీ కండక్టర్‌ వద్ద తెలంగాణ మద్యం సీసాలు

స్వాధీనం చేసుకున్న గవర్నర్‌ పేట-2 డిపో సెక్యూరిటీ అధికారి 

కండక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు 

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు మాయం 

విజిలెన్స్‌ విచారణలో గుర్తింపు

తానే వినియోగించినట్టు సెక్యూరిటీ అధికారి వివరణ 

సెక్యూరిటీ అధికారిని రక్షించేందుకు  విజిలెన్స్‌ అధికారి వ్యూహం 

మద్యం ఉందంటూ వివరణ తారుమారు..

తెలంగాణ మద్యం స్థానంలో లోకల్‌ బ్రాండ్స్‌


ఆర్టీసీ కండక్టర్‌ ఒకరు తెలంగాణ మద్యం తెచ్చారు. ఓ సెక్యూరిటీ అధికారి దానిని స్వాధీనం చేసుకున్నారు. కండక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆ వివరాలను రికార్డుల్లోకీ ఎక్కించారు. తర్వాత ఆ మద్యంపై మనసు మళ్లిందో ఏమో గుట్టుచప్పుడు కాకుండా లాగించేశారు. ఈ నిజం విజిలెన్స్‌ తనిఖీలతో వెలుగులోకి వచ్చింది. ఆ మద్యాన్ని తానే వినియోగించానని సెక్యూరిటీ అధికారి లిఖితపూర్వకంగా అంగీకరించారు. న్యాయంగా అయితే కండక్టర్‌కు ఇచ్చినట్టే ఈ అధికారికీ పనిష్మెంట్‌ ఇవ్వాలి. అలా చేయలేదు సరికదా విజిలెన్స్‌ అధికారుల ఉచిత సలహాతో మద్యంను తెచ్చి అక్కడ పెట్టారు. అయితే అది తెలంగాణాది కాదు. ఆంధ్రా బ్రాండ్‌. ఇప్పుడు ఇది మరో నేరం. ఈ వ్యవహారంపై ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా విజిలెన్స్‌ అంతర్గత విచారణ జరుగుతోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :  ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ లోని అధికారుల తీరుకు ఈ ఘటనే నిదర్శనం. విజయవాడ సిటీ డివిజన్‌ పరిధిలోని గవర్నర్‌పేట - 2 డిపో పరిధిలోని రూట్‌ నెంబర్‌ 308 బస్సు విజయవాడ - విస్సన్నపేట మధ్య నడుస్తుంది. ఈ బస్సు తెలంగాణ సరిహద్దుల్లోకి వెళుతుంది. ఈ బస్సులో డ్యూటీ చేస్తున్న ఓ కండక్టర్‌ ఇటీవల ఆ ప్రాంతం నుంచి తెలంగాణ మద్యం బాటిళ్లు తెచ్చుకున్నారు. ఈ సమాచారం ఆర్టీసీ అధికారులకు అందింది. బస్సు డిపోకు చేరుకోగానే సెక్యూరిటీ అధికారి ఒకరు తనిఖీ చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు నివేదించారు. సెక్యూరిటీ అధికారి ఇచ్చిన వివరణ ఆధారంగా ఉన్నతాధికారులు ఆ కండక్టర్‌ పై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచే అసలు ట్విస్ట్‌ మొదలైంది. కండక్టర్‌ సస్పెన్షన్‌కు కారణమైన సెక్యూరిటీ అధికారి ఈ బాటిళ్లను మాయం చేశారు. నిబంధనల ప్రకారం డిపో సెక్యూరిటీ అధికారి ఏమి స్వాధీనం చేసుకున్నారో వాటిని రికార్డుల్లో చూపించాలి. అలాగే చూపించారు కూడా. 


మాఫీ చేసేందుకు లోకల్‌ బ్రాండ్‌

సెక్యూరిటీ అధికారి మీద చర్యలు తీసుకుంటే తమకు చెడ్డ పేరు వస్తుందనకున్నారో ఏమో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని ఓ అధికారి సెక్యూరిటీ అధికారిని రక్షించేందుకు మద్యం బాటిళ్లు అక్కడే ఉన్నాయని మరో లెటర్‌ రాసి ఇవ్వమని నిర్దేశించినట్టు సమాచారం. దీంతో సెక్యూరిటీ అధికారి ఆగమేఘాల మీద లోకల్‌ బ్రాండ్‌ మద్యం కొనుగోలు చేసి, తెలంగాణ మద్యం స్థానంలో ఉంచారు. తాను స్వాధీనం చేసుకున్న బాటిల్స్‌ బీరువాలోనే ఉన్నాయని, ఆ రోజు పొరపాటున వేరే బీరువాను తెరిచి, లేవని భావించానని లెటర్‌ రాసినట్టు తెలుస్తోంది. ఈ లెటర్‌ ఆధారంగా సెక్యూరిటీ అధికారిని రక్షించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మాయమైంది తెలంగాణ బ్రాండ్‌ మద్యం.. ఆ స్థానంలో లోకల్‌ బ్రాండ్‌ను చూపించి, రికార్డులను ఏ విధంగా మార్చగలరన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఇలా చేయాలంటే రికార్డులను ట్యాంపరింగ్‌ చేయాల్సి ఉంటుంది. అదే చేస్తే మరో నేరమవుతుంది. సెక్యూరిటీ అధికారిని కాపాడతారా? కండక్టర్‌ను సస్పెండ్‌ చేసినట్టు అతనిపై కూడా వేటు వేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. 


విజిలెన్స్‌ జోక్యంతో తారుమారు

తాజాగా గవర్నర్‌పేట - 2 డిపోను విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. కండక్టర్‌ నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్ల గురించి ఆరా తీశారు. ఆ బాటిళ్లను తానే ఉపయోగించినట్టు ఆ సెక్యూరిటీ అధికారి లిఖితపూర్వకంగా అంగీకరించారు. కండక్టర్‌ ఎలాంటి తప్పు చేశాడో..  సెక్యూరిటీ అధికారి కూడా అదే తప్పు చేశాడు. అయితే కండక్టర్‌ను సస్పెండ్‌ చేసినంత వేగంగా సెక్యూరిటీ అధికారిని సస్పెండ్‌ చేయకపోవటం గమనార్హం. 

Updated Date - 2021-07-31T06:03:02+05:30 IST